– అన్నదాతల ఎమ్మెస్పీకి నిధులు లేవు
– బడావ్యాపారులకు మాత్రం భారీ పన్ను తాయిళాలు
– మోడీ సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నదా? వారి ప్రయోజనాలు పట్టటం లేదా? రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను కేంద్రం కావాలనే విస్మరిస్తున్నదా? కార్పొరేట్ల కోసం ఏమైనా చేస్తుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ‘చలో ఢిల్లీ’ నిరసన కార్యక్రమంలో రైతన్నలు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెస్పీతో పాటు.. 2020-21లో ఏడాదిపాటు జరిగిన ఆందోళనల సందర్భంగా తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవటం, రుణమాఫీ, పెన్షన్ వంటివి నిరసన తెలుపుతున్న రైతుల డిమాండ్‌లు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ ఎమ్మెస్పీకి మద్దతు ఇచ్చారనీ, ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నారని అన్నదాతలు అంటున్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్‌కు కేంద్రంలోని మోడీ సర్కారు ఇటీవల భారతరత్న ప్రకటించింది. అయితే, రైతుల డిమాండ్‌లను నెరవేర్చటాన్ని విస్మరించడం బాధాకరమనీ, స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరను కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలును గట్టిగా సమర్థించిన మోడీ.. ప్రధానమంత్రి అయిన తర్వాత దానిని విస్మరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా, ఆహారధాన్యాల ఉత్పత్తి ఏడాదికి సంవత్సరం ప్రాతిపదికన పెరుగుతూ, బఫర్ స్టాక్ నిరంతరం ధాన్యాల సరఫరాను పొందుతున్నప్పటికీ, వ్యవసాయ రంగం ఇప్పుడు అస్తిత్వ సంక్షోభం నుంచి బయటపడటానికి చూస్తున్నదని అంటున్నారు.
ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది?
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని 2019లో (లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో) మోడీ తీవ్ర ప్రచారం చేశారు. మోడీ రెండోసారి గెలుపొందడంలో ఇది కీలకమైన అంశం. ఇప్పుడు, మాత్రం మోడీ, బీజేపీలు దీనిపై మౌనం వహిస్తున్నాయని రైతన్నలు అంటున్నారు. హర్యానాలోని బీజేపీ పాలనలో రైతులపై అక్కడి ప్రభుత్వం అధికార బలాన్ని ప్రయోగిస్తూ వారిని నియంత్రిస్తున్నది. హర్యానా సరిహద్దు దాటి ఢిల్లీకి చేరుకోకుండా కఠినమైన చర్యలను ప్రయోగిస్తున్నది. రైతుల హక్కులను కాలరాసిన మోడీ సర్కారు.. మళ్లీ ఇప్పుడు రామ మందిర నిర్మాణం పూర్తి చేశామనీ , రామ రాజ్యం వచ్చిందంటూ రాజకీయాలు మొదలు పెట్టిందని రైతులు అంటున్నారు.
బీజేపీ అనుకూల మీడియా తప్పుడు కథనాలు కార్పొరేట్ నియంత్రణలో ఉన్న మోడీ, బీజేపీ అనుకూల మీడియా ప్రభుత్వం కోసం అవిశ్రాంతంగా ప్రచారంలో నిమగమై ఉన్నదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల పోరాటం విషయంలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు రైతులను, వారి న్యాయమైన పోరాటాన్ని కించపరిచేలా ఉన్నాయని అంటున్నారు.
రైతుల పట్ల ఉదాసీనత.. కార్పొరేట్‌లకు అనుకూలం
మోడీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నది. కేంద్రం చూపు మాత్రం కార్పొరేట్ సంస్థలపై ఉన్నది. వాటికి తాము చెల్లించాల్సిన పన్ను రేట్లను తగ్గించి తాయిళాలు ప్రకటిస్తున్నది. కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి భారీగా తగ్గించింది. కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు పన్ను రేటును 25 శాతం నుంచి 15శాతానికి తగ్గించింది. పన్ను రేట్ల చర్యల ఫలితంగా ఖజానాకు రూ. 1,45,000 కోట్ల నష్టం వాటిల్లింది. పన్ను తగ్గింపుల వల్ల కార్పొరేట్ సంస్థలు రూ. 6 లక్షల కోట్లు ఆర్జించాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే, కోట్లాది మంది భారతీయులకు ఆహార భద్రతను, జీవనోపాధిని కల్పిస్తున్న వ్యవసాయ రంగం చాలా కాలంగా నష్టపోతున్నది. అలాంటి రంగానికి చేయూతనందించాల్సిన మోడీ సర్కారు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించటం రైతులకు శాపంగా మారిందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, దేశంలో వ్యవసాయ సంక్షోభం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.