సహకారం మరింత బలోపేతం

సహకారం మరింత బలోపేతం– హసీనా, మోడీ చర్చలు
న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం చర్చలు జరిపారు. వాణిజ్యం, అనుసంధానంతో సహా పలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించు కోవడంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ నేత భారత్‌లో జరిపిన అధికారిక పర్యటన ఇదే. రెండు రోజుల పర్యటన నిమిత్తం హసీనా శుక్రవారం ఢిల్లీ వచ్చారు. గత ఐదేళ్ళ కాలంలో ఇరువురు నేతలు పదిసార్లు సమావేశాలు జరిపారని, వీటివల్ల ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధృర్‌ జైస్వాల్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. శనివారం ఉదయమే రాజ్‌ఘాట్‌ను సందర్శించిన హసీనా మహాత్మునికి ఘనంగా నివాళి అర్పించారు. చర్చలకు ముందు హసీనాకు రాష్ట్రపతి భవన్‌ వద్ద సాదర స్వాగతం లభించింది. వాణిజ్యం, అనుసంథానం, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చేందుకు ఈ చర్చలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.
పొరుగుదేశాలకు ప్రాధాన్యతా విధానం కింద భారత్‌కు బంగ్లాదేశ్‌ కీలకమైన భాగస్వామి. భద్రత, వాణిజ్య,ం ఇంథనం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రక్షణ, సముద్ర జల వ్యవహారాలు తదితర రంగాల్లో సహకారం ఇప్పటికే వుంది. దక్షిణాసియాలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా బంగ్లాదేశ్‌ వుంది. ఆసియాలో బంగ్లాదేశ్‌కు భారత్‌ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వుంది.

Spread the love