‘గొర్రె’ వెనక్కి..!

'Sheep' back..!– స్కీం నుంచి నగదు ఉపసంహరించుకుంటున్న గొల్లకుర్మలు
– రాష్ట్రవ్యాప్తంగా బీ లిస్టులోని 3.54 లక్షల మంది పరిస్థితి అధోగతి
– అప్పుల పాలైన పేదలు.. ఒక్కొక్కరిపై రూ.25వేల వడ్డీ భారం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘కుల వృత్తులకు జీవం పోయాలె.. గొల్ల కురుమల జీవితాలు మారాలె.. బతుకు దెరువుకు వలసెళ్లినోళ్లు వాపస్‌ రావాలె.. ఉన్న ఊల్లెనే పని జేయాలె.. ఆర్థికంగా ఎదగాలె.. ఇంటిల్లిపాదీ మెతుకు తినాలె..’ అని మాటలు చెప్పి 75 శాతం రాయితీపై గొర్రెల యూనిట్‌ పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ‘ఏ’ లిస్టులో లబ్దిదారులకు కొంతమేరకు న్యాయం చేసింది. కానీ రెండేండ్ల క్రితం నగదు చెల్లించిన ‘బీ’ లిస్డులోని గొల్ల కురుమలకు తీరని అన్యాయం జరిగింది. ఒక్కరంటే ఒక్కరికి కూడా యూనిట్‌ మంజూరు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 3,54,791 మంది గొల్ల, కురుమల సొసైటీ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కొక్కరు తమ వాటాధనంగా రూ. 43,750 చెల్లించారు. రెండేండ్లుగా తమకు రావాల్సిన రూ.1.75 లక్షల విలువైన ఒక్కో యూనిట్‌ (20 గొర్రెలు + 1 పొట్టేలు) కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ. రెండు లక్షలు ఈ పథకం దరఖాస్తుదారులకు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ మొన్నటి బడ్జెట్లో ఈ పథకం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీని మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ స్కీంలో అవినీతి చోటు చేసుకున్నట్టు ‘కాగ్‌’ నివేదిక ఇవ్వడం, అప్పు చేసి డీడీలు తీసిన రూ. 43,750కి రెండేండ్లుగా వడ్డీ చెల్లించడం భారం కావడంతో లబ్దిదారులు డీడీలు వాపస్‌ తీసుకుంటున్నారు.
డీడీల వాపస్‌..
డీడీలను పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక దరఖాస్తును కూడా రూపొందించిన ప్రభుత్వం.. ఆ దరఖాస్తు పెట్టుకున్న గొల్లకుర్మల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. గత నెలరోజులుగా ఈ డీడీల వాపస్‌ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల వారీగా డీడీలు వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి నుంచే దరఖాస్తుదారులు డీడీలు వెనక్కి తీసుకుంటున్నారు. జిల్లాలోని పెనుబల్లి మండలంలో ఒక్క కారాయిగూడెం లోనే 80 మంది నగదు వెనక్కు తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో వారం రోజుల కిందట వాపస్‌ ప్రక్రియ ప్రారంభించినట్టు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారు. మరో 3,37,816 మంది గొల్లకుర్మలకు రెండో విడతలో గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా, గత ఎన్నికల కంటే ముందు సుమారు 80 వేల మంది రూ.43,750 చొప్పున డీడీలు తీసి ఎదురుచూస్తుండగా ప్రభుత్వం ఆకస్మికంగా డీడీలు వాపస్‌ చేస్తుండటం గమనార్హం. ఈ కారణంగా ఒక్కో దరఖాస్తుదారుపై రూ. 25 వేలకు పైగా వడ్డీ భారం పడుతోంది.
వెనక్కు ఇచ్చేయడంపై విమర్శలు..
వాస్తవానికి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని కొనసాగిస్తామని, 90 రోజుల్లో రెండో విడత పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ దీనికి విరుద్ధంగా ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ గొల్లకుర్మలు కట్టిన డీడీలను వారికి వెనక్కు ఇచ్చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పశుసంవర్ధక శాఖ.. సీఎం దగ్గర ఉన్నా..
మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిధిలోనే పశుసంవర్ధక శాఖ ఉంది. అధికారులూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారని తెలిసింది. అసలు గొర్రెల పథకం గురించి చర్చ జరిగింది ఒక్కసారేనని అంటున్నారు. మూడు, నాలుగు నెలల క్రితం కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అధికారులు ఈ పథకం విషయంలో అవినీతికి పాల్పడి ఏసీబీకి పట్టుపడడం కూడా ఈ స్కీం పై గొల్ల కురుమలకు విశ్వాసం సడలేలా చేసింది. గొర్రెల పంపిణీ స్కామ్‌లో రూ.2.10కోట్ల ప్రభుత్వ నిధులకు పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడం, దీనికి సంబంధించి 10మంది అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇంకా దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. దానికి భిన్నంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
నగదు వెనక్కి తీసుకున్నా లబ్ది చేకూర్చాలి..
చింతలచెర్పు కోటేశ్వరరావు, తుషాకుల లింగయ్య,తెలంగాణ గొర్రెల, మేకల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
ఆర్ధిక ఇబ్బందులతో నగదు వెనక్కు తీసుకుంటున్న సభ్యులకు కూడా లబ్ది చేకూరేలా ప్రభుత్వం చూడాలి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలు సభ్యులందరికీ ఇవ్వాలి. గతంలో మాదిరి కాకుండా అవినీతికి తావు లేకుండా నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయాలి. డీడీలను వాపస్‌ చేయడాన్ని వెంటనే నిలిపివేసి ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.

Spread the love