రంగులు

Colorsఇక ఈ మధ్యనే ఎన్నికలు ప్రకటించి, కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాతనే మన దూరదర్శన్‌ ఛానెల్‌ లోగో రంగును అకస్మాత్తుగా కాషాయ రంగులోకి మార్చేశారు. అంతకు ముందు ఎరుపురంగు ఉండేది. రాజ్యాంగం ప్రకారం లౌకిక, ప్రజాస్వామిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న దూరదర్శన్‌ లోగో రంగును కాషాయీకరించడం దారుణమైన విషయం. అందుకే దూరదర్శన్‌ మాజీ సీఈఓ అన్నట్లు ”ఇప్పుడిది ప్రసార భారతి కాదు, కేవలం వారి ప్రచార భారతిగా మార్చేసారు”. అన్నది అక్షర సత్యం. అధికారంలో వున్న వారి స్నేహితులయిన కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి అన్ని ఛానెళ్లు వచ్చేసాక, ఇప్పుడు ప్రభుత్వ ఛానల్‌నూ పూర్తిగా తమ ప్రచారానికి వినియోగిస్తూ రంగును సంకేతించారు.
చాలా జంతువులకు రంగుల వ్యత్యాసాలు కనిపించవు, గుర్తించనూ లేవు. మనిషికి రంగులు తెలవటమే కాదు, రంగులకు అనేక భావాలనూ అద్దాడు. వాస్తవంగా రంగులు ప్రకృతి సిద్ధమైనవి. సప్త వర్ణాలే కాదు, అనేకానేక వర్ణాలు ప్రకృతిలో వున్నవే. ప్రాథమికంగా వున్నవి మూడు రంగులని చెబుతారు రంగుల శాస్త్రకారులు. ఎరుపు, నీలం, పసుపు. వాటి నుండి మరో మూడు ఏర్పడతాయని కూడా చెబుతారు. కానీ న్యూటన్‌ చక్రం మాత్రం తెలుపునే తెలుపుతుంది కదా! సమాజ పరిణామ క్రమంలో మనిషి మనోభావాలు, సంతోషాలు, దు:ఖాలు, బాధలు, ఆవేశాలు, అపాయాలు, ఆవేదనలు మొదలైన భావోద్వేగాలన్నిటినీ రంగుల సంకేతాలతో వ్యక్తీకరించడమూ నేర్చుకున్నాడు. ఇప్పుడు రంగులు మాట్లా డుతాయి. బోధిస్తాయి. జాగ్రత్తలూ చెబుతాయి. అంతేకాదు, నిరసనలూ తెలియ జేస్తాయి. దేశాలకూ సంకేతమవుతాయి. ఒక్కొక్క రంగుకు అనేకానేక అర్థాలను, భావాలను మనిషి ఆపాదించుకున్నాడు. వాటినారకంగా వాడుతున్నాడు కూడా.
రాజకీయ పార్టీలకూ, వారి జెండాలకు ఉన్న రంగులు, అవి ఏయే ఆశయాలతో, లక్ష్యాలతో పని చేస్తాయో వర్ణాధారంగానే తెలియజేస్తాయి. శ్రామికుల శ్రమకు, వారి రక్తానికి, పోరాటానికి సంకేతంగా ఎర్రజెండా ప్రపంచ వ్యాప్తంగానే ప్రసిద్ధి చెందింది.. ఆకుపచ్చ రంగు సస్యశ్యామలానికి, ముస్లిం ప్రజ లకు సంకేతంగా చూడబడుతున్నది. నీలం రంగు నేడు అంబేద్కర్‌ ఆశయ మార్గంలో పయనించే వారి రంగుగా పిలువబడుతున్నది. కాషాయ రంగు ఆధ్యాత్మిక మార్గంగా, సన్యాసుల వస్త్రావర్ణంగా మనం దరికీ పరిచయమే. ఇప్పుడు ఆరెస్సెస్‌, బీజేపీ వర్గాలు ఈ రంగును హిందువుల సంకేతంగా వాడు తున్నారు. హిందూ దేవాలయాలలోనూ ఈ రంగునే వాడుతున్నారు. అదే తమ రాజకీయ రంగుగా బీజేపీ ప్రచారం చేస్తున్నది. మొదట స్వామి వివేకానంద కాషాయ వస్త్రాలు ధరించి ధర్మ ప్రచారానికి పూనుకున్నాడు. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ కాషాయం ధరంచి అధికారం, పదవులు, సకల సౌకర్యాలు అనుభవిస్తారు. అది వేరే విషయం.
