రెక్కాడితేగాని డొక్కాడని లక్షలాది మందిని పనుల్లేక ఆకలి కబళించడమే కాదు, ఆ కూలి పనులకెళ్లేటపుడో, వచ్చేటపుడో నల్లతాచులాంటి రోడ్లు, రోడ్లపై వాహనాలు కూడా మింగేయడం నేటి వాస్తవం. పది పదిహేను మంది నెక్కించుకుంటే గాని పెరిగిన పెట్రోల్ చార్జీలతో తమ జీవిత బండిని నెట్టుకుపోలేని ఆటోలు, పశువుల్లాగా మందే సుకుని నడిచే ట్రాక్టర్ ట్రాలీల్లో గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య ఆకలే కందెనగా నడిచే లక్షలాది కూలీల జీవితాలు ఏ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయో నిన్న మోతే దగ్గర జరిగిన ప్రమాదమే సాక్ష్యం.
మన రాష్ట్రంలో ఎక్కువ ప్రమాదాలు సా|| 6 నుండి రాత్రి 9 గంటల మధ్యనే జరుగుతున్నాయి. గతేడాది మొత్తం 94వేలకు పై ప్రమాదాలు జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇది మొత్తం దేశంలో జరిగిన ప్రమాదాల్లో 20 శాతానికి పైగానే ఉన్నాయి. ప్రమాదాల్లో పాదచారులే ఎక్కువగా మరణిస్తున్నారు. ప్రమాదాల నుంచి పాదచారులను కాపాడేందుకు 31 చోట్ల పెలికాన్ సిగల్స్ ఏర్పాటు చేసినా… గతేడాదికంటే ఈ ఏడాది మృతుల సంఖ్య అధికంగా ఉంది.
రహదారుల్లో ఈ మధ్య చోటుచేసుకున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న ఏపీలో మిర్చి యార్డులో మిరప పంట అమ్మగా వచ్చిన రూ.10 లక్షల నగదుతో ఇంటికి బయల్దేరిన ముగ్గురు రైతులు ఆటో ప్రమాదంలో నగదుతోపాటు బుగ్గి కావడంతో ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత సైతం ఈ వారంలోనే కారు ప్రమాదానికి బలయ్యారు. ఇలా ఎన్నో ప్రమాదాలు.
ఏడెనిమిది సెకన్లలోనే వంద కిలోమీటర్లకుపైగా వేగా న్నందుకునే బైకులు, కారులు, ఇతర వాహనాలు ఒక వైపు.. రాష్ట్రంలో గుంతలు, ఎగుడుదిగుళ్లతో నరకానికి నకళ్లుగా మారిన రహదారులు మరోవైపు.. ఉన్నాయి. కొన్ని దేశాల్లో వాహనాల ఉత్పత్తి దశలోనే స్పీడ్ కంట్రోల్‌కు అవసరమైన చర్యలు చేపట్టి అద్భుత ఫలితాలు సాధిస్తుండగా, మన దేశంలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. కార్పొరేట్ల ఒత్తిడికి తలొగ్గి అభివృద్ధి చెందిన దేశాల రహదారులకు అనువైన మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలకు ఇక్కడ అనుమతిస్తున్నారు. వీటికి అనుమతించడంలో ఉన్న శ్రద్ధ, రహదారుల అభివృద్ధిపైనా, సరైన భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడం.. సామాన్యుల ఉసురుతీస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఏటా 13 లక్షల మంది ఉసురుతీస్తున్నాయి. మరో రెండు కోట్లకు పైగా క్షతగాత్రులవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యని, 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారని 2022 నాటి కేంద్రప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారే 69 శాతం.
ఉపాధి మార్గాలు కుంచించుకుపోతున్నాయి. మోడీ సర్కారు ఏలుబడిలో… గత మూడేళ్లలో ఉపాధి హామీ పని దినాలు కోటి తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో పనులు వెతు క్కుంటూ దూర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. పని కోసం నిత్యం ఆటోలు, లారీ లు, వ్యాన్లు తదితర వాహనాల్లో వెళ్లే… వీరు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. రోడ్ సెస్ వసూలు చేయడంపైనున్న శ్రద్ధలో కొంతయినా రోడ్ల నిర్వహణపై పెట్టాలి. వసూలైన సెస్ సొమ్ము కొత్త రోడ్ల నిర్మాణానికి, ఉన్నవాటి నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలి. అలా గాకుండా ప్రభుత్వాలు ‘తమ’ ప్రాధాన్యతలను బట్టి మళ్లించ కుండా కట్టుదిట్టమైన నిబంధనలుండాలి. రోడ్డు ప్రమాద మతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకునేందుకు సకల చర్యలు చేపట్టాలి.
ఈ ఏడాది మృతుల సంఖ్య అధికంగానే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్‌స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ ఇత్యా ది కారణాలతో 2023లో వేర్వేరు ప్రమాదాల్లో 121 మంది పాదచారులు మృతిచెందారు. వీరిలో అత్యధికులు వృద్ధులు, యాచకులే.
ట్రాన్స్‌పోర్ట్ రంగంలో పనిచేసే సంఘాలు ఎప్పట్నించో మొత్తుకుంటున్న విషయమే మంటే రోడ్ ఇంజనీరింగ్ సిస్టమే మన దేశంలో, రాష్ట్రంలో అధ్వాన్నస్థితిలో ఉన్నాయి. మన తెలంగాణలో ఏడు వందలకు పైగా ‘బ్లాక్ హోల్స్’ ఉన్నట్టు గుర్తించినా ఈ పదేండ్లలో ఇంకా 300కి పైగా చోట్ల రిపేర్లు జరగలేదు. అదే చేసుంటే మహబూబ్‌నగర్ జిల్లా ‘పాలెం’ వద్ద బస్సు తగలబడి పదుల సంఖ్యలో ప్రయాణికులు మంటలకాహుతి అయ్యుండే వారే కాదని ప్రభుత్వ నివేదిక చూస్తే అర్థమవుతుంది.
నిదానంగా వెళ్లే వాహనాలు, అత్యంత వేగంగా వెళ్లే ఎస్.యు.వి. లాంటి వాహనాలు ఒకే రోడ్డుపై వెళ్లడం, అక్కడే సైకిల్స్ కూడా వెళ్లడం, టర్నింగుల వద్ద సరైన సిగల్స్ లేకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటిని సరి చేయడం ప్రభుత్వాల బాధ్యత.