అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్‌ ఓటు

US presidential election Sunita Williams' vote from space– రోదసీలో మరింత కాలం వుండడం ఆనందంగా వుందని వ్యాఖ్య
వాషింగ్టన్‌ : నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతరిక్షం నుండే ఓటు వేయాలని నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు భావిస్తున్నారు. ప్రస్తుతం వారు అంతర్జాతీయ రోదసీ స్టేషన్‌లో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి వరకు ఇక్కడే వుండే అవకాశం వుంది.
” ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరులుగా చాలా ముఖ్యమైన విధి. ఈసారి రోదసీ నుండే ఓటు వేయడం కోసం ఎదురుచూస్తున్నా” అని సునీతా విలియమ్స్‌ వ్యాఖ్యానించారు. అంతరిక్ష రోదసీ కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుండి సునీతా (58), విల్మోర్‌ (61)లు శుక్రవారం పత్రికా సమావేశంలో విలేకర్లతో మాట్లాడారు. వారిద్దరు లేకుండా స్టార్‌లైనర్‌ భూమికి తిరిగి వచ్చిన వారం రోజుల తర్వాత వీరు ఈ సమావేశంలో మాట్లాడారు. కాగా తాను బ్యాలట్‌ ఓటు వినియోగించుకోవడం కోసం అధికారుల అనుమతిని కోరానని విల్మోర్‌ చెప్పారు.
జూన్‌ నుండి వీరిద్దరికి రోదసీనే నివాసంగా మారిపోయింది. 8 రోజుల పర్యటన కోసం బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో వచ్చిన వీరు, అంతరిక్ష నౌకలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరిగి భూమికి వెళ్ళలేకపోయారు. పలు సమస్యలను ఎదుర్కొంటున్న స్టార్‌లైనర్‌ అంతరిక్ష నౌకకు మరమ్మత్తులు చేశామని, ప్రస్తుతం అది ప్రయాణానికి సురక్షితంగానే వుందని బోయింగ్‌ చెప్పినా నాసా అందుకు అంగీకరించలేదు. వారిని ఫిబ్రవరి వరకు అంతరిక్ష కేంద్రంలోనే వుండాల్సిందిగా కోరింది.
”కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇక్కడ రోదసీలో, అంతరిక్ష నౌకలో వుండడం తనకు చాలా ఆనందాన్నిస్తుందని సునీతా వ్యాఖ్యానించారు. మీరు లేకుండా స్టార్‌లైనర్‌ భూమికి తిరిగి వెళ్లిపోవడం కష్టంగా అనిపించిందా అని విలేకర్లు ప్రశ్నించగా, అది కష్టమైన నిర్ణయమే అయినా ఇక్కడ కొనసాగడం సంతోషంగా వుందన్నారు. తాను, విల్మోర్‌ నేవీలో పని చేశామని, అందువల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారినపుడు తాము ఆశ్చర్యపోలేదన్నారు. ఇది రిస్క్‌తో కూడినదే అయినా సాఫీగా జరిగిపోతుందన్నారు. ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు వ్యోమగాములతో కలిసి వీరిద్దరు వుంటున్నారు.

Spread the love