సాధారణంగా కాషాయం ధరిస్తే లౌకిక విషయాలనన్నీ, సుఖాలు, సౌఖ్యాలనన్నీ పరిత్వజించి సన్యాసులుగా ధర్మ, విముక్తి మార్గాలలో నిమగమవుతారు. కానీ ఇపుడు అర్థాలు మారాయి. కాషాయం ధరించి సర్వభోగాలనూ, ఆధిపత్యాలనూ కలిగి జీవిస్తుంటారు. ఇప్పుడీ రంగు భయంకరమైన నియంతృ త్వానికీ, ఫాసిస్టు తరహా ఆలోచనలకూ పాలనకూ గుర్తుగా ప్రతిబింబిస్తోంది. ఆధ్యాత్మిక, ధర్మాచార ముసుగేసుకున్న నిరంకుశత్వానికి ప్రతీకగా మారిపోయింది. అంటే, ఆ రంగు వెనకాల అత్యంత దుర్మార్గ ప్రవర్తనల హిట్లరురంగు విధ్వంసం, విద్వేష రంగు దాగి ఉందన్నది మనం గ్రహించాల్సిన విషయం.
ఇప్పుడీ రంగుల విషయాలెందుకంటే, ఎప్పుడైతే హిందూత్వ నియంతృత్వ పాలనకు సంకేతంగా కాషాయాన్ని ప్రచారంలోకి తెచ్చారో అప్పటినుండి అధికారం చేపట్టి వారు చేస్తున్న పనులన్నీ, మన భార తీయ లౌకిక, ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇస్తున్న తీరు మనకు అవగతం అవుతున్నది. అందుకనే ఇప్పుడు కాషాయీకరణ అంటే మతతత్వ భావనలను, పరమత ద్వేషాన్ని నూరిపోసేందుకు చేసే ప్రయత్నమని అర్థం. భావితరాలు నేర్చుకునే విద్యాపాఠాలను అదేవిధంగా మార్చి వేస్తున్నారు. దేశంలోని అన్ని సంస్థలనూ ఆ భావాలు గల వారితో నింపేస్తున్నారు. ఆఖరికి మన దేశ రక్షణ రంగం, మిలటరీ వ్యవస్థలోకీ మతతత్వ భావాలను చొప్పిస్తున్నారు. పోనీ ఇవన్నీ దేశీయమైనవేమీ కాదు, ప్రపం చంలోని కార్పోరేటు శక్తులతో కూడుకున్న కాషాయీకరణ అంటే దోపిడీ, పీడనలతో కూడుకున్నదని అర్థం.
ఇక ఈ మధ్యనే ఎన్నికలు ప్రకటించి, కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాతనే మన దూరదర్శన్‌ ఛానెల్‌ లోగో రంగును అకస్మాత్తుగా కాషాయ రంగులోకి మార్చేశారు. అంతకు ముందు ఎరుపురంగు ఉండేది. రాజ్యాంగం ప్రకారం లౌకిక, ప్రజాస్వామిక ప్రభుత్వ నిర్వహణలో ఉన్న దూరదర్శన్‌ లోగో రంగును కాషాయీకరించడం దారుణమైన విషయం. అందుకే దూరదర్శన్‌ మాజీ సీఈఓ అన్నట్లు ”ఇప్పుడిది ప్రసార భారతి కాదు, కేవలం వారి ప్రచార భారతిగా మార్చేసారు”. అన్నది అక్షర సత్యం. అధికారంలో వున్న వారి స్నేహితులయిన కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి అన్ని ఛానెళ్లు వచ్చేసాక, ఇప్పుడు ప్రభుత్వ ఛానల్‌నూ పూర్తిగా తమ ప్రచారానికి వినియోగిస్తూ రంగును సంకేతించారు.
మొసలి రంగులు మారుస్తుందని అందరికీ తెలుసు. అందుకే రంగులు మార్చే రాజకీయుల్ని దానితో పోలుస్తారు. కానీ దానిది ప్రకృతి సహజం. వీరిది స్వార్థపూరితం. వాస్తవంగా రంగులకు ఏ భావనా ఉండదు. మనం సృష్టించుకుని స్థిరపరచినవే. ఇప్పుడు వీళ్లు చేస్తున్న దయితే, వారి అసలు స్వరూపాన్నీ, స్వభావాన్నీ కాషాయం రంగు కింద కొనసాగిస్తూ నియంతృత్వాన్ని విస్తరించడమే. అందుకే రంగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి!

Spread the love