రష్యా-ఉత్తర కొరియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవటం ప్రపంచ పరిణామాల్లో ఒక ముఖ్యమైన అంశం. ఇరవై నాలుగేండ్ల తరువాత రష్యా అధినేత వ్లదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా సందర్శనలో సంతకాలు చేశారు.తమ కంట్లో నలుసుగా, పంటికింద రాయిగా, కాళ్లో ముల్లుగా ఉన్న దేశాలను అణగదొక్కేందుకు చూస్తున్న అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలకు సహజంగానే ఇది మింగుడు పడక చిందులు వేస్తున్నది. ఉక్రెయిన్‌తో పదేండ్ల రక్షణ ఒప్పందాన్ని అమెరికా కుదుర్చుకున్నపుడు లేని రచ్చ ఇప్పుడెందుకు ? తన అణుకార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు, పదును పెంచేందుకు ఈ ఒప్పందం గురించి అమెరికా తప్పుడు ప్రచారం ప్రారంభించింది. ఉత్తర కొరియా అందిస్తున్న ఆయుధాలకు ప్రతిగా దాని అణు కార్యక్రమానికి, ఖండాంతర క్షిపణుల వృద్ధి, అణు జలాంతర్గాముల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యుద్ధ విమానాలు,సాయుధ శకటాలను అందించనుందని అంటున్నది. ఇదంతా పశ్చిమ దేశాలను మరింతగా భయపెట్టి తన కౌగిట్లో బంధించుకొనేందుకు, వాటితో పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనిపించేందుకు అన్నది స్పష్టం.నాటో కూడా దానికి తానతందాన అన్నది. అసలు ఒప్పంద పత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు, దానిలో ఉన్న అంశాలేమిటో తెలియకుండానే ఇలా చెప్పటంలో ఆశ్చర్యం లేదు.
పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలను ఆత్మరక్షణకే గాక అవసరమైతే రష్యా భూభాగాలపై దాడులు చేసేందుకు కూడా జెలెన్‌స్కీ సేనలకు అనుమతి ఇచ్చిన అంశం తెలిసిందే. తెలివితేటలు పశ్చిమదేశాల గుత్త సొత్తేమీ కాదు. ఎవరి తురుపు ముక్కలు వారికి ఉంటాయి.కంటికి కన్ను పంటికి పన్ను మాదిరి ఉంటేనే అగ్రరాజ్యం ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉంటుంది.రష్యాకు వ్యతిరేకంగా, అసలు సమస్య నుంచి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు స్విడ్జర్లాండ్‌లో నిర్వహించిన ఉక్రెయిన్ శాంతి సభ సాధించేందేమీ లేదు. అమెరికా కూటమికి చెంపపెట్టుగా దానికి హాజరైన అనేక ముఖ్యదేశాలు సమావేశ ప్రకటనపై సంతకాలు చేసేందుకు తిరస్కరించాయి. హాజరైన 90దేశాలలో భారత్, బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా వంటి పన్నెండు దేశాలు వాటిలో ఉన్నాయి. సం తకం చేసిన ఇరాక్, జోర్డాన్ తరువాత ఉపసంహరించు కున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సమావేశానికి రష్యాను పిలవలేదు, ఆహ్వానం అందుకున్న చైనా తిరస్కరించింది. రష్యా లేకుండా ఆ సభ సాధించేదేమీ ఉండదని చెప్పింది. కొలంబియా చివరి నిమిషంలో తాము హాజరు కావటం లేదని తెలిపింది.
ఉక్రెయిన్ సంక్షోభ నేపధ్యంలోనే రష్యా-ఉత్తర కొరియా ఒప్పందం అన్నది స్పష్టం.ఉక్రెయిన్‌పై సైనిక చర్య జరుపుతున్న రష్యాకు ఉత్తర కొరియా అందిస్తున్న మందుగుండు, రాకెట్ల గురించి పశ్చిమదేశాలు గుర్రుగా ఉన్నాయి.రష్యాకు సరఫరా అవుతున్న 48లక్షల ఫిరంగి గుండ్లున్న కంటెయినర్లను తాము కనుగొన్నట్లు అమెరికా ఫిబ్రవరిలో చెప్పింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నాటి సోవియట్ యూనియన్, ఉత్తర కొరియా, చైనాలను బెదిరించేందుకు, అవసరమైనపుడు దాడులు చేసేందుకు వీలుగా అమెరికన్లు దక్షిణకొరియా, జపాన్‌లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయటమేగాక జపాన్‌తో రక్షణ ఒప్పందం కూడా చేసుకుంది. ఇప్పుడు ఉత్తర కొరియాతో రష్యా అదే చేసింది. దీని ప్రకారం మూడోపక్షం లేదా కూటమి ఎవరి మీద దాడి చేసినా ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తుంది. బంగ్లాదేశ్ విముక్తికి మన దేశం మిలిటరీని పంపి సాయం చేసినపుడు మనల్ని బెదిరించేందుకు అమెరికా బంగాళాఖాతంలోకి సప్తమ నౌకా దళాన్ని దించింది. అప్పుడు నాటి సోవియట్ యూనియన్‌తో మనదేశం కూడా ఇలాంటి రక్షణ ఒప్పందమే చేసుకోవటంతో అమెరికా తోకముడిచింది. ఈ నేపధ్యంలోనే ఒప్పందం జరిగింది. రష్యా, ఉత్తర కొరియా మరింత దగ్గరయ్యాయి. రెండు దేశాల మీద సామ్రాజ్యవాద కూటమి అమలు జరుపుతున్న ఆంక్షలను ఎదుర్కొనేందుకు కూడా ఉపయోగ పడుతుంది. పశ్చిమ దేశాలతో సాగుతున్న వైరుధ్యాలు ఇప్పటికిప్పుడు సమిసేవికాదు. ఇప్పటికే చైనాతో ఎంతో దగ్గరైన రష్యా మరొక ముందడుగువేసి ఉత్తర కారియాతో మైత్రిని పటిష్టం చేసుకోవటమే కాదు పశ్చిమ దేశాలతో పోరాడే సామర్ధ్యాన్ని కూడా పెంచుకున్నట్లయింది. ఉత్తర కొరియా కూడా ఎవరిని చూసీ భయపడాల్సిన పరిస్థితి ఉండదు. ఒకవైపు రష్యా, మరొకవైపు చైనా రక్షణ కవచాల్లా ఉంటాయి.