రోహిత్‌, జడేజా శతక జోరు

Rohit Jadeja Centuries– అర్థ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్‌ ఖాన్‌
– యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌, రజత్‌ విఫలం
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 326/5
– రాజ్‌కోట్‌ టెస్టు మూడో రోజు
రాజ్‌కోట్‌ టెస్టు. టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పరుగుల పిచ్‌పై ఆతిథ్య జట్టు బ్యాటర్ల జాతరే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్‌ సీమర్‌ మార్క్‌వుడ్‌ తొలి అర్థ గంటలోనే దెబ్బకొట్టాడు. యశస్వి జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (0), రజత్‌ పటీదార్‌ (5) నిరాశపరచగా.. 33 పరుగులకే భారత్‌ టాప్‌-3 వికెట్లు కోల్పోయింది. మిడిల్‌ ఆర్డర్‌లో సీనియర్‌ బ్యాటర్ల గైర్హాజరీలో టీమ్‌ ఇండియా పీకల్లోతు కషాల్లో కూరుకుంది.
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (131), లోకల్‌ బారు రవీంద్ర జడేజా (110 బ్యాటింగ్‌) సెంచరీలతో చెలరేగారు. నాల్గో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ను గట్టెక్కించారు. అరంగ్రేట ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (62) ధనాధన్‌ మెరుపులతో కదం తొక్కటంతో తొలి రోజు టీమ్‌ ఇండియా 326 పరుగుల మంచి స్కోరు నమోదు చేసింది. మరో ఐదు వికెట్లు చేతిలో ఉండగా నేడు భారత్‌ 400 ప్లస్‌ స్కోరుపై కన్నేసి బరిలోకి దిగనుంది.
నవతెలంగాణ-రాజ్‌కోట్‌
రోహిత్‌ శర్మ (131, 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (110 నాటౌట్‌, 212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాజ్‌కోట్‌లో శతక మోత మోగించారు. బ్యాటింగ్‌ లైనప్‌లో యువ క్రికెటర్లు విఫలమైన వేళ ఇద్దరు సీనియర్లు బాధ్యత తీసుకున్నారు. నాల్గో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఇంగ్లాండ్‌ పేసర్లు, స్పిన్నర్లు కవ్వించిన తరుణంలో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టుకు పైచేయి అందించారు. అరంగ్రేట బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (62, 66 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) 48 బంతుల్లోనే అర్థ సెంచర్కీమసాధించాడు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌ (3/69) మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్‌ టామ్‌ హర్ట్‌లీ (1/81) ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు.
ఆరంభంలో ఆందోళన భారత్‌ 93/3
బ్యాటింగ్‌ పిచ్‌పై టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత ఇంగ్లాండ్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. తొలి రెండు రోజులు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో భారత బ్యాటర్లు దంచికొడతారనే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్‌ సీమర్‌ మార్క్‌వుడ్‌, స్పిన్నర్‌ టామ్‌ హర్ట్‌లీ తొలి పది ఓవర్లలోనే కోలుకోలేని దెబ్బకొట్టారు!. విశాఖ టెస్టు ద్వి శతక హీరో యశస్వి జైస్వాల్‌ (10) రెండు బౌండరీలతో ఊపందుకున్నాడు. కానీ మార్క్‌వుడ్‌ వేసిన బంతి అదనపు బౌన్స్‌ అంచనా వేయలేకపోయిన జైస్వాల్‌..స్లిప్స్‌లో దొరికిపోయాడు. దీంతో 24 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ (0) నిరాశపరిచాడు. మార్క్‌వుడ్‌ మరో మెరుపు బంతితో గిల్‌ కథను సున్నా పరుగులకే ముగించాడు. దీంతో 24 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. నం.4 బ్యాటర్‌ రజత్‌ పటీదార్‌ (5) స్పిన్నర్‌ టామ్‌ హర్ట్‌లీ మాయలో పడ్డాడు. బౌన్స్‌ను అంచనా వేయలేని రజత్‌ పటీదార్‌ కవర్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. 