వక్ఫ్ మాఫియా పై కఠిన క్రిమినల్ చెర్యలు తీసుకోవాలి… 

-వక్ఫ్ ఆస్తులను రక్షించి, వక్ఫ్ బోర్డు కు న్యాయ అధికారాలు కల్పించండి 
– సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా డిమాండ్..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
వక్ఫ్ మాఫియా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమౌతున్న వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను రక్షించి, వక్ఫ్ బోర్డు కు కమిషనరేట్ ఏర్పాటు చేసి న్యాయ అధికారాలు కల్పించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి, అఖిల భారత తంజీమ్ ఏ ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. హైదరాబాద్, గన్ ఫౌండ్రి, మీడియా ప్లస్ సమావేశం మందిరంలో గురువారం ” వక్ఫ్ ఆస్తులను రక్షించి, వక్ఫ్ బోర్డు కు న్యాయ అధికారాలు కల్పించాలని కోరుతూ అఖిల భారత ముస్లిం మైనారిటీ సంస్థ, అఖిల భారత తంజీమ్ ఏ ఇన్సాఫ్ సంయుక్తాధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావెశం అఖిల భారత ముస్లిం మైనారిటీ సంస్థ ప్రధాన కార్యదర్శి ఏం.ఏ. సిద్దికీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సయ్యిద్ అజీజ్ పాషా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని 80 % వక్ఫ్ బోర్డు భూములు కనుమరుగు అయ్యానని, కొన్ని భూములు బడా రియల్ ఎస్టేట్ భూకబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. వక్ఫ్ మాఫియా ఇప్పటికి రెచ్చిపోతూ  వక్ఫ్ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్న, భారీ వక్ఫ్ ఆస్తులను మోసపూరితంగా విక్రయిస్తున్న, వక్ఫ్ అధికారులు పట్టించుకోవడంలేదని అయన ఆరోపించారు. మతపరమైన లేదా మానవతా కార్యకలాపాల అవసరాల కోసం దానం చేయబడ్డ వేల కోట్ల వక్ఫ్ ఆస్తులను కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. హిందూ దేవాలయాల ఆస్తుల రక్షణ కోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖకు కమిషనరేట్ హోదా, న్యాయ అధికారాలు కల్పించినట్లు, వక్ఫ్ బోర్డు కు న్యాయ అధికారాలు ఎందుకు కల్పించడంలేదని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో వక్ఫ్ బోర్డు కార్యాలయం నుండి 2186 దస్త్రాలు కనిపించకుండా పోయాయని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం డి.ఎస్.పి స్థాయి అధికారిని విచారణ కోసం నియమించిన ఇప్పటివరకు ఎలాంటి ఫలితం దక్కలేదని అయన అన్నారు. 2017 సంవత్సరం నుండి వక్ఫ్ బోర్డు దస్తాలన్నీ ఒక గదిలో తాళం వేసి పెట్టారని, కోర్టు కేసుల్లో దస్త్రాలు లేకుండా వక్ఫ్ స్టాండింగ్ కౌన్సిల్ ఎలా వాదిస్తుంది అయన ప్రశ్నించారు. తెలంగాణలో రూ.లక్ష కోట్ల విలువైన వక్ఫ్ భూములను మింగిన తిమింగలాలు ఉన్నాయని, స్మశాన భూములను కూడా వదలకుండా అనధికార నిర్మాణాలను చేపడుతున్నారని, ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే స్పందించి వక్ఫ్ మాఫియా పై కఠిన క్రిమినల్  చెర్యలు తీసుకొని, రాష్ట్రంలో కబ్జాకు గురైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని రక్షించాలని సయ్యిద్ అజీజ్ పాషా విజ్ఞప్తి చేసారు. ఏం.ఏ. సిద్దికీ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుందని, వక్ఫ్ ఆస్తుల రక్షణకై మరియు వక్ఫ్ బోర్డు కు కమిషనరేట్ ఏర్పాటు చేసి న్యాయ అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జులై రెండో వారంలో సామూహిక ధర్నాను నిర్వహిస్తున్నామని ఏం.ఏ. సిద్దికీ తెలిపారు. అఖిల భారత ముస్లిం మైనారిటీ సంస్థ అధ్యక్షులు సయ్యిద్ ముక్తార్ హుస్సేన్, నేతలు ప్రో. అన్వర్, ఎండి. అలీ, తహసీమ్ మజార్, కాంగ్రెస్ నేత ఎస్కె. ఆఫ్జాల్ ఉద్దీన్, బాంసెఫ్ నేత డా. కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love