హాస కొత్తూర్ లో సజ్జపంట పరిశీలన

 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న సజ్జ పంటను జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, భీంగల్ ఏడిఏ మల్లయ్య బుధవారం పరిశీలించారు. గ్రామంలోని పలువురు రైతుల సజ్జ పంట క్షేత్రాలను సందర్శించి పరిశీలించారు. సజ్జ పంటలో కత్తెర పురుగు ఉధృతి  ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పురుగు ఉదృతి వల్ల రైతులకు అధిక పంట నష్టం అయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ పేర్కొన్నారు. కత్తెర పురుగు నివారణకు సమగ్ర సస్య  రక్షణ చర్యలను ఆయన రైతులకు  సూచించారు.ముఖ్యంగా రైతులు పంటలో  కత్తెర పురుగు యొక్క లార్వాల దశలను బట్టి వివిధ మందులను పిచికారి చేయాలన్నారు.మొదటి దశలో ఆకుల పైన తల్లి పురుగు గుడ్లను,  మొదటి దశ లార్వలను 1500 పీపీఎం వేపనూనె 5 మిల్లీలీటర్లు/లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా నివారించుకోవచ్చు అన్నారు.రెండు, మూడవ దశలోని లార్వలను నివారించడానికి రసాయనిక మందులైన స్పేనటోరమ్ 0.5మిల్లీమీటర్లు (లేదా) క్లోరనిత్రిపోల్ 0.4 మిల్లీలీటర్లు /లీటర్ నీటికి 1500 పీపీఎం వేప నూనె  కలిపి మందును మొక్క సుడులలో పడేటట్లు ఉదయం లేదా సాయంత్రం వేళలో పిచికారి చేసినట్లయితే పురుగును నివారించవచ్చని తెలిపారు. వీరి వెంట మండల వ్యవసాయ అధికారిని బద్దం లావణ్య, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు.
Spread the love