Wednesday, April 29, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రాష్ట్ర పోలీస్‌ సారథి సీవీ ఆనంద్‌

రాష్ట్ర పోలీస్‌ సారథి సీవీ ఆనంద్‌

- Advertisement -

– నూతన డీజీపీగా నియామకం
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– 30న ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ
– అదే రోజు లేదా మే1న ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ!
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ విభాగానికి కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీఓ ఆర్టీ నం.553 జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న ఆనంద్‌ను బదిలీ చేసి, ఎంపిక ప్రక్రియ అనంతరం డీజీపీగా నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం ఎంపానెల్‌ కమిటీ సిఫారసుల ఆధారంగా ఈ నియామకం జరిగినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామక్రిష్ణరావు వెల్లడించారు. కాగా ప్రస్తుత డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేస్తున్నారు. అదే రోజు లేదా మరుసటి రోజు (మే1న) రాష్ట్ర పోలీసు పగ్గాలను ఆనంద్‌ చేపట్టనున్నారని తెలిసింది. అదే సమయంలో మరికొందరు సీనియ ఐపీఎస్‌ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం.

1968 జూన్‌ 5న హైదరాబాద్‌ పాతబస్తీలోని పేట్లబుర్జ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన ఆనంద్‌, విద్యారంగంలోనే కాక క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, నిజాం కాలేజ్‌లో చదివిన ఆయన, ఉస్మానియా j¶నివర్సిటీలో ఎకనామిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. యువకుడిగా హైదరాబాద్‌ అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన, కెరీర్‌ ప్రారంభంలోనే మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో ధైర్యవంతమైన ఆపరేషన్లతో గుర్తింపు పొందారు. నిజామాబాద్‌ ఎస్పీగా పనిచేసిన సమయంలో నక్సలిజాన్ని అదుపులోకి తీసుకువచ్చినందుకు ప్రెసిడెంట్‌ గ్యాలెంట్రీ మెడల్‌ అందుకున్నారు.
హైదరాబాద్‌ నగరంలో డీసీపీగా పనిచేసిన సమయంలో గణేశ్‌ నిమజ్జన నిర్వహణలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు. ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా ఈ-చలాన్‌, డ్రంక్‌ డ్రైవింగ్‌ నియంత్రణ, ఆటోమేటిక్‌ సిగలింగ్‌ వంటి పద్ధతులను ప్రవేశపెట్టి ట్రాఫిక్‌ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. సైబరాబాద్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో మహిళల భద్రత కోసం ‘షీ టీమ్స్‌’, సీసీటీవీల విస్తరణ వంటి కీలక చర్యలు చేపట్టారు. యాంటీ కరప్షన్‌ బ్యూరో (ఏసీబీ) డీజీగా, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు రేషన్‌ వ్యవస్థలో ఈ-పాస్‌ యంత్రాలు, జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమలు చేసి పారదర్శకతను పెంచారు. కేంద్ర డిప్యూటేషన్‌లో సీఐఎస్‌ఎఫ్‌లో ఐజీగా పనిచేసి దేశవ్యాప్తంగా విమానాశ్రయ భద్రతను పర్యవేక్షించారు. అనంతరం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి నగరంలో శాంతి భద్రతలను సమర్థంగా నిర్వహించారు. నార్కోటిక్స్‌, సైబర్‌ క్రైమ్‌ నియంత్రణలో కీలక పాత్ర పోషించారు. 2025లో దుబారులో జరిగిన వరల్డ్‌ పోలీస్‌ సమ్మిట్‌లో నార్కోటిక్స్‌ నియంత్రణలో ఉత్తమ ప్రతిభకు అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. ఇటీవల హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీగా పనిచేసిన ఆయన, ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత పోలీస్‌ హోదా డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తంగా 35 ఏండ్ల సుదీర్ఘ సేవలో సాంకేతికత, పారదర్శకత, కఠిన పరిపాలనతో ముందుకు సాగే అధికారిగా సి.వి. ఆనంద్‌ పేరు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -