సబ్బని తెలంగాణ సర్వస్వం

సబ్బని తెలంగాణ సర్వస్వంకాలాన్ని ఆశ్రయించి, ప్రాంతాన్ని ఆశ్రయించి కవి ఆలోచనలు ఉంటాయి. ఎవరైనా వసుధైక కుటుంబం ఆలోచన చేశారంటే వారు స్థానికతను మరిచారని అర్థం ఎంత మాత్రం కాదు. ప్రాంతదర్శి కానివాడు ప్రాంత దర్శి కాదన్నాడు అమ్మంగి వేణుగోపాల్‌. తెలంగాణ కవికి ఆధునిక కాలంలో నిరంతర జాగరూకుడుగా ఉండాల్సినటువంటి చారిత్రక సందర్భాలు ఎదురయ్యాయి. కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటి నుండి, సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే నాటికి మధ్య అనేక సంఘర్షణలను ఎదుర్కొందీ రాష్ట్రం. దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాలకూ ఈ నేపథ్యం కొంత ఉన్నప్పటికీ 20వ శతాబ్దం ఆరంభం నాటికి ఒక్క హైదరాబాద్‌ సంస్థానంలో మినహా మన చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటిని బ్రిటిష్‌ వాళ్లు పాలిస్తూ ఉన్నారు. ఒక్క హైదరాబాదును మాత్రం అసఫ్జాహీలు పాలించడం వల్ల బ్రిటిష్‌ ఇండియాలో వచ్చిన మార్పులన్నీ హైదరాబాదులో రాలేదు. ఇందువల్ల తెలుగు వాళ్లలో సంస్కతిక, విద్యాపరమైన వ్యత్యాసం ఏర్పడింది. ఈ వ్యత్యాసాన్ని తొలగించుకోవడం కోసమే రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిచింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటును ఇక్కడి సమాజం వ్యతిరేకించింది. పెద్దమనుషుల ఒప్పందాన్ని నమ్మి సమైక్యాంధ్రలో చేరినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ఆరంభంలోనే పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనలకి గురైనందున ముల్కీ ఉద్యమం తలెత్తింది. తర్వాత కాలంలో 1969 జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. 2000 సంవత్సరం తర్వాత మలిదశ ఉద్యమం వచ్చి రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేసింది. ఇన్ని సంఘర్షణలతో కూడిన సమాజంలో ఉన్న కవి ఈ వస్తువు మీద రాయకుండా ఉండలేడు. డాక్టర్‌ సబ్బని లక్ష్మీనారాయణ ఈ పనిలో మరింత ముందు ఉన్నారు.
గత 30 సంవత్సరాలుగా సాహిత్య రంగంలోని వివిధ ప్రక్రియలలో సృజన చేస్తున్న డాక్టర్‌ సబ్బని లక్ష్మీనారాయణ గారు మలిదశ ఉద్యమ కాలంలో కేంద్రీకరించి ఉద్యమ కవిత్వం, గేయాలు, ఉద్యమ వ్యాసాలు రాయలనుకోవడం తెలంగాణ పౌరుడిగా ప్రత్యేకించి బాధ్యతాయుతమైన కవిగా తన బాధ్యతను నిర్వర్తించడమే. కవులను అనధికారిక శాసనకర్తలు అన్న మాట తెలంగాణ మలిదశ ఉద్యమానికి నూరుపాళ్ళు సరిపోతుంది. విభిన్న భావజాలాలు ఉన్న కవులు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముక్తకంఠంతో సమర్ధించారు. 2000 సంవత్సరం నుండి రాష్ట్రం సిద్ధించే వరకు సుమారుగా 11 రచనలను వెలువరించారు. ఇందులో వచన కవిత, గేయ కవిత, మినీ కవిత, వ్యాసాలు ఉన్నాయి. ఇవి 2010 నుండి 15 వరకు వివిధ సందర్భాలలో ప్రచురించబడి పాఠకులకు చేరాయి. ఉద్యమం సఫలీకతమై రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముక్కలు ముక్కలుగా ఉన్న సబ్బని తెలంగాణ సాహిత్యమంతా ఒక్కచోట చేరితే బాగుంటుందని ఆలోచనతో సబ్బని సమగ్ర తెలంగాణ సాహిత్యం ప్రచురించబడింది. ఇందులో సబ్బని గారు రాసిన 11 గ్రంథాలు వారి శ్రీమతి శ్యామల గారు రాసిన బతుకమ్మ పాటలు కలిపి డజను పుస్తకాల బహత్‌ సంకలనం ఇది.
‘తెలంగాణ ఒక సత్యం’ 2010లో ప్రచురించబడిన వచన కవితా సంపుటి. 39 కవితలున్న ఈ సంపుటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ కు గల కారణాలను కవితాత్మకంగా వ్యక్తీకరించింది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వస్తే హైదరాబాదును మాత్రం రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా ఉండాలని, లేకపోతే యూనియన్‌ టెరిటరీగా ప్రకటించాలని చేసిన వాదనను ఎండగడుతూ రాసిన దీర్ఘ కవిత ‘హైదరాబాద్‌ ఓ హైదరాబాద్‌’.
తెలంగాణ వైభవాన్ని చిత్రించే పాటల సంకలనం ‘చారిత్రక తెలంగాణ’. నిజానికి దీన్ని సంకలనం అనడం కంటే ఒక దీర్గ గేయం అనడం కరెక్ట్‌. తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూ రాసిన చిన్న కవితల సంపుటాలు తెలంగాణ హైకూలు, తెలంగాణ నానోలు, తెలంగాణ రెక్కలు, తెలంగాణ నానీలు, తెలంగాణ పదాలు. ఈ నాలుగు మినీ కవితా సంపుటులలో విభిన్నమైన పద్ధతిలో రాష్ట్ర అవసరాన్ని నొక్కి చెప్పారు కవి. తెలంగాణ వైభవ గీతాలు మరొక విలక్షణమైన కావ్యం ఇవి పాటలు కాబట్టి పాటల రూపంలో ప్రచురణలో ఉండడమే కాకుండా క్యాసెట్లుగా, సీడీలుగా కూడా మారి ప్రజల నాలుకల మీదికి ఎక్కాయి. లక్షకు పైగా శ్రోతలు యూట్యూబ్‌ లో ఈ పాటలను అక్కున చేర్చుకున్నారు. ఈ సంకలనంలో భిన్నమైన గ్రంథం ‘తెలంగాణ కొన్ని వాస్తవాలు’. తెలంగాణ చరిత్ర గురించి, అభివద్ధి గురించి, రాజరికంలో కనిపించకుండా పోయిన వికాస రేఖల గురించి రాసిన వ్యాసాల సమాహారం ఇది. తెలంగాణ మార్చ్‌ 2015 లో రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రచురించబడిన వచన కవితా సంపుటి. ఈ 11 సంపుటాలతో పాటు సబ్బని లక్ష్మీనారాయణ గారి జీవిత భాగస్వామి శ్రీమతి సబ్బని శారద రాసిన తెలంగాణ బతుకమ్మ పాట కూడా ఇందులో చేర్చబడి సబ్బని కుటుంబం ఉద్యమస్ఫూర్తికి చేసిన కషిని ఒకచోట చేర్చినట్లు అయింది. ఆమె రాసిన బతుకమ్మ పాట ప్రజల నుండి పుట్టిన రూపాన్ని ఇతర ప్రజాకవులు అందరిలాగానే కొత్త వస్తువుతో జోడించారు.
‘మంజీర మానేర్లు ఉయ్యాలో/ మన మధ్య నుండగా ఉయ్యాలో/ మూసీలు మున్నేర్లు ఉయ్యాలో/ ముచ్చటగ పారే ఉయ్యాలో/ గోదారి కష్ణలు ఉయ్యాలో/ గొప్పగాను పారె ఉయ్యాలో/ సింగరేణి గడ్డ ఉయ్యాలో/ సిరులు ఉన్న గడ్డ ఉయ్యాలో/ నల్ల బంగారము ఉయ్యాలో/నాణ్యమైన బొగ్గు ఉయ్యాలో/ షాబాదు రాళ్లలో ఉయ్యాలో/ చక్కని ఈ సీమ ఉయ్యాలో/ పాడిపంటలందు ఉయ్యాలో/ పాటైన నేలరా ఉయ్యాలో/ వనరులన్నీ ఉన్న ఉయ్యాలో/ వజ్రాల గడ్డరా ఉయ్యాలో/ అన్ని ఉన్ననేమి ఉయ్యాలో/ అంతటా కరువాయె ఉయ్యాలో/ కాల మహిమ చూడు ఉయ్యాలో/ కష్ట కాలమచ్చె ఉయ్యాలో’ అంటూ కొనసాగించారు.
ఈ 12 కవితా సంపుటాల సమాహారం ఏకబిగిన చదివిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కవిత్వం చేసిన కషి, ప్రత్యేకంగా సబ్బని లక్ష్మీనారాయణ గారు చేసిన కషి సోదాహరణంగా తెలియ వస్తుంది. ఇదంతా ఒకే చోట లభించడం వల్ల తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని అధ్యయనం చేసే పరిశోధక విద్యార్థులకు ఒక సౌకర్యంగా కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం కస్తూరి విజయం ప్రచురణల ద్వారా పాఠకులను ప్రింట్‌ ఆన్‌ డిమాండ్‌ బుక్‌ గా అందుబాటులో ఉంది.
– ఏనుగు నరసింహారెడ్డి, 8978869183

Spread the love