ఓట్ల కాలంలో ఒట్ల జోరు పెరిగింది. బడికెళ్ళే పిల్లలు పక్కవాడి పెన్సిలో, బలపమో దొంగిలించ లేదన డానికి నెత్తిన చేయి పెట్టుకుని ‘సత్యప్రమాణకం’గా అనో, దేవుడి మీద ఒట్టేసో తోటి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తూంటారు. తనని తాను బళ్ళోకెళ్ళే పిలగాడిగా లెక్కేసుకునో లేదా ఓటర్లందర్నీ ఆవిధంగా లెక్కేసుకునో తెలియదుగానీ, మోడీ ఒక ‘గాడ్ ప్రామిస్’ చేశారు. యాదాద్రి ‘నర్సన్న’ను సాక్ష్యం పెట్టాడు. లిక్కర్ స్కామ్‌లోని వారెవరినీ శిక్షించకుండా వదలరట! మోడీ గ్యారంటీకి తిరుగుండదని శిష్యఅణువులో, పరమాణువులో, లేదా సొంత బాకాలో ఊదిన ప్రశస్తమైన నాదమది. ఈ కొత్త పల్లవి విని తెలంగాణ జనం బీజేపీని మరో సంజాయిషీ అడుగుతారని వీరికి తెలియదను కోవాలా? అసలు అడగరనే అతి విశ్వసమా? ఎందుకంటే ఇంతకాలం ఆపని చేయకుండా అడ్డుకున్నదెవరో మోడీ బృందమే సమాధానం చెప్పాలి. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటిపై ఇడీనో, సిబిఐనో, ఐటీనో ఎగదోలిన ఘటనలు చూస్తున్నాం. ఏకేసులూ లేని పార్టీ బహుశా బీఆరెస్సే. బీజేపీ రూటెందుకు మార్చిందోగానీ, సామాన్య జనంతో పాటూ బీజేపీ కార్యకర్తలూ చాలాగరం మీదున్నారు. ప్రస్తుతం ఎన్నికల చివరి అంకంలో యాదాద్రి నర్సన్నను ‘సాక్షం’ పెట్టి బీఆర్‌ఎస్‌ను డొక్కచించి, డోలు కట్టకపోతే తనపేరు మార్చు కుంటానన్నట్లు మోడీ శపథం చూసి తెలంగాణ జనం నవ్వు కుంటున్నారు. ఏమైనా కేసులు పెట్టడం, పెట్టకపోవడం బీఆర్‌ఎస్ భవిష్యత్‌లో తీసుకునే రాజకీయ వైఖరిని బట్టి ఉంటుందనేది నిర్వివాదాంశం.
ఫలానా పార్టీకే ఓట్లేస్తామని ప్రజల్తో, ముఖ్యంగా కుటుంబాల్తో, కుల సంఘాల్తో ‘ఒట్లు’ వేయించుకోవడం చాలాకాలం నుండి అమల్లో ఉన్న ‘ఆచారం’. దీపం ముందు ఒట్టేయించుకుంటారు, దేవుడి ఫొటోలు పెట్టి ఒట్లు వేయించుకుంటారు. తెలంగాణలో నేడు కొత్త ట్రెండు ప్రారంభమైంది. గ్రామాలకు గ్రామాలు గంపగుత్తగా కొని, హోల్‌సేల్‌గా ఒట్లు వేయించుకుంటున్నారు. ఆ గ్రామంలోని అందరి కందరూ ఓటేస్తే, అంటే ఎవరూ ఒట్టు తీసి గట్టు మీద పెట్టకుండా ఉంటే ఒక నిర్దిష్ట భారీ మొత్తం ఆ గ్రామానికి సదరు అభ్యర్థి ముట్టజెప్తాడు. బహుశా ఎన్నికలైన తర్వాత తప్పక ఇస్తానని ఆయన ఒట్టేస్తాడు కాబోలు.
ఆడిన మాట తప్పని ఇంతమంది సత్యహరిశ్చంద్రులు మనమధ్యే తిరుగుతుండ టం ఆశ్చర్యమే మరి! ఒట్టేసినట్టు ఈ జనమంతా ఆ నేతకే ఓటెయ్యాలి. అంత భారీ మొత్తం ఉంచిన పెద్దమనిషి అనుకున్నట్టు గ్రామానికి డబ్బివ్వాలి. దీనికి అదనం ఎవరికి వారికి ఒక ‘ఎక్స్’ మొత్తం! దానికి అదనం దేవతలు రోజూ ‘సేవించే’ది! ఇంట్లోని ఓట్ల సంఖ్యని బట్టి క్వార్టరా, హాఫా, ఫుల్లా అనేది నిర్ణయిస్తున్నారు. తలనీలాల నుండి నిలువు దోపిడీ వరకు వడ్డికాసుల వాడికి ఇవ్వడానికి అలవాటు పడ్డ జనం నమ్మిన నాయకుని కోసం, నమ్ముకున్న జనం కోసం సదరు నాయకుడు ఆయింత ‘ఒట్టు’ని సార్థకం చేయరా!
ఒట్లు ‘జస్ట్’ ఎన్నికల్లో వేయించుకునేవి, వేసేవే అనుకుంటే పొరబాటే! 2013, 2014లో మోడీ ఈ దేశం పెట్టుబడిదారుల చేతిలో చెయ్యేసి ఒట్టేసినవెన్నో ఉన్నాయి. 2014 మే 26 నుండి అవన్నీ ఒక్కొక్కటీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. నెలనెలా ఇచ్చే ‘మన్ కీ బాత్’ దీనిపై ఒక ప్రోగ్రెస్ కార్డ్ వంటిది. మొన్ననే 107వది జరిగింది. తాజాగా విదేశాలకెళ్ళి పెండ్లిళ్లు చేసుకోవడమేంటి? సుమారు ఐదు లక్షల కోట్ల వ్యాపారం ఇతర దేశాలకు పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
140కోట్ల మంది భారతీయుల్లో విదేశాల్లో పెండ్లిళ్లు చేసుకునేవారెవరో తెలియని అమాయకుడు కాదు మోడీ. ఆయన చెప్పిన ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యాపారంలో వజ్రాలు సానబట్టి మార్కెట్ చేయడం, బంగారు ఆభరణాలు రూపుదిద్దుకునేది దేశంలో ఏకైక ప్రాంతం సూరత్. అది ఏమూలన ఉందో తెలియనివారా మన ఓటర్లు? తన జనం కోసం ఆమాత్రం తపన పడకూడదా అని కాషాయ దళాలు ఎదురు ప్రశ్నిస్తూంటాయి. ఇది కేవలం తాజా సందర్భమే.
ఈ తొమ్మిదిన్నరేండ్లలో దేశంలో పేద, ధనిక అంతరాలు పెరిగిన తీరు గురించి వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్టు (2023) చెప్పిన అంశాలు చూస్తే పై ఒక శాతం జనాభా చేతులో 33శాతం జాతీయ సంపద ఉంది. రెండో వైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో తాజాగా మన స్థానం 125 దేశాల్లోనూ 111కి దిగజారింది. ఆ సూచీ తప్పని ఆనాడు విమర్శించిన మోడీ సర్కార్ నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల సంద ర్భంగా మనదేశంలో 81కోట్ల మంది పేదలున్నారని, అందుకే వారికోసం మరో ఐదు సంవత్సరాలు ఉచిత రేషన్‌లను ఇస్తామని దేశ ప్రజల చేతిలో చెయ్యేసి ఒట్టేశాడు కదా. ఎన్నికలంటే ఒట్లు వేయించు కోవడమే అనుకుంటున్నారేమో