ఒక గీతను చిన్నదిగా మార్చాలంటే దాని పక్కన పెద్దగీత గీస్తే సరిపోతుందనేది తెలివిగల వారు చెప్పే సూత్రం. మన దేశంలో బూర్జువా రాజకీయ నాయకులకు మించిన తెలివిగల వారు లేరనేది మనం ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించాల్సిన విషయం. ఎందుకంటే వారు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపిస్తూ కనికట్టు చేయగల దిట్టలు కాబట్టి. ఇప్పుడు ఎన్నికల కాలం, అందువల్ల… ఆ దిట్టలు మరింత రసపట్టుగా ‘చిన్న గీత’లను ‘పెద్దగీతలు’గా మార్చేస్తున్నారు. గతంలో స్వయంగా వారే చెప్పిన ముఖ్యమైన అంశాలను జనం మరిచిపోవాలంటే అంతకు మించిన మరో విషయాన్ని తెరపైకి తీసుకురావాలి. ప్రధాన పార్టీలు సరిగ్గా ఇప్పుడు అదే తంత్రాన్ని ప్రయోగిస్తున్నాయి ఎన్నికల ప్రణాళికల రూపంలో.
రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్ 2014లో తెలంగాణ తెచ్చామంటూ చెప్పుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుపెట్టి ఎలక్షన్‌లలో గట్టెక్కింది. ఇప్పుడు మూడోసారి ఆ రెండు ఎన్నికల్లో చెప్పిన అంశాలను మరుగు పరిచే విధంగా మరికొన్ని హామీలను గుప్పించింది. అయితే గతంలో చెప్పిన వాగ్దానాలకే బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. ఆ భారం భరించలేక అనేక ప్రతి ష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు నత్తనడకన నడుస్తు న్నాయి. వీటిలో కొన్ని అటకెక్కాయి కూడా. పేదలకు వర మంటూ సర్కారు చెబుతున్న ఆరోగ్యశ్రీ పథకానికి దాదాపు రూ.20 వేల కోట్ల మేర బిల్లులు పేరుకుపోయాయంటూ ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతు న్నాయి. దీంతో తమ వద్ద దాన్ని అమలు చేయలేమంటూ ఆయా ఆస్పత్రులు చేతులెత్తేశాయి. విద్యార్థులకు మెస్ బిల్లులు, స్కాలర్ షిప్పుల రూపంలో మరో రూ.ఐదు వేల కోట్లు సర్కారు బకాయి పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి నిధుల్లేక దాదాపు ఐదారేండ్ల యింది. అది రాకపోవటంతో బీటెక్ చేసిన పిల్లల ధృవపత్రాలను ఇచ్చేందుకు ఇంజినీరింగ్ కాలేజీలు ససేమిరా అంటున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థలను బలోపేతం చేశామంటూ చెబుతున్న సర్కారు… గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేక చతికిలబడుతోంది. దీంతో అప్పుల పాలవుతున్న సర్పంచులు ఆత్మ హత్యలకు పూనుకుంటు న్నారు. దళితులకు మూడెక రాల భూ పంపిణీ అటకె క్కింది. డబ్బుల్లేక దీన్ని అమలు చేయలేకపోతున్నామంటే ఎక్కడ పరువు పోతుందేమోననే భయం తో… ‘ఇది నిరంతర ప్రక్రియ…’ అంటూ ప్రభుత్వం సాకులు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతోంది. తెలంగాణ వచ్చిన కొత్తలో మనది ధనిక రాష్ట్రమంటూ గొప్పలకు పోయిన కేసీఆర్ సర్కారు… రాష్ట్ర విభజన అనంతరం మన కొచ్చిన రూ.60 వేల కోట్ల అప్పును, ఇప్పటికి రూ.3 లక్షల కోట్ల కుప్పగా మార్చింది. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, కరోనా వెరసి… దెబ్బ మీద దెబ్బ పడటంతో 2020 నుంచి ఇప్పటి వరకూ రూ.లక్ష కోట్ల మేర నష్టపోయా మంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే సెలవిచ్చారు. అయినా మొన్నటి మేనిఫెస్టోలో మరోసారి వాగ్దానాల వర్షం కురిపించారు. అయితే గత రెండు ధపాల అను భవం కావొచ్చేమో…’ఆర్థిక పరిస్థితిని బట్టి, సాధ్యా సాధ్యాలను పరిశీలించి…’ వీటిని అమలు చేస్తామంటూ సెలవిచ్చారు. దీన్నిబట్టి… ఎన్నికల తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించటం లేదు కాబట్టి వీటిని అమలు చేయలేమనైనా అనొచ్చు.. లేదంటే అప్పులను మరింతగా పెంచి, వాటిని అమలు చేసేందుకు ధైర్యం చేయొచ్చన్నది నిపుణుల అంచనా.
ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. అందులో సఫలీకృతమైంది. అర్హులైన పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, అర్హులైన మహిళలకు రూ.2,500 పింఛన్, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, రైతులకు ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం తదితరాంశాలను అది ఏకరువు పెట్టింది. అయితే ఈ హామీలను అమలు చేసేందుకు ఆర్థిక వనరులను ఎక్కడి నుంచి సమీకరించుకుంటారనేది కీలకం. ఆ విషయాన్ని కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. సరళీకరణ విధానాలకు ద్వారాలు తెరిచిన కాంగ్రెస్ వల్లే… పెట్రోల్, డీజిల్ ధరలు, ఇతర అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయనేది కూడా కాదనలేని వాస్తవం. బీజేపీ ఇప్పటి వరకూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించనప్పటికీ దాని మేనిఫెస్టో సైతం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు భిన్నంగా ఉండబోదు. హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఉచిత పథకాలను గమనిస్తే ఇదే విదితమవుతున్నది.
అందువల్ల అది బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా పార్టీ ఏదైనా… ఎలాంటి మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి..? వాటి అమలు సాధ్యసాధ్యాలేంటి? ఆర్థిక వనరులు ఎక్కడనుంచి సమీకరించుకుంటారు? అనే కీలకాం శాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలా పరిశీలించి ఒక సమగ్ర దృక్పథంతో, సామాజిక లక్ష్యంతో, సమానాభివృద్ధి, సంపద పెంపు కోసం ఆయా పార్టీలు ఎన్నికల ప్రణాళికలను రూపొందించాలి. అప్పుడే అది ప్రజామేనిఫెస్టో అవుతుంది. లేదంటే ఫక్తు రాజకీయ, ఓట్ల ప్రణాళికగా మారుతుంది.