ఓట్ల కోసం పాట్లు..

Songs for votes..– ఎన్నికల వేళ సెటిలర్లకు బీఆర్‌ఎస్‌ గాలం
– ఎన్టీఆర్‌ జపం చేసిన కేటీఆర్‌
– చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హరీశ్‌రావు
– స్వరం మార్చిన నేతలు
– విస్తుపోతున్న ప్రజలు
‘ఆందోళనలు ఆంధ్రాలో చేసుకోండి హైదరాబాద్‌లో కాదు’…’చంద్రబాబు అరెస్టుతో బీఆర్‌ఎస్‌కేం సంబంధం ? దీనిపై మా పార్టీ నాయకులెవరైనా మాట్లాడితే అది కేవలం వారి వ్యక్తిగత వ్యవహారం’… ఇవి నిన్నటి మాటలు. ‘మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే… ‘చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం’…ఇవి ఈనాటి మాటలు. నిన్న అలా.. నేడు ఇలా… ఇంతలో ఎంతమార్పు..ఎందుకీ మార్పు? రోజుల వ్యవధిలోనే బీఆర్‌ఎస్‌ నేతల వైఖరిలో వచ్చిన మార్పు దేనికి సంకేతం..? ఏ పూటకు ఆ పాట పాడటమంటే ఇదే మరి. ఓట్ల కోసం ఎన్ని పాట్లో…
బి.వి.యన్‌.పద్మరాజు
ఏ ఎండాకాగొడుగు పట్టటమనేది రాజకీయ నాయకులకు తెలిసినంతంగా మరెవ్వరికీ తెలియదేమో. అందునా ఓటర్ల నాడిని, జనం మూడ్‌ను పసిగట్టటంలో అధికార బీఆర్‌ఎస్‌ నేతలు మహా దిట్టలు. అందుకే రానున్న శాసనసభ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లను మూటగట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో కీలక హోదాలు, పదవుల్లో ఉన్న నేతలు ఆయన అరెస్టును ఖండించిన సంగతీ విదితమే. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, పువ్వాడ అజయకుమార్‌, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద తదితరులు చంద్రబాబు అరెస్టును ఖండించిన వారిలో ఉన్నారు. తాజాగా సిద్ధిపేటలో మంత్రి హరీశ్‌రావు…’ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయటం మంచిదికాదు…’ అంటూ వ్యాఖ్యానించారు.
కానీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఇందుకు భిన్నంగా స్పందించి వార్తల్లో నిలిచారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టగా ఆయన వారిపై తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘చంద్రబాబుకు సంబంధించిన నిరసనలు ఏమైనా ఉంటే ఆంధ్రాలో చేసుకోండి… ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకండి…’ అంటూ సీరియస్‌ అయ్యారు. సంబంధిత నిరసనలకు ప్రభుత్వం అనుమతిని కూడా నిరాకరించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇది సెటిలర్లకూ ఆగ్రహాన్ని తెప్పించింది. వారి ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకుపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, నిజామాబాద్‌ జిల్లాల్లోని బాన్సువాడ, నిజామాబాద్‌ రూరల్‌ తదితర నియోజకవర్గాలకు చెందిన
ఎమ్మెల్యేలు సెటిలర్ల ‘బలాబలాల’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. వారి ఓట్లు లేకపోతే తాము ఎన్నికల్లో గెలవలేమంటూ అధినేత వద్ద తమ గోసను వెళ్లబోసుకున్నారు కాబోలు.. ఇప్పుడు మాట మార్చి సెటిలర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
నష్ట నివారణా చర్యలు…
ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో సెటిటర్ల బలాబలాలను పసిగట్టిన కేసీఆర్‌ ఆఘమేఘాల మీద నష్ట నివారణా చర్యలకు ఆదేశించారు. అందుకే కేటీఆర్‌ రంగంలోకి దిగి… సెటిలర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు మంత్రి పువ్వాడ అజయకుమార్‌… తొలుత జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారని వినికిడి. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి, తానే ఆ సభకు ముఖ్య అతిథిగా హాజరై, ఎన్టీఆర్‌ను వేనోళ్లా కీర్తించారు. ఇదే సమయంలో అన్నగారిని, సీఎం కేసీఆర్‌ను పోలుస్తూ ‘కేసీఆర్‌కు ఎన్టీఆర్‌ రాజకీయ గురువు…’ అని చెప్పటం ద్వారా సెటిలర్లలో ఉన్న ఆగ్రహాన్ని, అనుగ్రహంగా మార్చుకునేందుకు ప్రయత్నించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు సిద్ధిపేట కేంద్రంగా హరీశ్‌రావు సైతం చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. మరి ఈ నష్ట నివారణా ప్రయత్నాలు ఫలిస్తాయా..? లేదా..? అన్నది ఎన్నికల తర్వాత గానీ తెలియదు.
ఆనాటి కేసీఆర్‌ మాటలు…
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలనే ప్రస్తావన వచ్చినప్పుడు గతంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ‘ఎన్టీఆర్‌ నాకు రాజకీయ గురువు. ఆయన ప్రోత్సాహంతోనే నేను నాయకుడిగా ఎదిగాను. కానీ ఒక ఆంధ్రా వ్యక్తి పేరును తెలంగాణ ప్రాంతంలోని టెర్మినల్‌కు ఎలా పెడతారు. మీరు అంతగా పెట్టాలనుకుంటే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును ఆ టెర్మినల్‌కు పెట్టండి…’ అంటూ కేసీఆర్‌ అప్పట్లో వ్యాఖ్యానించటం గమనార్హం.

Spread the love