శ్రామికవర్గ చైతన్యానికి ప్రతిరూపం ”మేడే”

శ్రామికవర్గ చైతన్యానికి ప్రతిరూపం ''మేడే''”నేను ఉరి తీయబడినంత మాత్రాన ఈ పోరాట అగ్నిజ్వాల అంతరించదు” అని ”ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అంటూ మార్క్స్‌ ఇచ్చిన నినాదాన్ని ఉరికంబమెక్కిన కార్మిక నాయకుడు అగస్ట్‌ స్పైస్‌ పునరు ద్ఘాటించాడు. ఆయన మరణం పీడిత, తాడిత జన శంఖారావమై విశ్వవ్యాప్తంగా మార్మోగింది. ‘పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్ప’ అన్న కారల్‌మార్క్స్‌ పోరు నినాదం శ్రామికుల చైతన్యాన్ని రగుల్కొలిపింది. రోజుకి 16 గంటలు, 18 గంటలు పనిచేయలేమనే ఉద్యమానికి ఊపిరులూదింది. అఖరికి పాలకవర్గాల మెడలు వంచేలా చేసింది. శ్రమదోపిడీ, బానిసత్వం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేసింది. ఇది పోరాటంగానే కాదు చికాగో అమరవీరుల సంస్మరణ దినంగా మే1 ప్రపంచ చరిత్రకెక్కింది.
ప్రపంచ కార్మికుల ఐక్యతకు స్ఫూర్తినిచ్చే ఈ మహోజ్వలిత పోరాట ఘట్టం. లక్షలాది మంది శ్రామికుల్ని ఒక్కటిగా చేసిన గళం. అవంతరాలు ఎదురైనా పట్టుసడలని ధీరత్వం. ఎనిమిది గంటల పని దినం కోసం ప్రాణత్యాగాలకు వెరవని చైతన్యం. ఎన్ని దశాబ్దాలు, శతా బ్దాలు గడిచినా చెరగనిది అమరుల రక్త తర్పణం. అసలు 1886 మే 1న ఏం జరిగింది? అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినాన్ని డిమాండ్‌ చేస్తూ లక్షలాది మంది కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా మే 3న శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురు ప్రాణాలను బలిగొన్నారు. ఈ దారుణ హత్యకాండను నిరసిస్తూ మే 4వ తేదీ చికాగో నగరంలోని హే-మార్కెట్‌ వద్ద పెద్ద సభ జరిపారు. ప్రశాతంగా జరు గుతున్న ఆ సభపై పోలీసులు విరుచుకుపడ్డారు. అందులో పాల్గొన్న వారిపైనా కాల్పులు జరిపారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై కార్మికుల హాహాకారాలతో దద్దరిల్లింది. ఒక పోలీసు సార్జెంట్‌ను హత్య చేశారనే నిరాధార అభియోగంతో కార్మిక నాయకులైన ఆగస్ట్‌ స్ప్తెస్‌, ఆల్బర్ట్‌ పార్సన్స్‌, అడాల్ఫ్‌ ఫిషర్‌, జార్జ్‌ ఎంగెల్‌లను ఆనాటి పాలక వర్గం ఉరితీసింది.
1864లో అవిర్భవించిన ఇంటర్నెషనల్‌ వర్కింగ్‌మెన్స్‌ అసోషియేషన్‌ (ఐడబ్ల్యుఎ) 1890లో మేడే జరపాలని కార్మికవర్గం పిలుపునిచ్చింది. నాటి నుంచి నేటి వరకు మేడే విశ్వవ్యాప్తంగా ఆజేయంగా, అప్రతిహాసంగా కొనసాగుతున్నది.భారత దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వే వేగన్‌ వర్క్‌షాపులో 1862లో సమ్మె చేశారు. ‘పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పని చేస్తారో మేము కూడా అన్ని గంటలే పని చేస్తామని’ డిమాండ్‌ చేశారు. ఆ తరువాత అది అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడేగా నిలిచిపోయింది. ఈ ఉద్యమం ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి చివరకు శ్రామిక విజయానికి చిహ్నంగా రోజుకు 8 గంటల పని చట్టబద్దం చేయబడింది. అదే మేడేకు అంకురార్పణ. రోజుకి 8 గంటల పని హక్కును కార్మికులు పోరాడి సాధించుకున్న రోజే మేడే.
