సూటు..బూటు సర్కార్‌

Suit..Bootu Sarkar– ఇది అదానీ-అంబానీల ప్రభుత్వం మోడీ సర్కారుపై వ్యాపారుల అసంతృప్తి
– వారిద్దరికే కొమ్ము కాస్తోందని ఆరోపణ
 – కార్మిక, వ్యాపార వర్గాల్లో పెరుగుతున్న వ్యతిరేకత
– దూరమవుతున్న దిగువ మధ్యతరగతి ప్రజలు
నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గతంలో ‘సూటు బూటు సర్కారు’గా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ రాజకీయ వ్యంగ్యోక్తిని అందిపుచ్చుకున్నారు. రాజధానిలో నివసించే కార్మికులు అత్యధిక సంఖ్యలో అమ్‌ఆద్మీ పార్టీకి మద్దతు తెలపడం వెనుక ఈ వ్యాఖ్య ప్రభావం ఎంతైనా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలోని కార్మిక వర్గం అందించిన మద్దతుతో అమ్‌ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 2015 శాసనసభ ఎన్నికల్లో మోడీ, కేజ్రీవాల్‌ మధ్య జరిగిన ప్రచార పోరులో కూడా కార్మికుల సమస్యలే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. చివరికి వారు కేజ్రీవాల్‌ను హీరోను చేశారు. ఆ ఓటమిని మోడీ ఇంకా మరచిపోలేదు. ఆప్‌పై, కేజ్రీవాల్‌పై విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆయన్ని అరెస్టు చేయించి, జైలులో పెట్టించారు.
న్యూఢిల్లీ : కేజ్రీవాల్‌కు కొద్ది రోజుల క్రితమే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విడుదలైన వెంటనే ఆయన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని బరిలో దిగారు. విద్యార్థి నేత కన్హయ కుమార్‌ను కాంగ్రెస్‌ పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీకి నిలిపింది. ఎన్నికల్లో కులమే ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజధానిలో మాత్రం అందుకు భిన్నంగా వర్గ సమీకరణలు అభ్యర్థుల తలరాతలు మారుస్తున్నాయి. సంపన్నులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు బీజేపీ వైపు నిలబడగా కార్మికులు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఆప్‌ పక్షాన నిలిచారు.
మోడీకి ప్రజాదరణ తగ్గుతోంది
దేశ రాజకీయాల్లో కుల విధేయతల కంటే ఆర్థిక ప్రయోజనాలు, ప్రజా సమస్యలే కీలక పాత్ర పోషిస్తాయని సెఫాలజిస్ట్‌గా మారిన ఆర్థికవేత్త సుర్జిత్‌ భల్లా అభిప్రాయపడ్డారు. 1980వ దశకం నుండి ఆయన ఓటింగ్‌ తీరును విశ్లేషిస్తున్నారు. నిరుద్యోగం, అసమానతలు వంటి సమస్యల కారణంగా మధ్యతరగతి ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారని, ఈ నేపథ్యంలో మోడీకి ప్రజాదరణ తగ్గిపోతోందని విమర్శకులు తెలిపారు. ఈ ఎన్నికల్లో కులాలు…ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, ఎస్సీల మద్దతు కీలక పాత్ర పోషిస్తుందా లేక జీవనోపాధి వంటి వర్గ కారకాలు కీలక పాత్ర పోషిస్తాయా అనేది చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో అటు కుల, ఇటు వర్గ సంబంధమైన అంశాలను ప్రస్తావిస్తోంది. అగ్రకులాలు, వారి మద్దతు గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. బడా వ్యాపారవేత్తలు గౌతమ్‌ అదానీ, ముకేష్‌ అంబానీలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.
