శాతాల శఠగోపం

Shatala Shathagopam112 శాతం…109.09 శాతం…105.30 శాతం…100.15 శాతం… ఇవి ఇటీవల విడుదలైన పరీక్షల్లో కార్పొరేట్‌ కళాశాలలు సాధించిన మార్కుల శాతాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవి త్రిపుర రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోల్‌ అయిన ఓట్ల శాతాలు. ఈ ఓట్ల శాతాలను చూస్తుంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరొందిన దేశానికి ఈ ఎన్నికలు ఒక మచ్చగా మిగిలిపోతాయన్న భయం కలుగుతోంది. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న జుగుప్సాకర పరిణామాల వల్ల కూడా ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి నెలకొంటోంది.
రెండు విడతలుగా త్రిపుర రాష్ట్రంలో రెండు లోక్‌ సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికలలో వంద శాతానిపైగా పోలింగ్‌ నమోదుకావడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్యాయంగా ఈ ఎన్నికలు జరగలేదని సీపీఐ(ఎం) త్రిపుర కార్యదర్శి జితేంద్ర చౌదరి విమర్శించారు. అంబాసోల్‌ లో112 శాతం, మజ్లిస్‌పూర్‌ సెగ్మెంట్‌లో 105.30 శాతం, ఖాయర్‌పూర్‌లో 100.15 శాతం, మోహన్‌పూర్‌ సెగ్మెంట్‌లో 109.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, సాధారణ పద్ధతిలో జరగలేదని పైరికార్డులు రుజువు చేస్తున్నాయి. బూత్‌లను స్వాధీనం చేసుకున్నప్పుడు, వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తిగా రిగ్గింగ్‌ చేసినప్పుడే ఇటువంటి సరిపోలని పోలింగ్‌ శాతం జరుగుతుందన్న విమర్శలను కేవలం విమర్శలుగానే చూడకూడదు. ఈ అంకెలనీ కూడా స్వయంగా ఎన్నికల సంఘం బయటపెట్టిన వాస్తవాలు. నాగాలాండ్‌లోనైతే ప్రజాప్రతినిధులే ఓటింగుకు దూరంగా ఉన్నారు.
మరోవైపు గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ లోక్‌సభా స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక సైతం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నది. సాధారణంగా సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాలు పెద్ద సంఖ్యలోనే ఏకగ్రీవమవుతుంటాయి. జడ్పీటీసీలు కూడా అత్యల్పమే! అలాంటిది అంతకు పదింతలుండే లోక్‌సభ స్థానంలో ఏకగ్రీవం ఎలా సాధ్యమైందో! ఎన్నికలే జరగకుండా బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడం వల్ల తమ ప్రజాస్వామిక హక్కును కోల్పోయిన ఆ నియోజకవర్గ ఓటర్లకు ‘ఏకగ్రీవం’ వెనకనున్న నిజాలు తెలియాల్సి ఉంది. అలా తెలుసుకోవడం వారి హక్కు కూడా. అదే తరహలో దేశమంతా కొల్లగొట్టుకోవాలన్నది అధికార బీజేపీ ఆకాంక్ష. ప్రజాస్వామిక దేశంలో ఇది చాలా తీవ్రమైన విషయం!
సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, వారి డమ్మీ అభ్యర్థి నామినేషన్లను ఏ విధంగా డిస్‌క్వాలిఫై చేశారో, అసలు ఒక్కరు కూడా మిగలకుండా అందరు ఇండిపెండెంట్లూ ఎందుకు ఉపసంహరించుకున్నారో అన్న చిదంబర రహస్యమూ తెలియాలి. కొద్దికాలం క్రితమే చండీగఢ్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలో కమలనాథుల మోసం సాక్షాత్తూ భారత సర్వోన్నత న్యాయస్థానంలోనే బట్టబయలయ్యింది. దాంతో ఆ మేయర్‌ ఎన్నికను రద్దుచేసి తిరిగి ఎన్నిక జరపాలని సుప్రీంకోర్టే ఆదేశించింది. ‘చార్‌ సౌ పార్‌’ అంటున్న బీజేపీ సూరత్‌లో ఏ ఎత్తుగడలు వేసిందో మరి! కాబట్టి అందులో ఉన్నతాధికారుల పాత్ర ఏమిటన్నది వెలికి రావలసివుంది.
రాజకీయ పక్షాల సంకుచిత విధానాల వల్ల భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రస్తుతం బలహీనపడుతున్న మాట వాస్తవం. అయినా భారతీయ ప్రజాస్వామ్యం ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలకు స్ఫూర్తిదాయకమే. అయినా కేవలం ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా అధికార పీఠం దక్కించుకుని ప్రత్యర్థులను అణచి అస్మదీయులను అందలం ఎక్కించే మాధ్యమంగా భారతీయ ప్రజాస్వామ్యం మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిమ్మిక్కులు, బూటకపు వాగ్దానాలు, భావజాల భావోద్వేగాల వాతావరణంలో ఎన్నికలలో విజయం సాధించడమే అధికార పార్టీ అంతిమ ధ్యేయమైపోయింది. ఫలితంగా ఇప్పుడు అవినీతి, అరాచకం, అక్రమాలు, అబద్ధాలు, నగదు అనే అంశాల ప్రాతిపదికన దేశం ”వర్ధిల్లుతోంది”. ఈ రుగ్మత దేశ భవితకు అత్యంత ప్రమాదకరం.
లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం కోల్పోవడం బాధాకరం.నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన ప్పటినుంచీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, వాటిని పరివార్‌ శక్తులతో నింపేయడం జరుగుతోంది. రాజ్యాంగ మౌలికాంశాలైన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, సార్వభౌమత్వం, ఫెడరలిజాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ- ఆరెస్సెస్‌ నిరంతరాయంగా ప్రయత్నిస్తోంది. ఒకే దేశం- ఒకే ఎన్నిక, అధ్యక్ష తరహా పాలనను తీసుకురావాలనీ చూస్తోంది. ఎన్నికలను ఓ ప్రహసనంగా మార్చడమూ అందులో భాగమే! ఈ కుట్రలను ప్రతిఘటించడం ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం.

Spread the love