– బైక్ ను ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్..
– 2సంవత్సరాల పాప మృతి
నవతెలంగాణ- తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి రెండు సంవత్సరాల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి ఖాత రమేష్ మృత్యుతో పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెలితే మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన నిరుద్యోగి రమేష్ గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఇతడు తన కూతురు యశ్విని(2) ను, తన ద్విచక్ర వాహనం పై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్దకు వస్తుండగా, గోవిందరావుపేట మండలం పస్ర గ్రామానికి చెందిన సెయింట్ మేరీ స్కూల్ బస్సు వెనుక నుంచి వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యశ్వని చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తండ్రి రమేష్ ను అనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూతురు అక్కడికక్కడే మృతి చెంది, భర్త కొనఊపిరితో ఆసుపత్రిలో ఉండడంతో నిండు చూలాలైన భార్య మౌనిక తీవ్రంగా విలపించింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నార్లాపురం మొత్తం శోకసముద్రంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు.