”మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది.” ఆహారం అనేది కేవలం ఆకలిని తీర్చే పదార్థం మాత్రమే కాదు. అది జీవన శక్తికి, శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలాధారం. అయితే నేటి ఆధునిక ప్రపంచంలో మనం తినే ఆహారం ఎంతవరకు సురక్షితంగా ఉంది? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ప్రతి ఏటా జూన్ 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో మన దేశ ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతుందో ఈ వ్యాసంలో తెలుసుకుందాం…
ఆహార భద్రత అంటే కేవలం ఆహారం లభించడం మాత్రమే కాదు. లభించే ఆహారం కలుషితం కాకుండా, ఎలాంటి హానీకర బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు లేకుండా ఉండటం. అలాగే మనిషి తీసుకునే ఆహారం రసాయన రహితంగా ఉండి, మానవ వినియోగానికి యోగ్యంగా ఉండటాన్ని ఆహార భద్రత అంటారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార, వ్యవసాయ సంస్థ సంయుక్తంగా జూన్ 7న ఆహార భద్రత దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో ఆహార ప్రమాణాల పట్ల అవగాహన పెంచడం, కలుషిత ఆహారం వల్ల వచ్చే వ్యాధులను అరికట్టడం.
ఎందుకు నిర్వహిస్తున్నారు..?
ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహారం వల్ల లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, 2018 డిసెంబర్ 20న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ప్రతి ఏడాది జూన్ 7ను ‘ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం’గా ప్రకటించారు. మొదటిసారిగా 2019 జూన్ 7న ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆహార కాలుష్యాన్ని గుర్తించడం, నివారించడం, నిర్వహించడం. మరీ ముఖ్యంగా వ్యవసాయం, మార్కెటింగ్, వినియోగం వంటి అన్ని దశల్లోనూ ఆహార నాణ్యతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రజారోగ్యం, ఆర్థిక శ్రేయస్సు, స్థిరమైన అభివద్ధికి ఆహార భద్రతను ఒక ముఖ్యమైన అంశంగా మార్చడం కూడా ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
గణాంకాలు చెప్తున్న చేదు నిజాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఆహార భద్రత లోపించడం వల్ల మానవాళి ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కొంటుందో అర్థమవుతుంది.
ప్రపంచవ్యాప్తగా అనారోగ్యం బారిన పడేవారు సుమారు 60 కోట్ల మంది (ప్రతి 10 మందిలో ఒకరు), మరణాల సంఖ్య 4,20,000, అలాగే ఐదేండ్ల లోపు పిల్లలు 1,25,000 మంది మరణిస్తున్నారు (మొత్తం మరణాల్లో 30%). ఇంకా ఆర్థిక నష్టం, తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో సుమారు 110 బిలియన్ల డాలర్ల ఉత్పాదకత నష్టపోతున్నది. ఈ గణాంకాలు ఆహార భద్రత అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదని, ఇది ఒక అంతర్జాతీయ ప్రజారోగ్య సంక్షోభం అని స్పష్టం చేస్తున్నాయి.
ఆహార కాలుష్యానికి ప్రధాన కారణాలు
మనం తినే ఆహారం పొలం నుండి పళ్లేంలోకి వచ్చే సరికి అనేక దశలను దాటుతుంది. ఈ ప్రయాణంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆహారం విషపూరితంగా మారుతుంది.
రసాయనాలు: పంట దిగుబడిని పెంచేందుకు నేడు రైతులు విపరీతంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలను వాడుతున్నారు. ఇవి మొక్కల ద్వారా పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లోకి చేరి, చివరికి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతున్నాయి.
కల్తీ ఆహారం: లాభార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. పాలల్లో యూరియా, డిటర్జెంట్లు కలుపుతున్నారు. కారం పొడిలో ఇటుక పొడి, పసుపులో లెడ్ క్రోమేట్ కలుపి ప్రజలను మోసం చేస్తున్నారు. అలాగే కాఫీ పొడిలో చింతపిక్కల పొడి, నెయ్యిలో జంతువుల కొవ్వు లేదా వనస్పతి వంటివి కలిపి కల్తీకి పాల్పడుతున్నారు.
నిల్వ చేయడంలో లోపాలు: సరైన కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల కూరగాయలు, మాంసం, పాలు త్వరగా పాడవుతాయి. తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ధాన్యాన్ని నిల్వ ఉంచడం వల్ల ‘అఫ్లాటాక్సిన్’ వంటి ప్రమాదకరమైన శిలీంధ్రాలు చేరి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి.
పరిశుభ్రత లోపించడం: ఆహారాన్ని వండేటప్పుడు, వడ్డించేటప్పుడు కనీస పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ-కోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఆహారంలో చేరతాయి. వీధుల పక్కన దొరికే ఫాస్ట్ ఫుడ్స్, ఈగలు వాలిన ఆహార పదార్థాల వల్ల టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు ప్రబలుతాయి.
