ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

An erupting volcano in Indonesia– ఐదు కిలోమీటర్ల మేర వెదజల్లుతున్న లావా, బూడిద
– వేలాదిమంది ప్రజల తరలింపు
మనడో (ఇండోనేషియా) : ఇండోనేషియాలోని మౌంట్‌ రువాంగ్‌ అగ్నిపర్వతం బద్దలై పెద్ద మొత్తంలో బూడిదను, లావాను వెదజల్లుతోంది. ఐదు కిలోమీటర్లకు పైగా లావా ప్రవహిస్తోంది. ఈ నెల్లోనే ఈ అగ్నిపర్వతం పలుసార్లు విస్ఫోటనం చెందిందని, ఉన్నత స్థాయి అలర్ట్‌ను జారీ చేశామని అధికారులు తెలిపారు. దీంతో ఆ సమీప ప్రాంతాల నుండి 6వేల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. ఇంకా వేలాదిమందిని తరలించాల్సి వుంది, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్‌ ముహారి పత్రికా సమావేశంలో తెలిపారు. సైన్యం, పోలీసులు ఈ తరలింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ప్రజలు, అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని, అగ్నిపర్వతం ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అగ్నిపర్వత అధ్యయన వ్యవహారాల సంస్థ హెచ్చరించింది.
ఇండోనేషియాలోని ఉత్తర సులవేశి ప్రావిన్స్‌లో వున్న రువాంగ్‌ అగ్నిపర్వతం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 1.15 గంటలకు విస్ఫోటనం చెందింది. ఆ తర్వాత రెండుసార్లు కూడా లావా, బూడిదను వెదజల్లిందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశంలో దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా ఎత్తున బూడిద మేఘాలు తయారయ్యాయని పేర్కొంది. అగ్నిపర్వతం క్రియాశీలంగా వుండి నిప్పులు కక్కుతున్నపుడు పెద్ద పెద్ద రాళ్లు, దుమ్ము ధూళి వచ్చే ప్రమాదముందని ప్రజలు సమీప ప్రాంతాల్లో వుండరాదంటూ హెచ్చరించడంతో రువాంగ్‌కు ఏడు కిలోమీటర్ల మేరా నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు. యుద్ధ నౌకను, సహాయ నౌకను రంగంలోకి దించారు. సునామీ కూడా వచ్చే ప్రమాదముందని, అందువల్ల తీర ప్రాంతాల్లో ఎవరూ వుండొద్దంటూ ప్రభుత్వ ప్రతినిధి హెచ్చరించారు. 1871లో ఇలాగే ఈ పర్వతం బద్దలై పెద్ద సంఖ్యలో కొండచరియలు విరిగిపడి సముద్రంలో కూలిపోవడంతో స్థానికంగా పెద్ద ఎత్తున వచ్చిన అలలతో దాదాపు 400మంది మరణించారు. అనేక తీరప్రాంత గ్రామాలు మునిగిపోయాయి.

Spread the love