చెరుకు చేదే…

– ఎంఎస్‌పీ కేవలం రూ.10 పెంపు
– కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : చెరుకు రైతులకు కేంద్రం తీపి కబరు వినిపించలేదు. ఈ పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను కేవలం రూ.10 మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం సమావేశం నిర్ణయం తీసుకుంది. సమావేశ అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌ (ఎన్‌ఎంసీ)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, మనుసుఖ్‌ మాండవీయా మాట్లాడారు. కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన నిర్ణయాలను వెల్లడించారు. చెరుకు పంటకు ఏటా ప్రకటించే పెయిర్‌ అండ్‌ రెమ్యునరేటివ్‌ ప్రైస్‌ (ఎఫ్‌ఆర్‌పీ) ధరను ఈ సీజన్‌లో క్వింటాలు రూ.10 చొప్పున పెంచి రూ. 315 నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ తీసుకుందని తెలిపారు. ఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది చెరకు రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అక్టోబర్‌ నుంచి మొదలయ్యే సీజన్‌లో చక్కెర కర్మాగారాలు రైతులకు క్వింటాల్‌పై సరసమైన, ప్రోత్సాహకర ధర (ఎఫ్‌ఆర్‌పి)గా రూ.315గా చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఎఫ్‌ఆర్‌పీ రూ.305గా ఉండగా, 2023-24 ఏడాదికి గాను క్వింటాల్‌పై రూ.315 కేంద్రం నిర్ణయించినట్టు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

Spread the love