‘ఫార్మ్ టు ఫోర్క్’ (పొలం నుండి పళ్లేం వరకు)
ఆహార భద్రత అనేది కేవలం ఒక్కరి బాధ్యత కాదు. ఇది సరఫరా గొలుసులోని ప్రతి ఒక్కరి బాధ్యత. దీనిని ఐదు దశలుగా విభజించవచ్చు.
వ్యవసాయం/ ఉత్పత్తి ప్రాసెసింగ్/ ప్యాకేజింగ్ రవాణా/ నిల్వ/ రిటైల్ మార్కెట్ వినియోగదారుడు
ఉత్పత్తి : రైతులు సేంద్రియ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వడం, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం.
ప్రాసెసింగ్ : పరిశ్రమలలో ఆహార పదార్థాలను ప్రాసెస్ చేసేటప్పుడు శుభ్రమైన వాతావరణాన్ని, సరైన ఉష్ణోగ్రతను పాటించడం.
రవాణా, నిల్వ : పాడైపోయే వస్తువులను రిఫ్రిజరేటెడ్ వాహనాల్లో రవాణా చేయడం, గిడ్డంగుల్లో ఎలుకలు, కీటకాలు లేకుండా చూసుకోవడం.
మార్కెటింగ్ : గడువు ముగిసిన వస్తువులను విక్రయించకపోవడం, ప్యాకేజింగ్ దెబ్బతినకుండా చూసుకోవడం.
వినియోగం : ఇంట్లో ఆహారాన్ని వండేటప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, కూరగాయలను బాగా కడగడం.
భారతదేశంలో ఆహార భద్రత
భారతదేశం వంటి భారీ జనాభా గల దేశంలో ఆహార భద్రతను నిర్ధారించడం ఒక పెద్ద సవాలు. భారతదేశంలో ఈ బాధ్యతను FSSAI చూసుకుంటుంది. అయితే మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ సంస్కతిపై ఎలాంటి నియంత్రణ లేదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ప్రమాణాలపై అవగాహన లోపించింది. మరీ ముఖ్యంగా ఆహార నాణ్యతను పరీక్షించే ల్యాబొరేటరీలు తగినంత సంఖ్యలో లేవు. ఇది మన దేశంలోని పరిస్థితి. ప్రతి వినియోగదారుడు తెలుసుకోవల్సినవి ప్రపంచ ఆరోగ్య సంస్థ సురక్షితమైన ఆహారం కోసం ఐదు ముఖ్యమైన సూత్రాలను ప్రతిపాదించింది. పరిశుభ్రతను పాటించండి: ఆహారాన్ని తాకడానికి ముందు, వండేటప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వంటగది పరిసరాలను ఈగలు, కీటకాలు లేకుండా ఉంచాలి.
వేరుగా ఉంచండి: పచ్చి మాంసం, చికెన్, చేపలు వంటి పచ్చి ఆహార పదార్థాలను వండిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి. వాటి కోసం వాడే చాకులు, బోర్డులను వేరుగా ఉంచాలి.
బాగా ఉడికించండి: ఆహారాన్ని ముఖ్యంగా మాంసం, గుడ్లు వంటి పదార్థాలను పూర్తిగా ఉడికించాలి. 70ళీజ ఉష్ణోగ్రత వద్ద వండటం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.
సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి: వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు. మిగిలిన ఆహారాన్ని వెంటనే రిఫ్రిజిరేటర్‌లో (5ళీజ లోపు) ఉంచాలి.
సురక్షితమైన నీరు, ముడి పదార్థాలను వాడండి: వంటకు స్వచ్ఛమైన నీటిని మాత్రమే వాడాలి. తాజా కూరగాయలను, పండ్లను ఎంచుకోవాలి. ఎక్స్‌పైరీ డేట్ చూసి వస్తువులను కొనాలి.
మన బాధ్యత – మన ఆరోగ్యం
”సురక్షితమైన ఆహారమే రేపటి ఆరోగ్యకరమైన సమాజానికి పునాది.” ఆహార భద్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా అధికారుల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి ఉమ్మడి బాధ్యత. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం కొనే వస్తువుల నాణ్యతను గమనించడం, కల్తీని నిరసించడం, ఇంట్లో పరిశుభ్రమైన వంట పద్ధతులను పాటించడం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా, మనం తినే ప్రతి ముద్ద సురక్షితమైనదిగా ఉండేలా చూసుకుంటామని, ఆహారాన్ని వృథా చేయకుండా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. ఆరోగ్యకరమైన ఆహారమే ఆనందమయ జీవితానికి రాజమార్గం.
మూడ్ శోభన్ నాయక్
9949725951



