శ్రీనగర్ : మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారిపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్ముకాశ్మీర్‌లోని బారాముల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తీవ్రగాయాలైన ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రిటైర్డ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీ జిల్లాలోని గంట్ముల్లా ప్రాంతంలోని ఓ మసీదులో ప్రార్థనలు జరుపుతుండగా కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూంచ్ జిల్లాలో సైనికుల వాహనంపై ఉగ్రవాదులు దాడి ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం ఈ హత్య ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల పూంచ్ జిల్లాలో సైన్యాన్ని తరలిస్తున్న వాహనాలపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన పీపుల్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దాడి జరిగిన మరుసటి రోజు ఆప్రాంతంలో ముగ్గురు పౌరుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారు సఫీర్ హుస్సేన్, మహ్మద్ షోకేత్, షబీర్ అహ్మద్‌లుగా పేర్కొన్నారు. పూంచ్ దాడి గురించి ప్రశ్నించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది సాధారణ పౌరుల్లో వీరు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించినట్లు తెలిపింది.