8.5 ఓవర్లలో 33/3తో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ను కాదని సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. కుడి-ఎడమ కాంబినేషన్‌తో పాటు స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ను నిలుపుకునే వ్యూహం ఫలించింది. తొలి సెషన్లో రోహిత్‌, జడేజా జోడి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఒత్తిడిలోనూ రోహిత్‌, జడేజాలు ఆకట్టుకున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 8 ఫోర్లతో 72 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. తొలి సెషన్లో భారత్‌ 25 ఓవర్లలో 3 వికెట్లకు 93 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్‌ గాడిలో పడింది : భారత్‌ 185/3
ఉదయం సెషల్లో ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌..లంచ్‌ విరామం అనంతరం కుదురుకుంది. ఈ సెషన్లో భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 92 పరుగులు సాధించింది. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుకు మంచి పునాది వేసుకుంది. సొంత మైదానంలో రవీంద్ర జడేజా సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ ఎండ్‌లో రోహిత్‌ శర్మ దూకుడుగా పరుగులు సాధించగా, మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా సహకారం అందించాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రెండో సెషన్లో బౌలర్లను మార్చి ప్రయోగించినా ఎటువంటి ఫలితం దక్కలేదు. రోహిత్‌, జడేజా భాగస్వామ్యం విడదీసే ప్రయత్నాలు విజయవంతం కాలేదు. 97 బంతుల్లో ఐదు ఫోర్లు బాదిన రవీంద్ర జడేజా.. అర్థ సెంచరీ అందుకున్నాడు. దీంతో రెండో సెషన్లో టీమ్‌ ఇండియా పూర్తి ఆధిపత్యం సాధించింది. టీ విరామ సమయానికి భారత్‌ 185/3 పరుగుల వద్ద నిలిచింది.
సర్ఫరాజ్‌ ధనాధన్‌ : భారత్‌ 326/5
రోహిత్‌ శర్మ మెరుపు సెంచరీ నమోదు చేశాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 157 బంతుల్లో శతక మోత మోగించాడు. రోహిత్‌ శతక నాదంతో భారత్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. జడేజాతో కలిసి నాల్గో వికెట్‌కు 204 పరుగులు జోడించిన అనంతరం రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయాడు. ఆ తర్వాత యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (62) మేనియా మొదలైంది. కెరీర్‌ తొలి ఇన్నింగ్స్‌ను సర్ఫరాజ్‌ ఖాన్‌ దూకుడుగా మొదలెట్టాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. జడేజా ఓ ఎండ్‌లో 99 పరుగుల వద్ద ఉండగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ వికెట్ల మధ్య పరుగులో సమన్వయ లోపంతో రనౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో మెరుపు ఇన్నింగ్స్‌కు అనూహ్య ముగింపు పడింది. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 198 బంతుల్లో సెంచరీ సాధించిన రవీంద్ర జడేజా.. తొలి రోజ ఆట ముగిసే సమయానికి అజేయంగా నిలిచాడు. నైట్‌వాచ్‌మన్‌ కుల్దీప్‌ యాదవ్‌ (1 నాటౌట్‌) వికెట్‌ నిలుపుకున్నాడు. మూడో సెషన్లో భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు సాధించింది.
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) జో రూట్‌ (బి) మార్క్‌వుడ్‌ 10, రోహిత్‌ శర్మ (సి) బెన్‌ స్టోక్స్‌ (బి) మార్క్‌వుడ్‌ 131, శుభ్‌మన్‌ గిల్‌ (సి) బెన్‌ ఫోక్స్‌ (బి) మార్క్‌వుడ్‌ 0, రజత్‌ పటీదార్‌ (సి) బెన్‌ డకెట్‌ (బి) టామ్‌ హర్ట్‌లీ 5, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ 110, సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్‌ (మార్క్‌వుడ్‌) 62, కుల్దీప్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ 1, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (86 ఓవర్లలో 5 వికెట్లకు) 326.
వికెట్ల పతనం : 1-22, 2-24, 3-33, 4-237, 5-314.
బౌలింగ్‌ : జేమ్స్‌ అండర్సన్‌ 19-5-51-0, మార్క్‌వుడ్‌ 17-2-69-3, టామ్‌ హర్ట్‌లీ 23-3-81-1, జో రూట్‌ 13-1-68-0, రెహాన్‌ అహ్మద్‌ 14-0-53-0.

Spread the love