నవతెలంగాణ – పరకాల : పరకాల డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామంలో రైతులు వరి, మొక్కజొన్న కొయ్యలను తగులబెట్టవద్దని పరకాల ఆర్డీవో స్పష్టం చేశారు. బుధవారం ఆయన వ్యవసాయ శాఖ ఏడీతో ప్రత్యేకంగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిన కొయ్యలకు నిప్పు అంటించడం వల్ల తీవ్ర అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ఇటువంటి చర్యల వల్ల పక్కనే ఉన్న ఇతర పంటలు, ఆస్తులు కాలిపోయి భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మండల, గ్రామాల వారీగా రైతులకు అగ్ని ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులందరూ అధికారుల సూచనలు పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన కోరారు.



