Wednesday, June 3, 2026
E-PAPER
Homeజాతీయంకాక్రోచ్ ఆందోళ‌న‌ల‌కు సోనమ్ వాంగ్ చుక్ మ‌ద్ద‌తు

కాక్రోచ్ ఆందోళ‌న‌ల‌కు సోనమ్ వాంగ్ చుక్ మ‌ద్ద‌తు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశంలో విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 5లోగా తన పదవికి రాజీనామా చేయకుంటే, జూన్ 6న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపడుతున్న భారీ నిరసన ప్రదర్శనలో తాను కూడా పాల్గొంటానని ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ హెచ్చరించారు. దేశంలో విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులు, సంస్కరణల అమలుపై ఉన్న విస్తృత ఆందోళనలే తన నిర్ణయానికి కారణాలని మంగళవారం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ప్రత్యేక వీడియోలో ఆయన పేర్కొన్నారు.

ఈ ఉద్యమ నిర్వాహకులతో తాను మాట్లాడానని, ఈ పోరాటం భారతీయ యువత ఆవేదనను, వారి గొంతుకను ప్రతిబింబిస్తోందని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు యువత ఎంతో కృషి చేస్తోందని, కానీ ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం గత నాలుగు దశాబ్దాలుగా తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని గుర్తు చేస్తూ, జాతీయ విద్యా విధానం అమలు తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల పరీక్షలలో జరిగిన అవతవకలు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న తీవ్రమైన సమస్య అని, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటి భారీ వైఫల్యాలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సోనమ్ వాంగ్ చుక్ ప్రకటనను సిజెపి స్వాగతించింది. “సోనమ్ వాంగ్ చుక్ కాక్రోచ్ ఉద్యమంలో చేరారు. ఆయన ఈ ఉద్యమంలో చేరినందుకు ధన్యవాదాలు. ఇది మా యువతకు దక్కిన గొప్ప గౌరవం. జూన్ 6న మీ కోసం ఎదురుచూస్తుంటాం. జైహింద్ ” అని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల హక్కుల కోసం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం సాగుతున్న ఈ పోరాటానికి సోనమ్ వాంగ్ చుక్ వంటి ప్రముఖులు మద్దతు తెలపడం తమకు ఎంతో బలాన్ని చేకూర్చిందని అన్నారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం జూన్ 6న ఢిల్లీలో చేపట్టబోయే ఈ శాంతియుత నిరసన ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -