భారత్‌కు స్పిన్‌ స్ట్రోక్‌

భారత్‌కు స్పిన్‌ స్ట్రోక్‌– తొలి టెస్టులో టీమ్‌ ఇండియా ఓటమి
– 231 ఛేదనలో రోహిత్‌సేన చతికిల
– ఉప్పల్‌లో తిప్పేసిన టామ్‌ హార్ట్లీ
– 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపు
సొంతగడ్డపై తిరుగులేని రికార్డు. అమ్ములపొదిలో ముగ్గురు ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు, ఇద్దరు వరల్డ్‌ క్లాస్‌ పేసర్లు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 190 పరుగులు. ఈ దశ నుంచి టీమ్‌ ఇండియా స్వదేశీ టెస్టులో ఓటమి చవిచూస్తుందని ఎవరూ ఊహించరు. కానీ బజ్‌బాల్‌ ఇంగ్లాండ్‌ ఆ పని చేసి చూపించింది. ఓ వైపు గబ్బా కోటలో ఆతిథ్య ఆసీస్‌పై కరీబియన్లు సంచలన విజయం సాధించగా.. ఉప్పల్‌ కోటలో భారత్‌కు అటువంటి ఓటమే రుచి చూపించింది ఇంగ్లాండ్‌!. ఒలీ పోప్‌ (196) సంచలన ఇన్నింగ్స్‌, అరంగ్రేట స్పిన్నర్‌ టామ్‌ హార్ట్లీ (7/62) ఏడు వికెట్ల మాయజాలంతో తొలి టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్‌పై 28 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఉప్పల్‌ కోట బద్దలైంది. టీమ్‌ ఇండియాకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో తొలిసారి ఆతిథ్య జట్టుకు పరాజయం ఎదురైంది. 231 పరుగుల ఛేదనలో రోహిత్‌సేన చేతులెత్తేసింది. ధనాధన్‌ వ్యూహంతో బరిలోకి దిగిన భారత్‌.. పరుగులు సాధించినా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్లీ భారత్‌కు హార్ట్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. రవీంద్ర జడేజా రనౌట్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వికెట్‌తో భారత్‌ మ్యాచ్‌పై పట్టు కోల్పోగా.. తెలుగు తేజం కెఎస్‌ భరత్‌ నిష్క్రమణతో ఓటమికి మానసికంగా సిద్ధమైంది. గత సిరీస్‌ తరహాలోనే తొలి టెస్టులో విజయంతో భారత పర్యటనను ఇంగ్లాండ్‌ ఘనంగా ఆరంభించింది. భారత్‌, ఇంగ్లాండ్‌ రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరుగనుంది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టులో ఆతిథ్య టీమ్‌ ఇండియా అనూహ్య ఓటమి చవిచూసింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన టెస్టులో ఏకంగా మూడు రోజుల పాటు ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌.. 231 పరుగుల ఛేదనలో చతికిల పడింది. ఊరించే ఛేదనను వేగంగా ముగించాలనే తొందరపాటు రోహిత్‌సేనను కోలుకోలేని దెబ్బ తీసింది. 69.2 ఓవర్లలో 202 పరుగులకే భారత్‌ కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ అరంగ్రేట స్పిన్నర్‌ టామ్‌ హార్ట్లీ (7/62) ఏడు వికెట్ల మాయజాలంతో భారత్‌కు షాక్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (39, 58 బంతుల్లో 7 ఫోర్లు), కె.ఎస్‌ భరత్‌ (28, 59 బంతుల్లో 3 ఫోర్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (28, 84 బంతుల్లో 2 ఫోర్లు), కెఎల్‌ రాహుల్‌ (22, 48 బంతుల్లో 3 ఫోర్లు) రాణించినా.. జట్టును గెలుపు గీత వరకూ తీసుకెళ్లటంలో విఫలమయ్యారు. భరత్‌, అశ్విన్‌ ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు.. సిరాజ్‌, బుమ్రా పదో వికెట్‌కు 25 పరుగులు జోడించి భారత్‌కు గెలుపుపై ఆశలు రేకెత్తించారు. అంతకుముందు తొలి సెషన్లో ఒలీ పోప్‌ (196, 278 బంతుల్లో 21 ఫోర్లు) అసమాన శతక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. బెన్‌ ఫోక్స్‌ (34), టామ్‌ హార్ట్లీ (34), రెహాన్‌ అహ్మద్‌ (28) సైతం రాణించటంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 420 పరుగుల భారీ స్కోరు సాధించింది. 163 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌. ఒలీ పోప్‌ హీరోయిక్స్‌తో చివరి ఐదు వికెట్లకు 257 పరుగులు జతచేసింది. ఇంగ్లాండ్‌కు విజయాన్నందించిన ఒలీ పోప్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
భారత్‌కు ‘హార్ట్లీ’ బ్రేక్‌!
లక్ష్యం 231 పరుగులు. సొంత గడ్డపై స్పిన్‌ను అలవోకగా ఆడే బ్యాటింగ్‌ లైనప్‌తో కూడిన భారత్‌కు ఇదేమీ పెద్ద కష్టం కాదనిపించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (39), యశస్వి జైస్వాల్‌ (15) అందుకు తగినట్టుగానే దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు 11.4 ఓవర్లలోనే 42 పరుగులు జోడించారు. సాఫీగా సాగుతున్న భారత ఛేదనకు హార్ట్లీ బ్రేక్‌ వేశాడు. భారత టాప్‌-3 బ్యాటర్లను అవుట్‌ చేసి ఇంగ్లాండ్‌ను రేసులోకి తెచ్చాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో హార్ట్లీ భారత్‌ను గట్టి దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. యశస్వి జైస్వాల్‌ షార్ట్‌ లెగ్‌లో, శుభ్‌మన్‌ గిల్‌ (0) సిల్లీ పాయింట్‌లో ఒలీ పోప్‌కు దొరికిపోయారు. దీంతో 42/0 నుంచి భారత్‌ 42/2కు పడిపోయింది. ఏడు బౌండరీలు బాది జోరుమీదున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం వికెట్‌ నిలుపుకోలేదు. హార్ట్లీ బంతిని అంచనా వేయటంలో విఫలమైన హిట్‌మ్యాన్‌ ఎల్బీగా మూడో వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు. అప్పటికి భారత్‌ స్కోరు 63/3. అక్షర్‌ పటేల్‌ (17)ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేసిన భారత్‌ టీ విరామానికి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త వహించింది. కెఎల్‌ రాహుల్‌, అక్షర్‌లు ఒత్తిడిని ఎదుర్కొని నిలబడ్డారు. టీ విరామ సమయానికి భారత్‌ 95/3తో నిలిచింది.
ఆశలు రేపి.. వదిలేశారు
విజయానికి మరో 136 పరుగులు అవసరం. చేతిలో ఏడు వికెట్లు. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగల బ్యాటర్లు రాహుల్‌, అయ్యర్‌, జడేజా ఉండటంతో గెలుపుపై భారత్‌ దీమాగా కనిపించింది. కానీ చివరి సెషన్‌ ఆరంభంలోనే ఇంగ్లాండ్‌ అదిరే బ్రేక్‌ సాధించింది. 24 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కూల్చిన ఇంగ్లాండ్‌.. ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచింది. కెఎల్‌ రాహుల్‌ (22), అక్షర్‌ పటేల్‌ (17), శ్రేయస్‌ అయ్యర్‌ (13) సహా రవీంద్ర జడేజా (2) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్‌ 119/7తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఇక్కడి నుంచి అశ్విన్‌ (28), భరత్‌ (28) మ్యాజిక్‌ మొదలైంది. జోరుమీదున్న ఇంగ్లాండ్‌ స్పిన్నర్లను స్వేచ్ఛగా ఆడిన ఈ జోడీ.. ఎనిమిదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేసింది. 130 బంతుల్లో 57 పరుగులు జోడించిన అశ్విన్‌, భరత్‌లు భారత్‌ను రేసులోకి తెచ్చారు. మరో 55 పరుగులు అవసరమైన దశలో.. ఇద్దరు బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నారు. మ్యాచ్‌ ఐదో రోజుకు చేరుతుందనే అనిపించింది. కానీ టామ్‌ హార్ట్లీ సూపర్‌ మాయ చేశాడు. భరత్‌ డిఫెన్స్‌ను ఛేదించి వికెట్లను గిరాటేశాడు. దీంతో భారత్‌ మళ్లీ కష్టాల్లో కూరుకుంది.
అశ్విన్‌ బాధ్యతారహిత దూకుడుతో ఇంగ్లాండ్‌కు మ్యాచ్‌ను అప్పగించేశాడు. క్రీజు వదిలేసి హిట్టింగ్‌కు వచ్చని అశ్విన్‌ మళ్లీ వెనక్కి వెళ్లలేదు.
