సంక్రాంతి పరమార్థం

Sankranti Paramarthaతెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరికి వచ్చి సంక్రాంతి జరుపుకుంటారు. ముంగిట్లో ఇంద్ర ధనుస్సును మరిపించే రంగవల్లులు, నోరూరించే పిండి వంటలు, సంప్రదాయ దుస్తులు.. తెలుగు లోగిళ్లలో ఒక అద్భుతమైన ఆనందాన్నిచ్చే సంక్రాంతి పండగ శోభ మిగతా పండగల్లో ప్రత్యేకం. మూడురోజుల పండగల్లో ఎన్నో మరెన్నో విశేషాలు!
సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. అందుకే మనకి ఏడాదికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి. వాటిలో విశేషమైంది పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలంతోపాటు సంక్రాంతి సంబరాలూ మొదలవుతాయి.
భోగి
సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుతారు. భోగి మంటలు వెలిగిస్తారు. చలి పారద్రోలడానికే కాకుండా కొత్త వాటితో నూతన జీవితాన్ని మొదలుపెట్టడానికి గుర్తుగా, ఇంట్లో ఉన్న పాత సామాన్లు వేసి మంటలు వెలిగిస్తారు. చిన్నారుల తలపై భోగి పళ్లు పోస్తారు. రేగు పళ్లను చిన్నారుల శిరస్సుపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని ఓ నమ్మకం. ఈ కాలపు చలి, మంచు వల్ల ఊపిరితిత్తుల్లో ఏదైనా నెమ్ము చేరితే తొలి గించగలిగే శక్తి ఉన్న ఎండిన సమిధల్ని తెచ్చుకోవాలి. మర్రి,మామిడి, మేడి, రావి, జువ్వి, మారేడు, ఎండిన తులసికట్టి మద్ది మొదలైనవి శ్వాసకోశవ్యాధుల్ని తొలిగించగల సమిధలు. వాటిని గుండ్రంగా పేర్చి మధ్య కొద్ది ముద్దహారతి కర్పూరాన్ని పెట్టి వెలిగించాలి. ఆ సమిధలు అంటుకుని వెలుగుతున్నప్పుడొచ్చే సన్నని పొగ ఇటు వాతావరణ కాలుష్యాన్నీ అటు ఆ పొగని పీలుస్లూ ఊపిరితిత్తుల్నీ, శ్వాసకోశాన్నీ శుభ్రపరుస్తుంది. అలాగే బొమ్మల కొలువుని కూడా ఏర్పాటు చేస్తారు.
ముగ్గుల ప్రత్యేకత
సాధారణంగా జీవనసమతౌల్యాన్ని తెలియజెప్పే ముగ్గుల ఆకతులు జియో మెట్రికల్‌గా ఉంటుంటాయి. చాలాభాగం ప్రకతిస్ఫూర్తితోనే ఉంటాయి. నెమళ్ళు, కలువపూలు, మామిడి, చేపల బొమ్మలు కనిపిస్తాయి. కలశాలు, పొంగలి కుండల తోనూ రంగవల్లులను తీర్చిదిద్దుతారు. త్రికోణాలు, గీతల కలయికలు, చుక్కలముగ్గులు ప్రాచుర్యం పొందాయి. దక్షిణాదిలో ఇంటి ముంగిట తెల్లని ముగ్గులతో అలంకరించుకోవడం సంప్రదాయం. తమిళనాడులో కోలం, తెలుగు- రాష్ట్రాల్లో ముగ్గులు.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరున్నా, ప్రయోజనాలు, ఉద్దేశాలు మాత్రం ఒక్కటే. బియ్యం పిండి వాడుతూ ముగ్గులు వెయ్యడం వల్ల చీమలు, పక్షులు, ఉడతలు, ఇతర చిన్న చిన్న క్రిమికీటకాలు ఇంట్లోకి ఆహారంకోసం వెతుకులాటకోసం ప్రవేశించకుండా బయటే ముగ్గు దగ్గర ఉండిపోతాయన్నది అసలు ఉద్దేశ్యం. ఇది ప్రకతికి, మానవులకు నడుము సహజీవనానికి సంకేతం అన్నమాట.
గంగిరెద్దు ప్రత్యేకత
తొలకరి చినుకు పడ్డప్పటినుండి ధాన్యాలు గాదెలకి చేర్చేవరకూ అలుపూ అలసటా లేకుండా పని చేసేవి ఎద్దులు. ఒకప్పుడు రైతుకు వ్యవసాయంలో తోడు ఇవే. అలాటి గంగిరెద్దు మనింటి ముందుకి రాగానే కొద్ది ధాన్యాన్ని ముందు పెట్టి దాని నడుంమీద పాత బొంతని కప్పితే చాలు ఎంతో ఆనంద పడి రంకెవేసి ముందుకి కదులుతుంది.
