కలెక్టరేట్లపై సోలార్‌ ప్లాంట్లు..

– సూర్యాపేటలో 20న సీఎం కేసీఆర్‌చే ప్రారంభం : తెలంగాణ రెడ్కో చైర్మెన్‌ వై.సతీష్‌ రెడ్డి.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాలుష్య రహిత తెలంగాణ నిర్మాణంలో భాగంగా జిల్లాలో కొత్తగా నిర్మితమవుతున్న కలెక్టరేట్‌ భవనాల్లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో)చైర్మెన్‌ వై సతీశ్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లోని సోలార్‌ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నా రు. ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌)లో 200 కిలోవాట్ల గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను తెలంగాణ రెడ్కో సంస్థ ఏర్పాటు చేసిందని తెలిపారు. పార్కింగ్‌ స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలా.. పార్కింగ్‌ ఏరియాపై భాగంలో సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ లో హైటెన్షన్‌ సర్వీస్‌ లో నెలకు దాదాపు 14 వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్‌ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ వినియోగమవుతోం దని పేర్కొన్నారు. నెలకు 28వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ అవసరం కాగా.. 200 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో 24వేల యూనిట్ల వరకు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. సూర్యాపేట జిల్లా సమీకత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌)లో 100 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీని ద్వారా ఏటా లక్షా 44 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లో 100 కిలోవాట్‌ సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్‌, కామారెడ్డి కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ లో మరో 100 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ సోలార్‌ ప్లాంట్‌ ల నిర్వహణ బాధ్యతలు 20 ఏళ్ల పాటు తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివద్ధి సంస్థ చూసుకోనుందనీ, వినియోగ దారులకు ఇబ్బంది లేకుండా ప్లాంట్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా సంస్థే వాటిని సరిచేస్తుందని తెలిపారు. ఇతర కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లు, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చొరవ చూపాలని సతీశ్‌రెడ్డి కోరారు.

Spread the love