భారతదేశంలో 1920లో మొదటి ట్రేడ్‌ యూనియన్‌ (ఏఐటియుసి) ఏర్పడటంతో కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. ఆ చైతన్య స్ఫూర్తితోనే ‘మేడే’ను పాటిస్తు న్నారు. తొలిసారిగా భారత్‌లో 1923 సంవత్సరంలో మే 1వ తేదీ మద్రాసులో లేబర్‌ కిసాన్‌ పార్టీ ఆధ్వర్యంలో మేడే దినోత్సవం జరుపుకున్నారు. మద్రాస్‌ మెరినా బీచ్‌లో కామ్రేడ్‌ సింగారవేలు ఎర్రజెండాను ఎగరవేశారు. మే 1న కార్మిక దినంగా పరిగణిస్తూ అమెరికాలో మాత్రం మేడేని లాయల్టీడేగా నిర్వహిస్తున్నారు. 1900 నుంచి 1920 వరకు యూరప్‌ పాలక పెట్టుబడిదారీ దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మేడే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తరవాత దశకంలో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపే వారు. హిట్లర్‌ పాలనలో మే1ని జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునే వారు. ఇటలీలో ముసోలిని, స్పెయిన్‌లో జనరల్‌ ఫ్రాంకోలు మేడే పైన అనేక ఆంక్షలు విధించారు.
నేడు దేశంలో కార్మికుల దుస్ధితి, పాలక వర్గాల నియంతృత్వ పోకడలను గమనిస్తే మళ్ళీ ”మేడే” ఆవిర్భావం నాటి నిరంకుశ ధోరణులు పునరావృతమవుతున్నాయా? అంటే అవును అనే సమాధానం వస్తున్నది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ కేంద్రంలోని బీజేపీ (మోడీ) సర్కార్‌ ఈ పదేండ్ల తమ పాలనలో హరించింది. తగుదునమ్మా అంటూ మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నది. బూటకపు వాగ్దానాలతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచేందుకు నానాతంటాలు పడుతున్నది. కేంద్రం 8 గంటల పనిదినాన్ని రద్దుచేసి, 12 గంటలు ప్రవేశపెట్టి యజమానులకు మేలుచేయ జూసింది. పనిభారం, పనిగంటల పెరుగుదల, స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు ఆర్ధిక ప్రయోజనాలు కల్పించేందుకు కార్మిక చట్టాలను సవరించింది. స్వాతంత్రోద్యమ కాలంలోనే కార్మిక వర్గం తెల్ల దొరలతో పోరాడి సాధించుకున్న సమిష్టి బేరసారల హక్కును, సమ్మె హక్కును, ప్రాతినిధ్యపు హక్కులను నాలుగు లేబర్‌కోడ్స్‌ పేరుతో రద్దు చేసింది. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడం, విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పగించడం, కార్మికులు కుక్కిన పేనుల్లా పడుండేలా మోడీ పాలన సాగుతున్నది. దేశ ఆర్థిక సార్వభౌమత్వ పరిరక్షణలో కీలక పాత్ర వహించే ప్రభుత్వ రంగం అంతకంతకు ధ్వంసం చేయబడుతున్నది. విచక్షణా రహితంగా విదేశీ పెట్టుబడులు అనుమతించబడుతున్నాయి.
