హడలెత్తిస్తున్నహోర్డింగులు

ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో ”ఘట్‌ కోపర్‌”లో కూలిన హోర్డింగ్‌ ప్రమాదంలో సుమారు 14మంది అమాయక ప్రజలు మరణించగా సుమారు 74 మంది గాయాల పాలయ్యారు. అంతేకాదు కార్లు, పెట్రోల్‌ బంక్‌ ధ్వంసమయ్యాయి. దీనికి ప్రధాన కారణం అనుమతి లేని హోర్డిం గులు. దీనికితోడు అధికారుల పర్యవేక్షణ లోపం. ఇటువంటి అనుమతి లేని హోర్డింగులు మన రాష్ట్రంలో కూడా అనేక పట్టణాలు, నగరాల్లో వందలకొద్దీ దర్శనమి స్తాయి. హైదరాబాద్‌లోనైతే కోకొల్లలు. గతేడాది హోర్డింగ్‌ కూలిన ఘటనలో ఒకరు చనిపోయినట్టు వార్తలు. ఇలాంటి ప్రమా దాలు సంభవించినప్పుడు మాత్రమే అధికా రులు హడావుడి చేస్తారు తప్పా, ముందుగా గుర్తించి చర్యలు ఎందుకు తీసుకోరనేది నగరవాసుల ప్రశ్న. టౌన్‌ ప్లానింగ్‌, మున్సి పల్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రతిరోజూ పట్టణాల్లో విధుల్లో భాగంగా తిరుగుతూనే ఉంటారు. కానీ వీరికి ఈ హోర్డింగులు ఎందుకు కనపడవో…. అర్ధంకాని విషయం. కొత్తగా ఏయే ప్రాంతాల్లో హోర్డింగులు వెలుస్తున్నాయో ప్రతీరోజూ సి.సి పుటేజీల పరిశీలన ద్వారా, ప్రత్యక్ష సందర్శన ద్వారానైనా గమనించొచ్చు. ప్రతీ హోర్డిం గుకు అనుమతి ఉందా.. లేదా అనేకోణంలో ఆరా తీయవచ్చు. కానీ ఇవేమీ అధికారులు పరిశీలించరు. దీంతో ఇష్టారాజ్యంగా హోర్డిం గులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అసలు అనుమతి పొందిన హోర్డింగులెన్ని? వాటి నాణ్యత, కాల పరిమితిని పరిశీలించాలి. అవసరమైతే మరమ్మతులు చేయించాలి. శిథిలావస్థలో ఉన్న హోర్డింగులు వెంటనే తొలగించడానికి చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణంలో గంటగంటకు మార్పులు సంభవిస్తున్నాయి. ఈదురు గాలులు, సుడిగాలులు భయంకరంగా వీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శిథిలావస్థకు చేరిన, అనుమతిలేని హోర్డింగు లతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయాన్ని గుర్తించాలి. పాడుబడిన ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, విద్యుత్‌ స్తంభాల వంటి వాటిని పరిశీలించి యజమానులకు నోటీసులు ఇవ్వాలి. వాటిని కూల్చే విధంగా చర్యలు తీసుకోవాలి. వాహనాలు, భవనా లకు, వివిధ ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలి. ప్రమాదాలు సంభవించకుండా ముందుగా చర్యలు తీసుకుంటే మంచిది. అదే సమయంలో ప్రజలు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటూ రహదారులపై ప్రయాణించాలి.
– ఐ.పి.రావు

Spread the love