పోలీసు ప్రాణాలు తీసిన ఇసుక మాఫియా..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇసుక మాఫియా ఓ కానిస్టేబుల్ ప్రాణాలు తీసింది. అక్రమంగా ఇసుక తరలిస్తోన్న లారీని ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను అదే ట్రాక్టర్‌తో తొక్కించి, ప్రాణాలు తీశారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనపై పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 51 ఏళ్ల మైసూర్ చౌహాన్‌ కర్ణాటకలోని నెలోగి పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా తనిఖీల నిమిత్తం అక్రమంగా ఇసుక తరలిస్తోన్న ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే.. డ్రైవర్‌ ఆగకుండా పోలీసు పైకి ట్రాక్టర్‌ను పోనిచ్చాడు. నారాయణపుర గ్రామంలో ఈ ఘటన జరగ్గా.. చౌహాన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ‘మేం డ్రైవర్‌ను అరెస్టు చేశాం. ఆ ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తున్నారు. ఆ సమయంలో కానిస్టేబుల్ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు’ అని కలబురిగి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే స్పందించారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం’ అని తెలిపారు.

Spread the love