సైన్సుపై శాస్త్రీయదృక్పధం పెరగాలి

– ఏఐపీఎఫ్‌ సదస్సులో జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్‌ రాజింవాలె
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సైన్స్‌ విస్తరించకుంటే, సమాజంలో అంథవిశ్వాసాలు పెరుగుతాయని ఆలిండియా ప్రొగ్రెసివ్‌ ఫోరం (ఏఐపీఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్‌ రాజింవాలె అన్నారు. సైన్స్‌పై శాస్త్రీయ దృక్పధం పెరగాలనీ, పరిశోధనలు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. సైన్స్‌ ఫలాలు సమాజంలో అందరికీ సమానంగా అందాలని ఆకాంక్షించారు. ఏఐపీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం ఎస్‌ఎన్‌ రెడ్డి భవన్‌లో ”రక్షణలో శాస్త్రీయ దృక్పధం” అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనిల్‌ రాజింవాలె మాట్లాడుతూ నిత్యజీవితంలో సైన్స్‌ ప్రాధాన్యతను వివరించారు. వస్తువుల ఉత్పత్తితో పాటు పంపిణీ కూడా సమానంగా జరగాలన్నారు. భౌతిక శాస్త్రంలో చలన సిద్దాంతం నూతన ఒరవడికి నాందిపలికిందనీ, అణువు నుంచి చోదక శక్తులు పెనుమార్పులు సంభవించి సైన్సులో కొత్త ఆవిష్కరణలకు దిశానిర్దేశం చేశాయన్నారు. కంప్యూటర్ల ఆవిర్భావం తర్వాత గతంలో కంటే మేధాశక్తి ఇప్పుడు మరింత పెరిగిందని విశ్లేషించారు. విద్యారంగం అభివద్ధి చెందినా, శాస్త్రీయ, సైన్సు ఆలోచనలు ఆ స్థాయిలో పెరగలేదని చెప్పారు. సైన్సును పాఠ్యంశాల నుంచి తొలగించటం సమంజసం కాదన్నారు. దీని ప్రభావం భవిష్యత్‌ తరాలు, సమాజంపై తీవ్రంగా ఉంటుందని వివరించారు. పారిశ్రామిక విప్లవం, యాంత్రీకరణ అన్నీ సైన్స్‌తోనే సాధ్యమయ్యాయని తెలిపారు. డార్విన్‌, మార్క్స్‌ సిద్దాంతాలు శాస్త్రీయమైనవనీ, వాటిని అనుసరించాలని చెప్పారు. మంత్రతంత్రాలతో వ్యాధులు నయంకావనీ, మతం, మూఢనమ్మకాలు శాస్త్రాలు కావన్నారు. సైన్స్‌ అంటే ప్రశ్నే అనీ, దాన్ని విస్తరించుకోవాలని అన్నారు. ఏఐపీఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్‌ యుగల్‌ రారు మాట్లాడుతూ అశాస్త్రీయమైన మూఢనమ్మకాలను నమ్మకూడదన్నారు. న్యూటన్‌ జడత్వ సిద్ధాంతం సైన్సులో కొత్త పుంతలు తొక్కిందనీ, డార్విన్‌ జీవ పరిణామ సిద్దాంత ప్రకారం ఇప్పటికీ సశాస్త్రీయంగా నిలిచిందంటూ కోవిడ్‌ ఉధృతి, టీకాల తయారీ, అవిపనిచేసే విధానాలను విశ్లేషించారు. దాన్ని కాదని గోమూత్రం తాగితే రోగాలు నయమవుతాయి అని ప్రచారం చేస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదన్నారు. ఎఐపిఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ రజని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐపీఎఫ్‌ నాయకులు వీయస్‌ బోస్‌ సమన్వయ కర్తగా వ్యవహరించారు.

Spread the love