మూసాపేట నివాసితుల ఫిర్యాదు
హైడ్రా ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి – మూసాపేట గ్రామాల మధ్య ప్రభుత్వ పాఠశాలతోపాటు జిల్లా పరిషత్ హైస్కూల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాలను కేటాయించింది. అయితే పాఠశాల భవనాలు నిర్మించకపోవడంతో భూమి కబ్జాకు గురవుతోంది. హైడ్రా రంగంలోకి దిగి దాన్ని కాపాడాలని మూసాపేట నివాసితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వాస్తవానికి కూకట్‌పల్లి – మూసాపేట గ్రామాల మధ్య 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇందులో 4 ఎకరాలను మంచినీటి శుద్ధి ప్లాంట్ కోసం జలమండలికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. మిగిలిన 6 ఎకరాల్లో 2 ఎకరాలను మండల ఎంపీపీఎస్ బాలురుల స్కూలు, బాలికల జెడ్‌పీహెచ్ఎస్ కోసం ఎకరం కేటాయించారన్నారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా ఉన్నాయని, సరిహద్దులు నిర్ణయించి కూకట్‌పల్లి మండల విద్యాశాఖ అధికారికి 2023లో అప్పగించారని చెప్పారు. అయితే, అక్కడ భవనాలు నిర్మించకపోవడంతో రెండు ఎకరాలతోపాటు మిగిలిన 4.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా పలు సంస్థలు షెడ్డులు వేసి ఆక్రమణలు మొదలు పెట్టాయని ఆరోపించారు. హైడ్రా వెంటనే రంగంలోకి దిగి రూ.600 కోట్ల విలువైన 6.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి ఫెన్సింగ్ వేయాలని కోరారు.
ఇదిలా ఉండగా, దుండిగల్ గ్రామంలోని సర్వే నంబరు 419లో పాఠశాలలు, నివాసాల సమీపంలో రెడీమిక్స్ సెంటర్‌ను పెట్టి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నారని మరో ఫిర్యాదు అందింది. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి వచ్చిన 42 ఫిర్యాదులను అడిషనల్ కమిషనర్ డి.ఆనంద్ కుమార్ పరిశీలించారు. వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అందజేశారు.
రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



