జేబుల్లోంచి పెట్టలేక..జీతాలు రాక..

Can't put it in the pockets.. Salaries don't come..– ఇబ్బందుల్లో పంచాయతీ కార్యదర్శులు, జీపీ కార్మికులు
– ప్రత్యేక పాలనలో జీపీల్లో నిధుల కొరత
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయం అంతంతే
– సొంత ఆదాయాలు సరిపోక ఇబ్బందులు
పరిపాలన కోసం చేతుల్లోంచి సొంత డబ్బులు పెట్టలేక గ్రామపంచాయతీ కార్యదర్శులు…నెలల తరబడి పని చేసుకుంటు పోతున్నా వేతనాలు అందక పారిశుధ్యకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి కాదు..రెండు కాదు..మూడు నెలలుగా ఇదే తంతు. గ్రామపంచాయతీల్లో నిధుల లేమే దీనికి ప్రధాన కారణం. ప్రత్యేక పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జీపీలకు అందుతున్న సహాయం కూడా అంతంతే. అటు పై నుంచి సహాయం అందక..ఇటు పంచాయతీకి వచ్చే సొంత ఆదాయాలు పెద్దగా లేక ఊర్లల్లో పాలన పడకేసే పరిస్థితి వచ్చింది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ కార్యదర్శి (పేరు రాయొద్దు అన్న సూచన మేరకు) తన గ్రామంలో పనులు చేయడానికి ఇప్పటిదాకా రూ.50 వేలకు పైనే ఖర్చుపెట్టారు. ఇప్పటి వరకూ ఆ బిల్లులు క్లియర్‌ కాలేదు. ‘అన్నా మాది చిన్న పంచాయతీ. ఇంటిపన్ను, ఇతర సోర్స్‌ ద్వారా వచ్చే ఆదాయం అంతంతే. మా కొచ్చే జీతం అంతంతే. దాంట్లో సగం ఊరి కోసమే వెచ్చించాల్సి వస్తున్నది. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తే మీ డబ్బులు మీకొస్తాయి కదా? పెట్టడానికి ఏమవుతున్నది? పెట్టండి. అన్ని బిల్లులు మెల్లమెల్లగా వస్తాయి అంటున్నారు. అవి వచ్చేదెన్నడో.సచ్చేదెన్నడో? ఇప్పుడైతే మేం ఇబ్బందులు పడుతున్నాం అన్నా’ అంటూ సదరు కార్యదర్శి తన గోడును వెళ్లబోసుకున్నారు. నల్లగొండ జిల్లాలో 2500 ఓటింగ్‌ గల ఓ పంచాయతీ కార్యదర్శిని పలుకరిస్తే ఇదే వరుస. ‘రెండు, మూడు నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నా. స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు కూడా సరిగా రావడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు రావట్లేదు. ఇంటిపన్నులు, ఇతరత్రా వస్తున్న ఆదాయం అంతంత మాత్రమే. చెత్తసేకరణకు ట్రాక్టర్‌లో డీజిల్‌ పోయించడానికి చేతుల్లోంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తున్నది. మూడు నెలల నుంచి ఇదే తంతు. పంచాయతీ కార్మికులేమో మాకు జీతాలిస్తలేరు? పూట ఎట్ల గడుస్తది? అని ప్రశ్నిస్తున్నారు. ఇటు ఉన్నతాధికారుల ఆదేశాలను కాదనలేక, క్షేత్రస్థాయిలో జీపీ సిబ్బందికి నచ్చజెప్పలేక, ఇటు కుటుంబ అవసరాలు తీర్చలేక మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ తాను రోజువారీగా అనుభవిస్తున్న బాధలను చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆయా జిల్లాలకు చెందిన పలువురు పంచాయతీ కార్యదర్శులను కదలిస్తే ఇంచుమించు పై ఇద్దరి మాదిరిగానే తమ సాధకబాధకాలను చెప్పుకొచ్చారు. చిన్న గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద గ్రామపంచాయతీల్లో (మూడు నాలుగు వేల ఓటింగ్‌ ఉన్న) కొంత సొంత ఆదాయాలు వస్తుండటంతో రోజువారీ అవసరాలకు ఆ నిధులు కొంతమేరకు ఉపయోగపడుతున్నాయి. అయితే, ఆ పంచాయతీల్లోనూ ఎంతో కొంత కార్యదర్శులు తమ చేతుల్లోంచి పైసలు పెట్టుకోవాల్సిన దుస్థితే నెలకొంది.
నాలుగైదు నెలల జీతాల్వికపోతే.. బతికేదెట్టా?
వేలకు వేల జీతాలొచ్చే వారే జీతాలు రావడం అటూ ఇటూ అయితే లబోదిబోమని గుండెలు బాదుకోవడం మన చూస్తుంటాం. మరి రూ.8,500(పంచుకుంటే ఐదారు వేలు కూడా దక్కని పరిస్థితి) వచ్చే వారు ఎంత ఇబ్బందులు పడుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో నాలుగైదు నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు అందడం లేదు. ఆరేడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్న పంచాయతీలు కూడా ఉండటం గమనార్హం. నిర్మల్‌ జిల్లా బైంసా మండలం అంజనీ తండాలో చెత్తసేకరణ ట్రాక్టర్‌ నడిపే పారిశుధ్య కార్మికుడు పంచాయతీ కార్యదర్శిని జీతం అడిగి అడిగి విసుగుచెంది ట్రాక్టర్‌ను తీసుకుపోయిన వీడియో రాష్ట్రమంతటా చర్చనీయాంశం అవుతున్న విషయం విదితమే. ఇప్పటికే వేతనాల కోసం సీఐటీయూ పోరాటం చేస్తున్నది. మండల కేంద్రాల్లో కార్మికులు రోడ్లెక్కి నిరసనలు చెబుతున్నారు. వేతనాలు ఇప్పించాలని మండల, జిల్లా అధికారులను వేడుకుంటున్నా కనికరించేవారు లేకుండా పోయారు. పైగా, జీతాలిచ్చినా ఇవ్వకపోయినా రోజువారీ పనులు చేయాల్సిందేననీ, లేకపోతే పల్లెలు కంపుకొడతాయని పంచాయతీ కార్యదర్శులతో ఒత్తిడి చేయిస్తున్నారు.
ఉన్నతాధికారులు మాట తప్పారు.. కోడ్‌ ముగియగానే మళ్లీ పోరుబాట : చాగంటి వెంకటయ్య,
తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచాయతీ కమిషనరేట్‌ ఎదుట ఆందోళన చేసిన సమయంలో పెండింగ్‌ వేతనాలు క్రమంగా క్లియర్‌ చేస్తున్నామనీ, నెలరోజుల్లో పెండింగ్‌ వేతనాల సమస్య ఉండకుండా చూస్తామని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చి మాట తప్పారు. 3 నుంచి 7 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల్లేక ఇవ్వలేకపోతున్నామని జిల్లా, మండల అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇచ్చేదే అరకొర వేతనం. అదీ నెలల తరబడి పెండింగ్‌లో పెడితే ఎలా బతకాలో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వేచిచూస్తాం. జూన్‌ నెలలో దశలవారీగా ఆందోళనలు చేపడతాం. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ వేతనాల సమస్యను పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం.

Spread the love