నవతెలంగాణ – అశ్వారావుపేట
వినాయకాపురం గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధ్యాపకులు డాక్టర్ కృష్ణతేజ, డాక్టర్ జెమిమా పాల్గొని రైతులకు పలు వ్యవసాయ సూచనలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కే. రాజు, ఉపసర్పంచ్ ఎన్. జగదీశ్వర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి. వినయ్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, సీనియర్ వ్యవసాయ అధికారి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ విద్యాలయం ప్రతిపాదించిన ఆరు ముఖ్య అంశాలపై శాస్త్రవేత్తలు రైతులతో చర్చించారు. పంటల దిగుబడి పెంపు, ఖర్చు తగ్గింపు, అధిక లాభాలు సాధించే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రీయ ఉత్పత్తుల నాణ్యతను ధృవీకరించేందుకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. రసాయనాలు వినియోగించకుండా పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌తో పాటు అధిక ధర లభిస్తుందని పేర్కొన్నారు.



