ఉప సర్పంచ్ కొండగొర్ల బాణయ్య చేరికతో కాటారం కాంగ్రెస్ లో జోష్
నవతెలంగాణ – కాటారం
కాటారం మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాటారం గ్రామ ఉప సర్పంచ్ కొండగొర్ల బాణయ్య ఆదివారం ఘనంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో బాణయ్యకు పార్టీ కండువా కప్పి అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి ప్రజల నమ్మకం గెలుచుకున్న నాయకులు కాంగ్రెస్ వైపు రావడం ప్రజల్లో పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఉప సర్పంచ్ బాణయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన తనను ఆకర్షించాయని తెలిపారు. గ్రామ ప్రజల అభ్యున్నతి కోసం మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో మరింత చురుకుగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ చేరికతో కాటారం మండలంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చిందని స్థానిక రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీగా పాల్గొని బాణయ్యను అభినందించారు.



