– కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్
నవతెలంగాణ కమ్మర్ పల్లి: కష్టపడితే విజయం సాధ్యమేనని కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. ఇటీవల ప్రకటించిన కానిస్టేబుల్స్ ఫలితాల్లో విజయం సాధించిన మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువతీ యువకులను ఎస్ఐ రాజశేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఘనంగా సన్మానించారు. శాలువాల పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సమయం వృధా చేయకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే ఫలితాలు వస్తాయనడానికి ఈ కానిస్టేబుల్స్ నిదర్శనం అన్నారు. సమయం చాలా విలువైందని, దానిని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటామనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. చేసే ఉద్యోగం ఏదైనా ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించడమే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.