నైవేద్యాలు
నేడు ఎక్కడపడితే అక్కడ కల్తీ నూనెలతో, అపరిశుభ్ర వాతావరణంలో తెలియకుండా తినేస్తున్నారు. అయితే ఈకాలం పిల్లలకి తెలియని విషయా చాలా ఉన్నాయి. సంక్రాంతి పండుగలో అతి ముఖ్యంగా సమర్పించే పులిహౌర, అరిసెలు, చలిమిడి, గారెలు వంటి పిండివంటలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. పసుపు, మిరియాలపొడి, కొత్తిమీర, కరివేపాకు, బెల్లం, ఇంగువ, ఆవపిండీ, మెంతిపిండీ, కొద్దిగా నువ్వుల పిండీతో చేసే పులిహౌర. ఇందులో వాడే ఆరు పదార్థాలు క్యాన్సర్‌ వ్యాధికి కూడా ఔషధంగా పనిచేస్తాయి. పులుపు ఎక్కువ ఉండకూడదు. ఈ పులిహౌరకి విరుగుడు పెరుగు. అందుకే పెద్దలు పులిహౌరని పెరుగుతో తినిపించే వారు. పులిహౌరలో నేతిని కలుపుకుని తింటే మరింత ఆరోగ్యప్రదం. ఇక అరిసెలు. బెల్లాన్ని పాకం పట్టి చేసే వంటకమిది. చిన్నపిల్లల ఎముక శక్తి పెరగడానికీ, బరువుని మోయగల శక్తిని పెంపొందించు కోడానికి అరిసె చాలా మంచిది.
గాలిపటాలు
సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం ఓ వేడుక. ఈ పండుగను పూర్వం మన పెద్దలు దాదాపు 33 రోజలపాటు ఘనంగా జరుపుకునే వారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం మూడు రోజులే నిర్వహించుకుంటున్నారు.
కనుమ
మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో మూడో రోజు కనుమ జరుపుకుంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. పంట కాలం మొత్తం తమకి అండగా నిలిచి పశువులను పూజిస్తారు. పక్షులకి ఈరోజు ఆహారం పెడతారు. రైతులు కనుమ రోజు తమ పశువులకి శుభ్రంగా స్నానం చేయించి పసుపు, కుంకుమ రాసి చక్కగా అలంకరిస్తారు. కనుమ రోజు ప్రయాణాలు చేయకపోవడం వెనుక చిన్న కారణం కూడా ఉంది. పూర్వం బస్సులు వంటి వాహనాలు లేవు. కేవలం ఎద్దుల బండి మీదనే ప్రయాణాలు సాగేవి. కనుమ రోజు ప్రయాణం చేస్తే ఎద్దుల బండి మీద వెళ్లాల్సి వస్తుందని పూర్వం పెద్దలు ఆ ఒక్కరోజైనా ఎద్దులకి విశ్రాంతి ఇవ్వాలని అనుకున్నారు. అందుకే ఆరోజు ప్రయాణాలు చేసేవారు కాదు. ఇలా సంక్రాంతి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ప్రతి పండుగ నుండి ఎన్నో నేర్చుకోవచ్చు.
హరిలో రంగ హరీ
చక్కని ఆకర్షణీయ వేషంతో, తలమీద ఓ గుమ్మడి ఆకారపు గిన్నెని ధరించి, వేగంగా నడుస్తూ, మధ్యమధ్యలో గుండ్రంగా తిరుగుతూ, చేతితో చిడ తల్ని మోగించుకుంటూ మరో చేత్తో వీణని పట్టుకుని ప్రతి ఇంటికీ వచ్చి, ఆ గహిణి భిక్షాన్ని సమర్పించే వేళ అలా మోకాళ్ళమీద కూర్చుని మరెవరి సహాయమూ లేకుండా పైకి లేచి మళ్ళీ అలా వేగంగా మరో ఇంటికి సాగిపోతూ కన్పిస్తాడు హరిదాసు. తలమీది గిన్నె అంత వేగంగా నడుస్తున్నా పడిపోకుండా తలని జాగ్రత్తగా ఉంచడం, చిడతల్ని వాయిస్తూ భుజానికి, చేతికి, వేళ్ళకీ వ్యాయామాన్ని కల్గించడం ఊపిరితిత్తులకీ, కంఠానికి కూడా ఆ పాడుతున్న పాటద్వారా వ్యాయామం.

తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
8008 577 834

Spread the love