నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై అధ్యయనం చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలోని అధ్యయన బృందం విజయవాడకు వెళ్లింది. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విలీనం తర్వాత అక్కడి కార్మికుల పని, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి, వాటిలో అవసరమైన మార్పులు, చేర్పుల్ని సూచించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్య దర్శి కే రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావుతో టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అద్యయన బందం బేటీ అయ్యింది. పలు అంశాలపై వివరణలు అడిగి తెలుసుకున్నామనీ, ఇతర సంఘాలు, అధికారుల్ని కూడా కలిసి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధ్యయన నివేదిక సమర్పిస్తామని రాజిరెడ్డి తెలిపారు.