మతోన్మాద కార్పొరేట్‌ బీజేపీ విధానాల వల్ల దేశంలో కుల, మత, ప్రాంతీయ వైషమ్యాలు, దురహంకార ధోరణులు పెరుగుతున్నాయి. ఇవి కార్మికవర్గ ఐక్యతకు, విశాల కార్మికోద్యమ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరంగా మారాయి. కానీ బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం కార్మిక వర్గంలో కుల, మత, విద్వేషాలను, మతోన్మాద, జాతీయోన్మాదాన్ని రెచ్చగొడు తున్నది. ప్రజలు, కార్మికుల మధ్య చీలికలు సష్టిస్తున్నది.కార్మికులు తమ సమస్యలకు కారణం ప్రభుత్వ విధానాల్లో ఉందని గుర్తించకుండా గందరగోళపర్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పోరాట చైతన్యాన్ని మొద్దు బరిచే ప్రయత్నం చేస్తున్నది. ప్రత్యా మ్నాయ భావజాలంతో కార్మికవర్గం సంఘటితం కావడం హిందూత్వ శక్తులకు గిట్టడం లేదు. బీజేపీ దాని అనుబంధ సంఘాలైన ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ లాంటి అభివృద్ధి నిరోధక సంస్థలు, అభ్యుదయ, ప్రగతిశీల శక్తులపై, మైనారిటీ, దళిత, గిరిజన, సామాజిక వర్గాల పైన దాడులు చేసి అనేకమందిని జైళ్లల్లో నిర్భందించింది. కొందరిని బీజేపీ హతమారుస్తున్నది. లౌకిక, ప్రజాతంత్ర మౌలిక విలువలనే మట్టుపెట్టే కార్యచరణకు ఆరెస్సెస్‌- బీజేపీ పూనుకున్నది. ఇది మత విద్వేషా లను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపు కోవడమే తప్ప వేరే కాదనేది స్పష్టం.
ప్రపంచంలో అసమానతలు తీవ్రస్థాయికి చేరాయి. సంపద ఒక వైపున గుట్టలుగా పోగు పడుతుంటే, పేదరికం మరొకవైపున పేరుకుపోతున్నది. తాజా వివరాల ప్రకారం.. ముఖేష్‌ అంబానికి రూ.11 లక్షల 60 వేల కోట్ల సంపద ఉందని అంచనా. గౌతమ్‌ ఆదానీ మొత్తం ఆస్తుల విలువ రూ.7 లక్షల 4 వేల కోట్లు. దేశ జనాభాలో దాదాపుగా 21.20 శాతం మంది రోజుకి రూ.160ల కన్న తక్కువ సంపదనతో జీవితాలను వెళ్లదీస్తున్నారు. మరోవైపు దేశంలో 19 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు.125 దేశాలతో రూపొందించిన ఆకలి సూచికలో మన దేశానిది 111 స్థానం. దేశంలో 16 శాతం మంది పౌష్టికహారం లోపంతో బాధపడుతున్నారు. మహిళల్లో 53 శాతం మంది రక్తహీనతతో అవస్త పడుతున్నారు.
చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేయడంలో బీజేపీది అందేవేసిన చేయి. పెట్టుబడిదారీ యాజమాన్యాలు, వారికి జీ-హూజూర్‌ అనే పాలకులు ”మేడే” ప్రాధ్యాన్యతను తగ్గించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ”మేడే”ను 1894లో అంటే హేమార్కెట్‌ స్క్యేర్‌ ఘటన జరిగిన 8 ఏండ్లకు ఆనాటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్‌ క్లివ్‌ల్యాండ్‌ ప్రతి ఏడాది సెప్టెంబర్‌ మొదటి సోమవారాన్ని ”లేబర్‌ డే” గాను, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. ఇప్పడు కూడా (2024)లో మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిఎంఎస్‌లు ”మేడే”ని భగవాన్‌ విశ్వకర్మ జయంతి రోజు సెప్టెంబర్‌ 17న జరపాలంటున్నది. బిఎంఎస్‌ మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం ”మేడే” జరపటానికి నిరాకరిస్తున్నది. 2023 ”మేడే” సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ”మేడే” భారతీయ విశ్వాసాలను ప్రతిభింబించేది కాదని, ”మేడే”లో భారతీయులకు స్ఫూర్తినిచ్చే అంశాలే లేవన్నారు.”మేడే” వేడుకలకు భారతీయ బావనలకు సంబంధం లేదని, సకల వృత్తులకు, కళలకు, సర్వమానవాళి అవసరాలు తీర్చిన విరాట్‌ స్వరూపుడు విశ్వకర్మ భగవానుడేనని, అతనిని అరాధిస్తే ఈ ప్రపంచ చలనానికి తోడ్పడుతుందన్నారు. ఇదంతా ”మేడే” ప్రాధ్యాన్యతను తగ్గించడానికే. మోడీ సర్కార్‌ పని గంటల తగ్గింపునకు జరిగిన అతిపెద్ద వర్గపోరాటాన్ని మేడే పోరాట చరిత్రను కనుమరుగు చేసే ఈ దుర్మార్గ ప్రయత్నాన్ని కార్మికవర్గం అప్రమత్తంగా ఎదుర్కోవాలి.
