స్టోయినిస్‌ షో

స్టోయినిస్‌ షో– ముంబయిపై లక్నో గెలుపు
– ముంబయి 144/7, లక్నో 145/6
లక్నో : మార్కస్‌ స్టోయినిస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఊరించే ఛేదనలో అర్థ సెంచరీ సాధించిన మార్కస్‌ స్టోయినిస్‌ (62, 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెరుపు విజయాన్ని అందించాడు. కెఎల్‌ రాహుల్‌ (28), దీపక్‌ హుడా (18), నికోలస్‌ పూరన్‌ (14 నాటౌట్‌) రాణించారు. 19.2 ఓవర్లలోనే లాంఛనం ముగించిన లక్నో సీజన్లో ఆరో విజయం నమోదు చేసింది. అంతకముందు, లక్నో సూపర్‌జెయింట్స్‌ బౌలర్లు పంజా విసిరారు. పవర్‌ప్లేలోనే విజృంభించిన బౌలర్లు ముంబయి ఇండియన్స్‌ టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేశారు. నెహాల్‌ వదేరా (46, 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్‌ డెవిడ్‌ (35 నాటౌట్‌, 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకోవటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్‌ సీజన్లో ఏడో పరాజయంతో ప్లే ఆఫ్స్‌ రేసుకు దాదాపుగా దూరం కాగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌ మూడో స్థానానికి ఎగబాకింది. మార్కస్‌ స్టోయినిస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Spread the love