ఇంగ్లాండ్‌ విజయానికి మరో వికెట్‌ దూరంలో నిలువటంతో అంపైర్లు ఆటను మరో అర గంట పొడగించారు. ఇక్కడ బుమ్రా, సిరాజ్‌ జోడీ దంచికొట్టింది. వడివడిగా పరుగులు చేస్తూ ఇంగ్లాండ్‌ను ఒత్తిడికి గురి చేసింది. 37 బంతుల్లోనే ఈ జోడి 25 పరుగులు జోడించింది. లక్ష్యం 30 పరుగుల దిగువకు వచ్చింది. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇక నాల్గో రోజు ఆట చివరి ఓవర్లో మహ్మద్‌ సిరాజ్‌ (12) హిట్టింగ్‌కు వచ్చి ఆశలు ఆవిరి చేశాడు. బుమ్రా (6 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. 69.2 ఓవర్లలో భారత్‌ 202 పరుగులకు కుప్పకూలగా.. ఇంగ్లాండ్‌ 28 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఒలీ పోప్‌ 196
ఓవర్‌నైట్‌ స్కోరు 316/6తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ విలువైన పరుగులు జోడించింది. చివరి నాలుగు వికెట్లకు ఏకంగా 104 పరుగులు జత చేసింది. టెయిలెండర్లలో కలిసి ఒలీ పోప్‌ (196) అద్భుతమే చేశాడు. రెండు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి ఇంగ్లాండ్‌ విజయం కోసం పోరాడే పరిస్థితులు కల్పించాడు. రెహాన్‌ అహ్మద్‌ (28, 53 బంతుల్లో 3 ఫోర్లు), టామ్‌ హర్ట్లీ (34, 52 బంతుల్లో 4 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. రెహాన్‌తో కలిసి ఏడో వికెట్‌కు 64 పరుగులు, హార్ట్లీతో కలిసి 8వ వికెట్‌కు 80 పరుగులు జత చేశాడు పోప్‌. ఉదయం సెషన్‌ ఆరంభంలోనే 17 ఫోర్లతో 212 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ చేరుకున్నాడు. ఉదయం సెషన్లో భారత స్పిన్‌, పేస్‌ ధాటికి ఎదురొడ్డి రెహాన్‌, హార్ట్లీ అదరగొట్టారు. బౌండరీలు బాదుతూ పోప్‌కు అండగా నిలిచారు. ఈ ఇద్దరి నిష్క్రమణతో ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. రికార్డు ద్వి శతకం ముంగిట పోప్‌.. బుమ్రా బంతికి వికెట్‌ కోల్పోయాడు. మార్క్‌వుడ్‌ (0) నిరాశపరచగా.. లీచ్‌ (0) నాటౌట్‌గా మిగిలాడు. ఉదయం సెషన్లో భారత్‌ 25.1 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లాండ్‌ 104 పరుగులు చేసింది. కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడిన పోప్‌.. డబుల్‌ సెంచరీ ఘనతకు నాలుగు దూరంలో నిలిచిపోయాడు. పోప్‌ అసమాన భారీ శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల లోటు అధిగమించి.. భారత్‌కు ఇంగ్లాండ్‌ 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 246/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 436/10
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : క్రావ్లీ (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 31, డకెట్‌ (బి) బుమ్రా 47, ఒలీ పోప్‌ (ఎల్బీ) బుమ్రా 196, జో రూట్‌ (ఎల్బీ) బుమ్రా 2, బెయిర్‌స్టో (బి) జడేజా 10, స్టోక్స్‌ (బి) అశ్విన్‌ 6, ఫోక్స్‌ (బి) అక్షర్‌ 34, రెహాన్‌ (సి) భరత్‌ (బి) బుమ్రా 28, హార్ట్లీ (బి) అశ్విన్‌ 34, మార్క్‌వుడ్‌ (సి) భరత్‌ (బి) జడేజా 0, లీచ్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 32, మొత్తం: (102.1 ఓవర్లలో ఆలౌట్‌) 420.
వికెట్ల పతనం : 1-45, 2-113, 3-117, 4-140, 5-163, 6-275, 7-339, 8-419, 9-420, 10-420.
బౌలింగ్‌ : బుమ్రా 16.1-4-41-4, అశ్విన్‌ 29-4-126-3, అక్షర్‌ 16-2-74-1, జడేజా 34-1-131-2, సిరాజ్‌ 7-1-22-0.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (ఎల్బీ) హార్ట్లీ 39, జైస్వాల్‌ (సి) పోప్‌ (బి) హార్ట్లీ15, గిల్‌ (సి) పోప్‌ (బి) హార్ట్లీ 0, రాహుల్‌ (ఎల్బీ) రూట్‌ 22, అక్షర్‌ (సి,బి) హార్ట్లీ 17, శ్రేయస్‌ (సి) రూట్‌ (బి) లీచ్‌ 13, జడేజా రనౌట్‌ 2, భరత్‌ (సి) హార్ట్లీ 28, అశ్విన్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) హార్ట్లీ 28, బుమ్రా నాటౌట్‌ 6, సిరాజ్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) హార్ట్లీ 12, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (69.2 ఓవర్లలో ఆలౌట్‌) 202.
వికెట్ల పతనం : 1-42, 2-42, 3-63, 4-95, 5-107, 6-119, 7-119, 8-176, 9-177, 10-202.
బౌలింగ్‌ : జో రూట్‌ 19-3-41-1, మార్క్‌వుడ్‌ 8-1-15-0, టామ్‌ హార్ట్లీ 26.2-5-62-7, జాక్‌ లీచ్‌ 10-1-33-1, రెహాన్‌ అహ్మద్‌ 6-0-33-0.

Spread the love