ఎంఎస్‌ఎంఈల కినుక
మోడీ సహా బీజేపీ నేతలు ఓ వైపు ముస్లిం వ్యతిరేక సెంటిమెంటును రెచ్చగొడుతూ హిందూ ఓట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కులం, వర్గం కార్డులు ప్రయోగిస్తూ ద్విముఖ వ్యూహాన్ని తఅమలు చేస్తున్నారు. అందులో భాగంగానే తన వ్యాపార సన్నిహితులకు దూరం జరిగినట్లు ప్రధాని నటిస్తున్నారు. అదానీ, అంబానీలు అక్రమ సంపాదన, నల్లధనాన్ని పొగేసి అందులో కొంత భాగాన్ని కాంగ్రెస్‌ పార్టీకి అప్పగించారని మోడీ ఇటీవల ఆరోపించారు. మోడీ వ్యాఖ్య వెనుక రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది…ఎన్నికల బాండ్ల పథకం ఆర్థికపరంగా బీజేపీకి లబ్ది చేకూర్చి ఉండవచ్చు కానీ రాజకీయంగా నష్టం కలిగించింది. వ్యాపారవేత్తల నుండి ఇతర పార్టీలకు కూడా విరాళాలు అందాయని చెప్పేందుకు మోడీ ప్రయత్నించారు. ఇక రెండోది…సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) బీజేపీకి పెద్దగా విధేయత చూపవు. మోడీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకే ప్రయోజనం కలిగిస్తోందని, తమను పట్టించుకోవడం లేదని అవి భావిస్తున్నాయి.
వ్యాపార వర్గంలో విభజన
వీటిలో రెండో అంశంతో రాజకీయ విశ్లేషకులు పెద్దగా ఏకీభవించరు. మోడీ, అదానీ మధ్య ఉన్న సంబంధాన్ని సాధారణ ప్రజలు సరిగా అర్థం చేసుకోలేదు. కానీ ఎంఎస్‌ఎంఈలకు ఆ విషయం బాగా బోధపడింది. పెద్ద నోట్లను రద్దు చేయడం, జీఎస్టీని ప్రవేశపెట్టడం, ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడుల్లో స్తబ్దత ఏర్పడడం వంటి పరిణామాలు ఎంఎస్‌ఎంఈ రంగాన్ని దెబ్బతీశాయి. మరోవైపు బడా కార్పొరేట్‌ సంస్థలు, లిస్టెడ్‌ కంపెనీలు బాగా కూడబెట్టుకుంటున్నాయి. వాటి పనితీరు బాగానే ఉంది. ఈ వైరుధ్యాల కారణంగా వ్యాపార వర్గం అంతర్గతంగా విడిపోయింది.
వారిలోనూ అసంతృప్తి
మోడీ ప్రభుత్వ పనితీరుపై వ్యాపార వర్గాల్లో ఎప్పుడు చర్చ జరిగినా కచ్చితంగా అదానీ ప్రస్తావన వస్తుంది. ఈ విషయంలో వ్యాపారులు కేంద్ర ప్రభుత్వాన్ని…ముఖ్యంగా మోడీ, ఆయన మంత్రులను విమర్శిస్తుంటారు. అదానీ విషయంలో మోడీ సానుకూలంగా వ్యవహరిస్తారని వారి ఆరోపణ. ఢిల్లీలో అదానీ తన పలుకుబడిని ఉపయోగించి ముంబయి విమానాశ్రయం నుండి జీవీకే గ్రూపును ఎలా తప్పించారో హైదరాబాదులో ఉన్న వ్యాపారవేత్తలందరికీ తెలుసు. ‘సూటు బూటు సర్కారు’ అనే ఆరోపణ ఇప్పుడు పాతబడిపోయింది. నెహ్రూ-ఇందిర కాలంలో కమ్యూనిస్టులు ఇచ్చిన నినాదం (టాటా బిర్లాల ప్రభుత్వం) ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం మోడీది ‘అదానీ-అంబానీల ప్రభుత్వం’ అనే వ్యాఖ్యే ఎక్కువగా విన్పిస్తోంది.

Spread the love