పాలక వర్గాలతో పాటు బూర్జువా పార్టీల కనుసన్నల్లో నడిచే కొన్ని ట్రేడ్‌ యూనియన్లు కూడా మేడే పోరాట స్ఫూర్తిని, దాని వన్నెను తగ్గిస్తున్నాయి. మేడే రోజు ఎగుర వేయాల్సిన జెండా ఎర్ర జెండా. మేడే పోరాటంలో పాల్గొన్న కార్మికుల్ని పాలక వర్గ దుర్మార్గులు పోలీసులను ఉసిగొల్పి కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో కార్మికుల శరీరం ఛిద్రమై కారిన రక్తంలో తడిసి పూనీతమైన జెండా ఎర్రజెండా. ఎవ్వరైనా మేడే రోజు ఎర్ర జెండానే ఎగురవేయాల్సిందే. కాని నేడు బూర్జువా ట్రేడు యూనియన్లు ఎర్రజెంగాను కాకుండా (పంచరంగుల) వారి పార్టీ జెండాలను ఎగురవేస్తున్నారు. ఇది ద్రోహపు చర్య. మేడే ఉత్సవాల్లో భావవాదాన్ని చొప్పిస్తున్నారు. మేడే జెండా దిమ్మలకు కొబ్బరికాయలు కొట్టడం, అగర్‌బత్తులు వెలిగించటం, కుంకుమబొట్లు పెట్టడం లాంటివి పాటిస్తున్నారు. మేడే జెండాలు ఎగురవేసే సందర్భంలో పురుషాధ్యిక భావజాలం కూడా వ్యక్తమవుతుంది. మహిళ నాయకురాళ్లు, మహిళ కార్మికులచే జెండాలు ఎగురవేయించే సమయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మేడే పోరాటానికి అసలు సిసలైన వారసులుగా నిలిచే ఉద్యమకారులు వీటిన్నంటిని అతిక్రమించాలి. మేడేలో ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా నిర్వహణకు పూనుకోవాలి.
”మేడే” స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం, కార్మిక చట్టాలు, హక్కులను రక్షించుకోవాలి. కార్మిక వర్గం ఐక్యతను మరింత బలపర్చాలి. మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌, మతోన్మాద బీజేపీని 2024 పార్ల మెంట్‌ ఎన్నికల్లో ఓడించాల్సిన బాధ్యత కూడా కార్మికవర్గానిదే, కార్మికవర్గం ఇతర శ్రామికులను కలుపుకోని ఈ కర్తవ్యాన్ని నెరవెర్చాలి. ఈ పరిస్థితిలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడేకి మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ”మేడే” స్ఫూర్తితో పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడానికి కార్మికులు ఒక్కరే కాకుండా రైతాంగం, వ్యవసాయ కార్మికుల్ని, ఉపాధ్యాయ, ఉద్యోగుల్ని కూడా ఉద్యమాలకు కదిలించాలి. ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల సాకుతో పాలక వర్గాలు, అధికార యంత్రాంగం మేడేకి ఎన్ని అవంతరాలు కల్పించినా 138వ ”మేడే”ను పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో వాడవాడల్లో, ప్రారిశ్రామిక కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలి. ఈ సందర్భంగా ‘నాలో కదిలే నవ్య కవిత్వం, కార్మిక లోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభ్యాగానికి,సమర్పణగా, సమర్చనగా, త్రిలోకాలలో, త్రికాలలో, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు’ అని చాటిన మహాకవి శ్రీశ్రీ కవితా సందేశాన్ని గుర్తుచేసుకుంటూ కార్మికవర్గం చైతన్యాన్ని ప్రదర్శించాలి.
(రేపు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)
పాలడుగు భాస్కర్‌
9490098033

Spread the love