– సుదీర్ఘ కాలం మంత్రులుగా పనిచేసినోళ్లు
– తొలి, మలి దశ ఉద్యమ కాలంలో
– ఐదు ఉపఎన్నికల్లో గెలుపు వీరిదే..
– మెజార్టీ రికార్డు హరీశ్‌రావు సొంతం
– తెలంగాణ పురిటి గడ్డగా గుర్తింపు
– కేసీఆర్, హరీశ్‌రావు హాట్రిక్ వీరికి ముందు మదన్‌మోహన్ 4 సార్లు విజయం
– ఈ ముగ్గురూ ఉద్యమకారులే..
పొందిన నియోజకవర్గం సిద్దిపేట. తొలి, మలిదశ ఉద్యమాల నేపథ్యంలో ఐదుసార్లు ఉప ఎన్నికలు జరిగిందీ ఇక్కడే. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజార్టీ సాధించి చరిత్ర కెక్కారు. ఇరవైసార్లు ఎన్నికలు జరిగితే అందులో పదహారు సార్లు ముచ్చటగా ముగ్గురంటే ముగ్గురే ఎమ్మెల్యేల య్యారు. ఆ ముగ్గురిలో ఇద్దరు డబుల్ హాట్రిక్ కొట్టగా, మరొకరు నాలుగు పర్యాయాలు గెలిచారు. ఉద్యమకారులైన వీళ్లు ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగానూ పని చేశారు. ఘనమైన చరిత్ర కలిగిన సిద్దిపేట నియోకవర్గంలో 21వ సారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావుని ఢకొీని నెగ్గేదెవరు..! ఆయన మెజార్టీని ఆపేదెవరు..!! అనేది చర్చనీయాంశంగా మారింది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సిద్దిపేట నియోజక వర్గం ఏర్పడిన నుంచి 20 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 తొలి ఎన్నికల్లో పీడీఎఫ్ విజయం సాధించగా, తర్వాత కాంగ్రెస్, మూడో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 1967లో కాంగ్రెస్ గెలవగా.. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం రాజుకుంది. ఆ నేపథ్యంలోనే అప్పటి ఎమ్మెల్యే వీబీ రాజు రాజీనామా చేశారు. దాంతో 1970లో వచ్చిన ఉప ఎన్నికల్లో ప్రజాసమితి పక్షాన అనంతుల మదన్‌మోహన్ గెలిచారు. 1972, 1978, 1983లో తెలుగుదేశం ప్రభంజనంలోనూ ఆయన నాలుగోసారి గెలిచారు. మదన్‌మోహన్ నుంచి రాజకీయాలు నేర్చుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తొలిసారి 1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. గురువుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1985లో గురువును ఓడించిన చంద్రశేఖర్‌రావు ఓటమెరగని విజేతగా 2004 వరకు డబుల్ హాట్రిక్ కొట్టారు. కేసీఆర్ అల్లునిగా ఉద్యమాల్లోకి వచ్చిన తన్నీరు హరీశ్‌రావు 2004 ఉప ఎన్నికల బరిలో దిగి తొలిసారి గెలిచారు. ఆ గెలుపు పరంపరను 2018 వరకు కొనసాగించిన హరీశ్‌రావు మామ కేసీఆర్ రికార్డును బద్దలు కొట్టేందుకు 2023 ఎన్నికలకు సిద్ధమయ్యారు.
ఓడి గెలిచిన కేసీఆర్.. ఓటమెరగని హరీశ్‌రావు
1970 నుంచి 2018 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే ముగ్గురే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో మదన్‌మోహన్ ఒకరు కాగా, మిగిలిన ఇద్దరిలో కేసీఆర్, హరీశ్‌రావు ఉన్నారు. కేసీఆర్ తొలిసారి 1983లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌పై ఓడిపోయారు. ఆ తర్వాత 1985 నుంచి 2018 వరకు సిద్దిపేట నుంచి ఆరు సార్లు, గజ్వేల్ నుంచి రెండుసార్లు గెలిసి అసెంబ్లీలో అత్యధిక సార్లు ప్రాతినిధ్యం వహించిన నాయకునిగా ఉన్నారు. ఆయన వారసునిగా సిద్దిపేట నుంచి 2004 ఉప ఎన్నికల్లో గెలిచిన హరీశ్‌రావు ఆరుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఏడోసారి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతానంటూ ప్రచారం చేస్తున్నారు.
హరీశ్‌రావు గెలుపును ఆపేదెవరు..?
పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన హరీశ్‌రావు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన గెలుపునకు బ్రేకులు వేసేదెవరో చూడాలి. సిద్దిపేటను అభివృద్ధి పథంలో ముందుంచిన హరీశ్‌రావును ఈ ఎన్నికల్లో ఢకొీని ఓడించేందుకు విపక్షాలు సై అంటున్నాయి. గట్టి పోటీ ఇవ్వడమే కాదు కాంగ్రెస్ గాలి వీస్తున్నందున బీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు. 2,28,523 మంది ఓటర్లున్న సిద్దిపేటలో పురుష ఓటర్లు 1,12,934 మంది, మహిళా ఓటర్లు 1,15,520 మంది ఉన్నారు. ఈసారి కూడా హరీశ్‌రావు మెజార్టీ గురించే చర్చ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఏ ఎమ్మెల్యే సాధించలేనంత మెజార్టీని ఆయన సొంతం చేసుకున్నారు. తెలంగాణ జనసమితి అభ్యర్థి భవాణీపై 1,31,295 ఓట్ల మెజార్టీ సాధించారు. పోలైన ఓట్లల్లో 78.54 శాతం ఆయనకే పడ్డాయి. 2014 ఎన్నికల్లోనూ 71.96 శాతం ఓట్లతో ప్రత్యర్థిపై 93,328 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈసారి గత మెజార్టీ కొనసాగుద్దా..? లేక తగ్గుద్దా..? అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పూజల హరికృష్ణను ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఖరారు కాలేదు. హరీశ్‌రావు సిద్దిపేట నియోజకర్గంలో సుడిగాలిలా ప్రచారాన్ని చుట్టేస్తున్నారు.
ఐదు ఉప ఎన్నికలు ఇక్కడే..
నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత అత్యధిక సార్లు ఉప ఎన్నికలు సిద్దిపేటలోనే జరిగాయి. 1970 ఉప ఎన్నిక జరగ్గా ప్రజాసమితి పక్షాన మదన్‌మోహన్ గెలిచారు. 2001 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ గెలిచారు. 2004, 2008, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రావు గెలిచారు. ఐదు ఉప ఎన్నికలు కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనే డిమాండ్ నేపథ్యంలోనే వచ్చాయి. విచిత్రమేమంటే ఇక్కడ గెలిచిన ముగ్గురు కూడా మంత్రులు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు గెలిచిన మదన్‌మోహన్.. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రామ్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. రాష్ట్రం కోసం పోరాడి సాధించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేండ్ల్లుగా కేసీఆర్ పనిచేస్తున్నారు. హరీశ్‌రావు కూడా వైఎస్సార్ ప్రభుత్వంలో యువజన సర్వీస్‌ల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఇరిగేషన్, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, 2018లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యలు చేపట్టారు.