తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, మాంసం ధరలు

నవతెలంగాణ-హైదరాబాద్ : కార్తీక మాసం ముగియడంతో రాష్ట్రంలో కోడి గుడ్లు, మాంసం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది. కేవలం వారం వ్యవధిలో డజన్ గుడ్ల ధర రూ.72 నుంచి 84కు పెరిగింది. ఇక కార్తీక మాసంలో కిలో చికెన్ ధర రూ.170గా ఉండగా ప్రస్తుతం ఇది రూ.240కి చేరుకుంది. తెలంగాణలో మొత్తం 1100 కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఏటా 17.67 బిలియన్ గుడ్ల ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. కానీ, చలికాలం కారణంగా కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడి ఉత్పత్తి తగ్గిందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు, దాణా చార్జీలు, రవాణా చార్జీల పెరుగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర గతేడాది రూ.5 వేలు ఉండగా ప్రస్తుతం రూ.7200 వేలకు పెరిగింది. రాష్ట్రంలో సగటున 80 లక్షల కోడిగుడ్ల విక్రయాలు జరుగుతాయి. కానీ కరోనా భయాల నేపథ్యంలో వారం రోజులుగా ఈ సంఖ్య కోటి దాటిందని పౌల్ట్రీ వర్గాలు చెప్పాయి.

Spread the love