కాంట్రాక్టు ఏఎన్‌ఎంల పట్ల సర్కార్‌ మొండి వైఖరి

Sarkar's stubborn attitude towards contract ANMs– రెండు సార్లు చర్చలు జరిపినా స్పందన లేదు :
– యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగర అధ్యక్షులు జె. కుమారస్వామి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఏఎన్‌ఎంల పట్ల మొండి వైఖరి అవలంబిస్తోందని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) హైదరాబాద్‌ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి అన్నారు. రెండుసార్లు యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదన్నారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె శనివారం 12వ రోజుకు చేరుకుంది. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలందర్నీ డైరెక్ట్‌గా రెగ్యులర్‌ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకుండా మొండిగా రాత పరీక్ష ద్వారానే రిక్రూట్‌మెంట్‌ చేస్తామని చెప్పడం హేయమైన చర్య అన్నారు. నోటిఫికేషన్‌లో 1520 పోస్టులు ప్రకటించి యూనియన్లతో చర్చలనంతరం 400 పై చిలుకు పోస్టులను పెంచిందన్నారు. అవి ఎలా పెరిగాయని ప్రశ్నించారు. ప్రభుత్వం రాష్ట్ర జనాభా ప్రాతిపదికన, సబ్‌ సెంటర్‌ ప్రాతిపదికన గనుక లెక్కలు తీస్తే ఏఎన్‌ఎంల పోస్టులు పెరగడానికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఏఎన్‌ఎంలందరినీ రెగ్యులర్‌ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని, లేనిపక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి కిరణ్మయి, నాయకులు రాజేశ్వరి, లక్ష్మి, అమ్మాజీ, విజయ, ప్రణయశీల తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ఎదుట రెండో ఏఎన్‌ఎంలు చేపట్టిన సమ్మె కొనసాగింది. తమను రెగ్యులర్‌ చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒంటికాలుపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు.

Spread the love