పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు మేలు

నవతెలంగాణ- కంటేశ్వర్
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపున ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తదితరులకు మట్టి గణపతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రెవెన్యూ ఉద్యోగుల సంఘం సేవలను ప్రశంసించారు. పీవోపీ వినాయకులు, రసాయన రంగులతో కూడిన వినాయక ప్రతిమలతో పర్యవరణానికి ఎంతో చేటు కలుగుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ద్వారా ప్రారంభించబడి కొనసాగిస్తున్న హెల్పింగ్‌ హార్ట్స్ ఫౌండేషన్‌ గత 14 సంవత్సరాలుగా తమ వంతుగా మట్టి వినాయకుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందిస్తుండడం అభినందనీయం అన్నారు.  రెవెన్యూ శాఖలో ఎంతో పని ఒత్తిడితో కూడిన విధుల్లో నిమగ్నమై ఉంటూనే ఓ వైపు పర్యావరణ పరిరక్షణ.. మరోవైపు సామాజిక సేవ, పేదలకు అండగా నిలిచేందుకు హెల్పింగ్‌ హార్ట్స్ ఫౌండేషన్‌ వేదికగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్, తహశీల్దార్ వేణుగోపాల్, శ్రీనివాస్ రావు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love