వేధింపులు

Harassmentఇప్పుడెక్కడ చూసినా ‘వేధింపుల’ పర్వమే కనపడుతోంది. రాజకీయంగా వేధింపులు, వెంటాడటాలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాము. ఇక సామాజికంగా జరుగుతున్న వేధింపులు తరాలుగా కొన సాగుతూనే ఉన్నాయి. మత విద్వేషాలతో మైనారిటీల మీద వేధింపులు, బలహీనుల మీద వేధింపులు సర్వసాధారణమై పోతున్న తీరు మనందరికీ తెలుసు.
వీటన్నింటికి మించి లైంగికవేధింపుల సంఘటనలు సమాజంలో మరింత పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అందులోనూ పరిపాలన చేస్తున్న నాయకులు, అధికారులు ఈ లైంగిక వేధిం పులకు పాల్పడటం పెరిగిపోతున్నది. అంతేకాదు లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని రక్షించే శక్తిగా కూడా పాలకులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తున్నది. ఈ రకమైన వేధింపులు ఈ పదేండ్ల కాలంలో మరింత పెరిగాయి. మహిళలపట్ల వివక్షతాపూరిత ఆలోచనల పెరుగుదల, ఆధిపత్య భావ జాలం పెరిగిన కారణంగా వేధింపుల పర్వమూ విస్తృతమవుతున్నది.
నిన్నగాక మొన్న బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌పై, రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని, తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. రెజ్యుమే తీసుకుని రమ్మని తన గదికి పిలిచి వేధించారని తీవ్రంగానే ఆవిడ ఆరోపించారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎలా మసలుకోవాలో, మహిళలపట్ల ఎంత మర్యాదగా ఉండాలో తెలుసుకుని ప్రవర్తించాలి. గవర్నర్‌ ఆ ఆరోపణలను ఖండించినప్పటికీ విచారణ చేసి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇంతకుముందు కూడా, ఎన్‌డి. తివారి గవర్నర్‌గా ఉన్నపుడు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు. ఇప్పుడీ ఉదంతం ఆ రాష్ట్రంలోనూ, బయటా పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు వారం ముందు, కర్నాటకలో జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అనేకమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
ఈ ఆరోపణలను ఎదుర్కోలేక ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. ఇపుడు ప్రజ్వల్‌ లైంగికదాడికి గురయిన బాధితురాలు నేడు కిడ్నాప్‌నకు గురైంది. జేడీఎస్‌ పార్టీకే చెందిన మహిళపైనే గత రెండేండ్లుగా ఈ వేధింపులకు గురిచేస్తున్నాడని, తనకు తన భర్తకు ప్రాణముప్పు ఉందనే, ఇన్నినాళ్లు చెప్పలేదనీ మహిళ తెలియజేసింది. ఇపుడు జేడీఎస్‌ పార్టీ ఎన్డీయే కూటమిలో ఉండి బీజేపీకి మద్దతు నిస్తోంది. ప్రభుత్వం దీనిపై సిట్‌ ఏర్పాటు చేసి దర్వాప్తు చేపట్టింది. అయినా బీజేపీ ఇంతవరకు వేధింపు చర్యలను ఖండించలేదు. ఒక్క వేధింపు కాదు, ప్రజ్వల్‌ రేవణ్ణ వద్ద మూడు వేలకు పైగా మహిళల అభ్యంతరకర వీడియోలున్నాయని తెలుస్తున్నా కేంద్ర పెద్దలు మిత్రపక్షంగా ఉన్న పార్టీ నాయకులపై పెదవి విప్పటం లేదు.
ఇక అత్యంత విచారకరమైన అంశమేమంటే లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ కుమారుడికి ఉత్తరప్రదేశ్‌ లోకసభ స్థానాన్ని ఇచ్చి బీజేపీ మహిళలను అవమానిస్తోంది. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్‌లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేష్‌ ఫోగాట్‌ మొదలైన అనేక మంది రెజ్లర్లు వీధుల్లోకి వచ్చి బ్రిజ్‌భూషణ్‌ ఆకృత్యాలపై చర్య తీసుకోవాలని ఆందోళన చేస్తే, చివరికి ఆయన కొడుక్కి పార్లమెంటు సీటులో పోటీ చేయటానికి టికెట్‌ ఇచ్చి వారు ఎటువైపు వున్నారో తెలియజేశారు. ఇవి మాత్రమే కాదు, 2020లో హత్రాస్‌లో ఒక దళిత అమ్మాయిపై అత్యాచారం, హత్యకేసులోనూ, అత్యాచారం చేసిన వారి పక్షమే ప్రభుత్వం నిలబడింది. ఆ సంఘటన వివరాలు తెలుసుకుందామని వెళ్లిన జర్నలిస్టు సిద్ధికీ కప్పన్‌ను అరెస్టు చేసి అన్యాయంగా జైల్లో పెట్టింది. అత్యాచారాలు, వేధింపులు చేసిన వారి పక్షం వహించడం ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ నాయకులకు సర్వసాధారణమైన విషయంగా ఉన్నది.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా చాలా సంఘటనలను పేర్కొనవచ్చు. కేవలం వేధింపుల పక్షమే కాదు, మహిళలను చిన్నచూపు చూడటంతో పాటు, బలహీనులుగా భావించే లక్షణం సంఫ్‌ు పరివార్‌ వారసులకు ఉంది. మనుధర్మాన్ని తూచ తప్పక పాటించేవారు, మనుధర్మ శాస్త్రాన్ని మన రాజ్యాంగమని భావించేవాళ్లు ఇలాగాక ఇంకెలా ఉంటారు! అందుకనే వేధింపులకు, వివక్షతలకు, వ్యతిరేకంగా నిలబడి పోరాడాలని, ఆ శక్తులను ఓడించేందుకు కృషిచేయాలని ప్రజలను చైతన్య పరుద్దాం!

Spread the love