నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉన్న ఆరుగురు నిందితులకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. రిమాండ్ ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలను కోర్టు జారీ చేసింది. తరుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. ఈ ఆరుగురు నిందితుల్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. వీరి రిమాండ్ ముగియడంతో పోలీసులు వీరిని ఈరోజు సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కోర్టు రిమాండ్ ను పొడిగించింది. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారు. తెలంగాణ కోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు.