Tuesday, March 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి పెద్ద స్కామ్‌

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి పెద్ద స్కామ్‌

- Advertisement -

విచారణకు హౌస్‌ కమిటీ వేయాలి
ప్రశ్నోత్తరాల్లో బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు
మీరు చెప్పినోళ్లకు ఇవ్వకపోతే అవినీతి జరిగినట్టా?
ఆ దేశ ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం చేసుకున్నాం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి పెద్ద స్కామ్‌ అనీ, దానిపై విచారణకు హౌస్‌ కమిటీ వేయాలని స్పీకర్‌ను బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత టి.హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. బియ్యం ఎగుమతి చేయడానికి పెట్టుకున్న అడ్వైజర్‌ ఘరానా మోసగాడు.. ఈడీ, సీబీఐ కేసులున్న వ్యక్తిని ఎలా అడ్వైజర్‌గా నియమించుకున్నారు? అది నిజమా? కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ…బియ్యం ఎగుమతికి సంబంధించి మీరు రికమండ్‌ చేసిన వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే అవినీతి జరిగినట్టా హరీశ్‌రావు అంటూ ధీటుగా సమాధానమిచ్చారు. సోమవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోర్తరాల సమయంలో ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు అనే అంశంపై హరీశ్‌రావు, పల్లారాజేశ్వర్‌రెడ్డి పలు ప్రశ్నలను సంధించారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ…ప్రేమ్‌చంద్‌ గార్గే ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి కోసం ఎంఓయూ చేసుకున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా..ఇప్పుడు అది పెద్ద స్కామ్‌గా మారిందని ఆరోపించారు. నాఫెడ్‌ సంస్థ ముందే డబ్బులు ఇస్తామని హామీనిస్తే బియ్యం ఇయ్యకుండా ప్రయివేటు సంస్థకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎగుమతి 27,500 మెట్రిక్‌ టన్నుల వద్దనే ఎందుకు ఆగిపోయిందని నిలదీశారు.

ఏడాదిగా 7500 మెట్రిక్‌ టన్నుల బియ్యం కాకినాడ పోర్టులో ముక్కిపోతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గోదాం, హ్యాండ్లింగ్‌ చార్జీల భారం ప్రభుత్వం మీద పడట్లేదా? అని అడిగారు. వాటాలు తేలకపోవడమే ఎగుమతి ఆగిపోవడానికి కారణం కాదా? అని ప్రశ్నించారు. కొందరి తీరుతో ప్రభుత్వా నికి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆరోపించారు. హౌస్‌ కమిటీ వేస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..రైతులకు సన్నవడ్లకు సంబంధించి రూ.1208 కోట్ల బోనస్‌ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యాన్ని ఆలస్యంగా సేకరించడాన్ని తప్పుబట్టారు. మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

నిరాధార ఆరోపణలతో తప్పుదోవ పట్టించొద్దు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సభలో నిరాధార ఆరోపణలు చేయడం హరీశ్‌రావుకు తగదని రాష్ట్ర మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. మీరు రికమండ్‌ చేసిన వ్యక్తికి బియ్యం ఎగుమతి ఒప్పందం ఇవ్వకపోతే అవినీతి జరిగినట్టా? ఏ అధికారి దగ్గరకు వెళ్లి ఒత్తిడి చేశారో చెప్పాలా? అంటూ హరీశ్‌రావును ప్రశ్నించారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో ఎలాంటి మధ్యవర్తులు లేరనీ, నేరుగా ఆ దేశ ప్రభుత్వంతో మన సర్కారు లక్ష మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని స్పష్టం చేశారు. మొదటి విడతలో 12,750 మెట్రిక్‌ టన్నులు, రెండో విడతలో 10 వేల మెట్రిక్‌ టన్నులు మొత్తంగా 22,750 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేశామనీ, క్వింటాకు రూ.3,600 చొప్పున అమ్మామని వివరించారు. గోదాముల్లో నిల్వ, ఇన్సూరెన్స్‌, తదితరాలన్నింటినీ ఆ దేశ ప్రభుత్వమే భరిస్తున్నదని తెలిపారు.

ఎఫ్‌సీఐ గ్రేడ్‌-ఏ రకానికి నియమించి రూ.3,446 కంటే ఇది అధికమని చెప్పారు. ఆ దేశానికి బియ్యం ఎగుమతుల ద్వారా ఇప్పటి వరకూ రూ. 81.90 కోట్ల ఆదాయం వచ్చిందనీ, రూ.1.13 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించారు. ఫిలిప్పీన్స్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం వల్ల ఎగుమతుల విషయంలో ఆలస్యం జరుగుతున్నదని తెలిపారు. 2025 సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం విదేశాల నుంచి బియ్యం దిగుమతులపై సాధారణ నిషేధం విధించినప్పటికీ…తెలంగాణ నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యం విషయంలో ప్రత్యేక అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. కేంద్రం 54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకే అనుమతించిందనీ, అయినా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి 71.86 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని వివరించారు. గతం కంటే అధిక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, రైతుల నుంచి గింజ లేకుండా కొంటున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -