ఆమె

SHeఆమె అవనిలో సగం.. ఆకాశంలో సగం.. సృష్టికి ప్రతిసృష్టి చేసే మహిమాన్విత.. సహనానికి మారుపేరు.. చైతన్య దీప్తి.. అమృత మూర్తి ఆమె.. ఇంటా బయటా అన్నీ తానై నడిపిస్తుంది. సమాజంలో సగభాగమై చేయూతనిస్తుంది. అయినా ఆమంటే వివక్ష. అడుగడుగునా ఆంక్షలు. తరతరాలుగా పీడనలు, దౌర్జాన్యాలను భరిస్తూనే ఉంది. అణిచివేతలు, అసమానతలతో అనేక విధాలుగా వివక్ష అనుభవిస్తూనే ఉంది. అయినా ఆటంకాలన్నింటినీ ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా విహంగ వీక్షణం చేస్తూనే ఉంది.
నిజమైన సాధికారత అంటే హక్కులను పొందడం, మూర్తిమత్వాభివృద్ధి, స్వయంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ. చట్టం ముందు సమానత్వం లేకపోతే సాధికారత ఒక మిథ్యగానే మిగిలిపోతోంది. నేడు మన దేశంలో మహిళా సాధికారత పరిస్థితి ఇదే. దేశాభివృద్ధికి స్త్రీల సమానత్వం ఒక మౌలిక అవసరం. కానీ మన పాలకులు దీన్ని బొత్తిగా మర్చిపోతున్నారు. దేశ జనాభాలో సగ భాగం స్త్రీలే. కానీ అక్షరాస్యత రేటు, శ్రామికశక్తి, సహభాగిత రేటు, ఆదాయం లాంటి అంశాల్లో పురుషులతో పోలిస్తే వెనకబడే ఉన్నారు.
మరోపక్క ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య 25శాతానికి పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు ఇంటి పని చేసుకుంటూనే ఉద్యోగ బాధ్యతలకు న్యాయం చేస్తున్న మహిళల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుందని అవే లెక్కలు చెబుతున్నాయి. అంటే ఏ విషయంలోనూ రాజీ పడకుండా అన్నింటికీ సమన్యాయం చేయడంలో మహిళలు అగ్రభాగంలో ఉన్నారనేది స్పష్టం. ఇలా మహిళలు ఇలా అన్నిరంగాల్లో ముందుకు పోతున్నా వారిపై నిత్యం గృహహింస పెరిగిపోతూనే ఉంది. పైగా ఇది నేరం కాదు అని భావించే దేశాల్లో ప్రస్తుతం 60 కోట్ల మందికి పైగా మహిళలు జీవిస్తున్నారు. వారికి స్వేచ్ఛ, సమానత్వం ఎక్కడుంది?
అమెరికా ప్రభుత్వం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల నుంచి 8 లక్షల మంది వరకు మహిళలు, పిల్లల అక్రమ రవాణా జరుగుతోంది. పపంచవ్యాప్తంగా ప్రతీ 90 సెకండ్లకూ ఓ మహిళ బిడ్డకు జన్మనిస్తూ చనిపోతోంది. ఇందుకు పేదరికం, శాడిస్టుల అరాచకం, నిరక్షరాస్యత ఇలా చాలా అంశాలు కారణంగా ఉన్నాయి. వీటిని సరిచేస్తే… ఈ మరణాలు ఆపొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు శారీరక, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణాన్ని తెలుసుకొని సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
మహిళల్లో 70 శాతం మంది పేదరికంలోనే ఉన్నారు. వారు రోజూ రూ.80 కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. అలాగే శరణార్థులుగా వెళ్తున్న మహిళల సంఖ్య పెరుగుతుంది. బాలికలపై భారీ ఎత్తున హింస, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఆరు కోట్లమందికి పైగా బాలికలకు 18 ఏండ్లు నిండకుండానే పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఓ అంచనా ప్రకారం ప్రభుత్వ పోస్టుల్లో మహిళలు కేవలం 15 శాతమే ఉన్నారు. మరింత కఠినమైన వాస్తవం ఏమిటంటే మహిళల్లో 1.64 కోట్ల మందికి పైగా మహిళలు హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ బాధితులుగా ఉన్నారు.
మహిళలు ఎదిగితే.. తమ చుట్టూ ఉన్నవారు ఎదిగేలా చేస్తారు. ఇది జగమెరిగిన వాస్తవం. ‘ఏవిషయంలోనైనా పురుషులకి పోటీగా మహిళలు రాణించగలరు, మానసిక సామర్థ్యం వారికి అదనపు బహుమతి’ అంటారు హాత్మాగాంధీ. అందుకే మహిళలకు అవకాశాలు కల్పించాలి. తద్వారా దేశాభివృద్ధికి బాటలు వెయ్యాలి.

Spread the love