– మత్స్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
రెగ్యులర్ ఉద్యోగులతో సమానం గా పని చేస్తున్నామనీ, తమ సేవలను క్రమబద్ధీకరించాలని మత్స్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని మత్స్యభవన్ ముందు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమేశ్ నాయకత్వంలో ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరేండ్లుగా సేవలందిస్తున్నట్టు తెలిపారు.
గ్రామీణ స్థాయిలో మత్స్య పరిశ్రమ అభివద్ధి కోసం ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫిషర్‌మెన్‌లుగా తమ సేవలు కీలకమని తెలిపారు. వెట్టిచాకిరీ చేస్తున్నా… చాలీ చాలనీ జీతాలు, అవి కూడా ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారని విమర్శించారు. టీఏ, డీఏలు, బీమా సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిని పెంచడంతోపాటు, మత్య్స సంపదను దేశ, విదేశాలకు ఎగుమతి చేయడంలో తాము కల్పించే అవగాహన కీలకమని తెలిపారు.