– ఆదిభట్లలో పోలీసుల తనిఖీలు
నవతెలంగాణ-ఆదిభట్ల
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమతి లేకుండా తరలిస్తున్న రూ.58లక్షల నగదు పట్టుకున్నారు. ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు శ్రీశ్రీ ఏరో సీటి సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం సింగారం గ్రామానికి చెందిన పల్లా శ్రీకాంత్ వాహనంలో డబ్బులు తరలిస్తున్నాడు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా రూ.58లక్షల 46వేలు పట్టుబడ్డాయి. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు. డబ్బులు వండర్‌లా నుంచి బొంగులూరు మీదుగా తరలిస్తున్నట్టు గుర్తించారు. డీటీఓ వద్ద డబ్బు డిపాజిట్ చేశారు. పూర్తి విచారణ కోసం జిల్లా గ్రీవెన్స్ సెల్, ఐటీ విభాగానికి సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆదిభట్ల ఎస్‌ఐ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.