నా పక్కన నిలబడు… అందరూ చూస్తారు

stand by my side... Everyone will see–  మహిళా జర్నలిస్టు పట్ల తమిళనాడు బీజేపీ నేత అనుచిత ప్రవర్తన.. పాత్రికేయుల ఆగ్రహం
కోయంబత్తూరు : బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై అనుచిత ప్రవర్తన వివాదానికి దారితీసింది. విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్న అడిగిన మహిళా పాత్రికేయురాలిని కించపరిచేలా ఆయన మాట్లాడారు. దీనిపై పత్రికా సిబ్బంది మండిపడ్దారు. ఇంతకీ ఆ మహిళా జర్నలిస్టు ఏమని అడిగారంటే…మీరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాకపోయి ఉంటే పార్టీలోనే ఉండేవారా? అని. దీనిపై ఆగ్రహంతో ఊగిపోయిన అన్నామలై ఆ పాత్రికేయురాలి వంక చూసి తన పక్కకు వచ్చి నిలబడాలని, అప్పుడు ఆ ప్రశ్న అడిగినది ఎవరో అందరూ చూస్తారని చెప్పారు. ‘వచ్చి నా పక్కన నిలబడండి. ఇలాంటి ప్రశ్న అడిగింది ఎవరో టీవీలలో అందరినీ చూడనివ్వండి. ప్రశ్నలు అడగడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరో ఎనిమిది కోట్ల మంది ప్రజలకు తెలియాలి’ అని వ్యంగ్యంగా అన్నారు. కెమేరాల ముందుకు వచ్చి తనపక్కన నిలబడాలంటూ ఆయన పదేపదే మహిళా పాత్రికేయురాలికి సూచించారు. దీనిపై పాత్రికేయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను పూర్తి కాలపు రాజకీయవేత్తను కాదని, స్వతహాగా రైతునని, ఆ తర్వాతే రాజకీయవేత్తను అయ్యానని, అనంతరం బీజేపీలో చేరానని అన్నామలై చెప్పుకొచ్చారు. చివరికి పాత్రికేయుల నిరసనతో ఆయన వెనక్కి తగ్గారు. సరైన పద్ధతిలో ప్రశ్నలు అడగాల్సిందిగా మహిళా పాత్రికేయురాలికి సలహా మాత్రమే ఇచ్చానని అన్నారు. ‘సోదరీ…నేను ఓ మంచి ఉద్దేశంతో మీకు సలహా ఇచ్చాను’ అని సముదాయించే ప్రయత్నం చేశారు.
అన్నామలై ప్రవర్తనను కోయంబత్తూరు ప్రెస్‌క్లబ్‌ తీవ్రంగా ఖండించింది. పాత్రికేయులకు విలువల గురించి బోధించే ముందు నాయకుడు ఎలా విలువలు పాటించాలో, గౌరవప్రదంగా వ్యవహరించాలో అన్నామలై తెలుసుకోవాలని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఏఆర్‌ బాలు హితవు పలికారు. ‘నేను ఎవరిలోనూ ఇంత అహంకారం చూడలేదు. చివరికి జయలలిత, మోడీ, అమిత్‌ షాలో కూడా. ఈ మానవజాతిని ఉద్ధరించడానికి దేవుడు పంపిన బహుమతినని అన్నామలై అనుకుంటున్నారు’ అని కాంగ్రెస్‌ నాయకురాలు లక్ష్మీ రామచంద్రన్‌ వ్యాఖ్యానించారు.
అన్నామలై వ్యవహార శైలి కారణంగానే తమిళనాడులో బీజేపీతో అన్నా డీఎంకే తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. జయలలిత పైన, పార్టీ నేతల పైన అన్నామలై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడంతో బీజేపీ కూటమి నుండి అన్నా డీఏంకే వైదొలిగింది. పొత్తు విచ్ఛిన్నానికి కారకుడైన అన్నామలైపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బీజేపీ పెద్దలు ఆయనను వెనకేసుకురావడం గమనార్హం.

Spread the love