విస్తరిస్తున్న తప్పుడు సమాచారం

Spreading misinformation– మతం మనిషిని ఉన్మాదిని చేయకూడదు : భారత జాతీయ వాదం, మతోన్మాద ప్రమాదం పుస్తకావిష్కరణలో జస్టిస్‌ బి చంద్రకుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వాస్తవాలను వక్రీకరించి, నిజాలను పాతరేసి, తప్పుడు సమాచారం దేశంలో నేడు విస్తారంగా విస్తరిస్తున్నదని జస్టిస్‌ బి చంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే ఆధ్వర్యంలో’ భారత జాతీయ వాదం, మతోన్మాదం’, ‘అలనాటి సినీ నాటకరంగ ప్రముఖుల సంకలనం’ పుస్తకాలను చంద్రకుమార్‌ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ పుస్తకాలు రెండూ భిన్న ధృక్పధాలు కలిగినవన్నారు. సమాజానికి దశ, దిశను చూపుతున్నాయని చెప్పారు. నేటి సమాజంలో విలువలకు వలవలూడదీస్తున్న తరుణంలో ఆ పుస్తకాలనుంచి తగిన కర్తవ్యాలను తీసుకోవచ్చన్నారు. ముఖ్యంగా భారత జాతీయ వాదం, మతోన్మాదం అనే గ్రంథం చారిత్రాత్మకమైందన్నారు. చరిత్రలో జరిగిన సత్యాలను అద్దంలో చూపినట్టుగా రచయిత కండ్లకు కట్టినట్టుగా చూపించారని చెప్పారు. చారిత్రక అంశాలను ఉన్నవి ఉన్నట్టుగా చూపించటం ధైర్యంతో కూడుకున్న అంశంగా మారిందన్నారు. వాస్తవాలు మాట్లాడినా, రాసినా పాలకులు భరించలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా..నిజాన్ని బంధించటం సాధ్యం కాదని ఆ పుస్తకమే చెబుతుందన్నారు. ఎంతో మంది పాత తరం సినీ రంగ ప్రముఖల జీవిత విశేషాలతో పుస్తకాన్ని సంకలనం చేయటం వ్యయ ప్రయాసలతో కూడుకున్నదన్నారు. నిజానికి..దీన్ని ప్రభుత్వమే ముద్రించాలన్నారు. కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత జాతీయ వాదం, మతోన్మాదం పుస్తకాన్ని తెలుగులోకి అనువాదకులు, ఎస్వీకే మేనిజింగ్‌ ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్‌ వినరుకుమార్‌ మాట్లాడుతూ పుస్తక రచయిత రాంపునియాని చారిత్ర వాస్తవాలను బయటపెడుతూ అనేక రచనలు చేశారన్నారు. నిజాలను అంగీకరించని ఉన్మాదులు ఆయన్ను బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కల్బుర్గీ, గౌరీ లంకేశ్‌, గోవింద్‌ పన్సారేలాంటి వారిని హత్య చేసిన ఉన్మాదులు..తన లాంటి వారికి హాని తలపెట్టరని అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. పత్రికా స్వేచ్ఛ అంతరించిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దాశరథి థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో అక్కిరాజు సుందరరామకృష్ణ, ఏవీ రమణమూర్తి, సూరిబాబు, విజయదుర్గ, జీడికుంట వెంకట్రాములు తదితరులు హాస్య కథలు, వ్యంగోక్తులు, పద్యాలు చదివి వినిపించారు. కార్యక్రమానికి బీడీఎల్‌ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వినరుకుమార్‌తో పాటు జి బుచ్చిరెడ్డి, బాలోత్సవాల కమిటీ నాయకులు సుజావతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love